ర్భిణీలు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏవి తినాలి ఏవి తినకూడదనే దాని గురించి పూర్తి అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. అప్పుడే పుట్టే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి గర్భిణీలు పోషకాలు, మాంసకృతులు, ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. ఇవి మీకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి. చలికాలంలో పోషకాహారం అధికంగా ఉండే తాజా పండ్లు తీసుకోవాలి. వాటితో పాటు వీటిని కూడా మీ జాబితాలో చేర్చుకోండి..


కొవ్వు చేపలు


చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. శిశువు మెదడు, కళ్ళ అభివృద్ధికి ఒమేగా ఆమ్లాలు దోహదపడతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కొవ్వు చేపలు జింక్, సెలీనియం, విటమిన్ డి దొరికే అద్భుతమైన వనరులు. వారానికి కనీసం మూడు సార్లు అయినా చేపలు తినడం మంచిది.


చిక్కుళ్ళు


కాయధాన్యాలు, బీన్స్, శనగలు, సోయాబీన్స్, చిక్కుళ్ళు వంటివి తినాలి. గర్భధారణ సమయంలో శరీరానికి పోషకాలు అవసరం. వీటిలో ఫైబర్, ప్రోటీన్, ఐరన్, ఫోలేట్, కాల్షియం సమృద్ధిగా లభిస్తాయి. గర్భిణులకు అవసరమైన ఫోలిక్ యాసిడ్ పొందుతారు. ఇది మొదటి త్రైమాసికంలో కడుపులోని బిడ్డకి చాలా కీలకం. పిండం రూపుదిద్దుకోవడానికి సహాయపడుతుంది. వీటిని తీసుకోవడం వల్ల పాలు కూడా ఉత్పత్తి అవుతాయి.


పచ్చి బఠానీలు


బఠానీలు పచ్చిగా లేదా వండిన విధంగా కూడా తీసుకోవచ్చు. ఇందులో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. మెదడు, వెన్నెముక సమస్యలు పుట్టుకతో వచ్చే లోపాలను నిరోధించడంలో సహాయపడుతుంది. పచ్చి బఠానీలు తినడం వల్ల తల్లికి పాలు ఉత్పత్తి అవుతాయి.  


మెంతి ఆకులు


లెగ్యూమ్ కుటుంబానికి చెందిన మెంతాకు గర్భిణులకి మేలు చేస్తాయి. కడుపులో ఉన్న సమయంలో రక్తహీనతను నిరోధించేందుకు సహాయపడుతుంది. ఐరన్ పుష్కలంగా అందుతుంది. ఇది పిండం కణాలతో సహా శరీరంలోని కణాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. మెంతి ఆకులలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్ సి వంటి పోషకాలు అధికంగా ఉన్నాయి. ఆరోగ్యకరమైన గర్భధారణకి చాలా అవసరం.


చిలగడదుంప


స్వీట్ పొటాటో గర్భిణులు తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు. కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి నిరంతర శక్తిని అందిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. పిండం ఎదుగుదలకు కీలకమైన విటమిన్ ఎ ఇందులో పుష్కలంగా లభిస్తుంది. చర్మం, కళ్ళు, రోగనిరోధక వ్యవస్థని కాపాడుకోవడానికి ఇది దోహదపడుతుంది.


వాల్ నట్స్


వాల్ నట్స్ విటమిన్ ఇ, ఫైబర్ ని అందిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శీతాకాలంలో వచ్చే దగ్గు, జలుబు, ఫ్లూ నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. ఇవే కాదు బిడ్డ మెదడు ఆరోగ్యకరమైన ఎదుగుదలకి అవసరమైన ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఇందులో ఉంటాయి.  


పెరుగు


పెరుగు తింటే చలికాలంలో జలుబు చేస్తుందని అంటారు. కానీ గర్భిణులు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందులో కాల్షియం ఉంటుంది. ఎముకల్ని బలంగా చేయడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా కడుపు నొప్పి, ఇన్ఫెక్షన్స్ ని నివారిస్తుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: ఇలా చేశారంటే మీ పిల్లల ఎముకలు దృఢంగా మారతాయ్