కరోనా కాలంలో నవజాతశిశువులు, పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ శీతాకాలంలో జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కారణం తగినంత రోగనిరోధక శక్తి లేకపోవడమే. అందువల్ల వైరస్లు, బ్యాక్టీరియాతో పోరాడటంలో విఫలం అవుతారు. చల్లటి గాలుల నుంచి వారిని రక్షించుకోవడం కోసం మెత్తగా ఉండే దుస్తులు ధరించడం, హైడ్రేట్ గా ఉంచడం, ఆరోగ్యకరమైన పోషణ అందించడం చాలా అవసరం. వాటితో పాటు జలుబు, ఫ్లూ నుంచి రక్షించుకోవడానికి ఈ చిట్కాలు పాటించండి.
చేతులు కడుక్కోకుండా బిడ్డని తాకవద్దు
చేతుల పరిశుభ్రత చాలా ముఖ్యం. మీ బుజ్జయిల ఆరోగ్యం మీ చేతులతోనే ముడిపడి ఉంటుంది. అందుకే చేతులని సబ్బుతో కడుక్కోవాలి. బయట నుంచి వచ్చినప్పుడు లేదా ఇంట్లో పనులు చేసి వచ్చిన తర్వాత నేరుగా బిడ్డని ఎత్తుకోకుండా చేతులు శుభ్రం చేసుకున్న తర్వాత వారిని తాకాలి. సబ్బు లేదా హ్యాండ్ వాష్ ద్వారా శుభ్రం చేసుకోవడం వల్ల క్రిములు తొలగిపోతాయి.
ఇంట్లో నవజాత శిశువులు ఉంటే వారి దగ్గరకి వచ్చే బయట వాళ్ళు తప్పనిసరిగా చేతులు శానిటైజ్ చేసుకుని రమ్మని చెప్పాలి. పిల్లల్ని చూసేందుకు బంధువులు, స్నేహితులు, సహోద్యోగులు ఇంటికి వస్తూ ఉంటారు. సందర్శకుల వల్ల బిడ్డ అనేక అంటు వైరస్ లకు గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఎవరైనా ఇంట్లోకి వస్తుంటే వాళ్ళు తప్పకుండా ముఖానికి మాస్క్, చేతులకి శానిటైజర్ ఇవ్వండి.
అలాంటి వారిని దూరంగా ఉంచాలి
అంటువ్యాధుల్ని నివారించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం అనారోగ్యంతో ఉన్న వ్యక్తులని దూరంగా ఉంచడమే. జలుబు, ఫ్లూ వంటి అంటువ్యాధులు చాలా వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఇన్ఫెక్షన్ సోకిన వాళ్ళు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడినప్పుడు నోటి తుంపర్ల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది. అందుకే అటువంటి వారిని మీ పిల్లల దగ్గరకి రానివ్వద్దు. పిల్లల సంరక్షణకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.
తల్లిపాలు చాలా ముఖ్యం
శిశువులకి రోగనిరోధక శక్తి పెంచడానికి తల్లిపాలు చాలా కీలకం. వాళ్ళు అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా తల్లి తన బిడ్డకి పాలు ఇవ్వాలి. ఇది వాళ్ళకి స్వల్ప, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కాపాడేందుకు సహాయపడుతుంది.
ఇల్లు పరిశుభ్రత
శరీరంతో పాటు ఇంటి శుభ్రత కూడా చాలా అవసరం. మురికి వస్తువులు, చెత్త బయట పడేయాలి. మంచాల మీద ఉండే బెడ్ షీట్స్, కప్పుకునే దుప్పట్లు నిరంతరం వాష్ చేసుకోవాలి. పిల్లలకి ఉపయోగించే ప్రతి వస్తువు, వారి దుస్తులు వేడి నీటిలో వేసి శుభ్రం చేసుకోవడం ఉత్తమం.
అటువంటి పరిస్థితుల్లో బయటకి వెళ్లొద్దు
చలికాలంలో జలుబు, ఫ్లూ, ఇన్ఫెక్షన్ల కేసుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఇటువంటి సమయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్న టైమ్ లో బయటకి వెళ్ళక పోవడం ఉత్తమం.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: అవిసె గింజల పొడి కలిపిన పాలు తాగితే బోలెడు ప్రయోజనాలు