ఎముకలు బలంగా తయారయ్యేందుకు పెద్దవాళ్ళు అయితే వ్యాయామాలు చెయ్యడం మంచి ఆహారం తీసుకుంటూ ఉంటారు. మరి పిల్లల సంగతి ఏంటి? చిన్నతనం నుంచే వారి ఎముకలు ధృడంగా ఉండేలా తయారు చేయాలి. లేదంటే చిన్న దెబ్బలు తగిలినా కూడా త్వరగా విరిగిపోవడం జరుగుతుంది. పిల్లల్లో అటువంటి దెబ్బలు తగిలినప్పుడు నయం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అలాగే వాళ్ళు ఆ బాధని భరించలేరు. అందుకే మీ పిల్ల ఎముకల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. బాల్యం నుంచి బలమైన ఎముకల పునాది వారికి జీవితాంతం ఆరోగ్యాన్ని ఇస్తుంది.


దాదాపు 20 సంవత్సరాల వయస్సు నుంచి చాలా మందికి ఎముకలు అభివృద్ధి చెందటం ఆగిపోతుంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ ఎముకల బలం క్షీణిస్తుంది. అందుకే చిన్నతనం నుంచే వారి ఎముకలు బలంగా మారేందుకు అవసరమైన మూడు పోషకాలని పిల్లలకి అందేలా చేయడం తల్లిదండ్రుల బాధ్యత. కాల్షియం, విటమిన్ డి, శారీరక వ్యాయామాలు వారికి అలవాటు చేయాలి. అప్పుడే మీ పిల్లలు స్ట్రాంగ్ గా తయారవుతారు.


కాల్షియం ఇవ్వాలి


బిడ్డకి తగినంత కాల్షియం అందే విధంగా చూసుకోవాలి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, కండరాలు బలోపేతం చేయడానికి, ఎముకల అభివృద్ధికి కాల్షియం అవసరం. పాలు, పెరుగు తీసుకోవడం వల్ల కాల్షియం అందుతుంది. ప్రతిరోజు తప్పనిసరిగా పిల్లలు వాటిని తీసుకునేల చూసుకోవాలి. ఎముకల అభివృద్ధికి తొడపడేందుకు తల్లిదండ్రులు తమ పిల్లలకి రోజూ కనీసం 2 గ్లాసుల పాలు తాగేలా చూసుకోవాలి. వాటితో పాటు బచ్చలికూర, కాలే, ఒక్రా వంటి ఆకుపచ్చని కూరగాయలు తప్పనిసరిగా చేర్చాలి. పెరుగు లేదా సోయా పాలు, పెరుగు తీసుకునేలా అలవాటు చేయాలి. చేపలు, సోయాబీన్ ఉత్పత్తులు కాల్షియం అందించే వనరులు.


విటమిన్ డి అవసరం


ప్రతిఒక్కరికీ విటమిన్ డి చాలా అవసరం. కాల్షియం శోషణ విటమిన్ డి ద్వారా అందుతుంది. దీన్నే విటమిన్ డి3 అని కూడా పిలుస్తారు. పిల్లలకి విటమిన్ డి ఉండే ఆహారం తప్పనిసరిగా ఇవ్వాలి. ఆహారం ద్వారా అందకపోతే సప్లిమెంట్ల ద్వారా అయినా అందే విధంగా చూసుకోవాలి. ప్రతిరోజు కనీసం 32 ఔన్సుల తీసుకోవడం ముఖ్యం. నవజాత శిశువులనికి కూడా అందుకే ఖచ్చితంగా విటమిన్ డి డ్రాప్స్ డాక్టర్స్ సిఫార్సు చేస్తారు. అంతేకాదు వారిని పొద్దునే కాసేపు ఎండ తగిలేలా ఉంచమని సలహా ఇస్తారు. ఉదయం పూట కాసేపు ఎండలో ఉండే శరీరానికి కావాసినంత విటమిన్ డి పొందుతారు.


ఎముకల సాంద్రత కోసం మెగ్నీషియం


విటమిన్ కె, మెగ్నీషియం తీసుకోవడం వల్ల ఎముకలు గట్టిపడతాయి. ఇవి పుష్కలంగా పొందటం వల్ల బోలు ఎముకల వ్యాధి వంటి పరిస్థితులకు తక్కువ గురవుతారు. కాల్షియంతో పాటు ఇవి కూడా పిల్లల ఎముకల్ని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. బచ్చలికూర, కాలే, క్యాబేజీ, ఆకుపచ్చ కూరగాయాల్లో విటమిన్ కె, మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తాయి. పిల్లలు తృణధన్యాలు తినడం అలవాటు చేయడం మంచిది.


కార్బొనేటెడ్ పానీయాలు వద్దు


కార్బొనేటెడ్ పానీయాలు నివారించడం ఉత్తమం. వీటిలో ఫాస్పోరిక్ ఆమ్లం ఉంటుంది. ఇది కాల్షియం గ్రహించకుండా నిరోధిస్తుంది. ఈ యాసిడ్ ఎముకలకి మంచిది కాదు. అందుకే పిల్లలకి వాటికి బదులుగా నారింజ రసం వంటి ఆరోగ్యకరమైన వాటిని ఇవ్వడం మంచిది.


వ్యాయామం


క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అలవాటు చేయాలి. అలాగే ఆరుబయట మైదానాల్లో ఆదుకోవడం చాలా అవసరం. ఎముకలు, కండరాలు గట్టిపడతాయి. బరువులు ఎత్తడం వంటి పనులు చేస్తే వాళ్ళ ఎముకలు మరింత బలంగా తయారవుతాయి. పరిగెత్తడం, నడవటం, దూకడం, మెట్లు ఎక్కడం వంటి వ్యాయామాలు వారికి మంచిది. స్క్రీనింగ్ సమయం తగ్గించడం కూడా ముఖ్యమే.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: చలికాలంలో ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా బుజ్జాయిలని ఇలా కాపాడుకోండి