పోషకాలతో నిండిన పాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేకూరుస్తుంది. అందుకే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు రోజుకి ఒక గ్లాసు పాలు తాగాలని సూచిస్తారు. చాలా మంది ప్రోటీన్ పౌడర్ కలుపుకుని తాగుతారు. బయట కొనుక్కునే వాటి కంటే ఇంట్లోనే అవిసె గింజలు పొడి చేసుకుని దాన్ని పాలతో కలిపి తీసుకుంటే చాలా మంచిది. అవిసె గింజలు, పాలు రెండింటిలో ఫైబర్, కాల్షియం, పొటాషియం, విటమిన్ బి6, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, మెగ్నీషియం, ప్రోటీన్, విటమిన్ డి, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రెండూ కలిపి తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుందని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. ఈ పాలు తాగడం వల్ల ప్రయోజనాలు..


బరువు అదుపులో ఉంచుతుంది


ఈరోజుల్లో ఊబకాయం చాలా సాధారణ సమస్యగా మారింది. ఊబకాయం కూడా అనేక వ్యాధులకి కారణమవుతుంది. అందుకే బరువు తగ్గించుకునే మార్గాలలో ఇది చక్కని పరిష్కారం. అవిసె గింజల్లో ఉండే ఫైబర్ ఆకలిని నియంత్రిస్తుంది. పాలతో కలిపి అవిసె గింజల పొడి తీసుకుంటే బరువు తగ్గుతారు.


మధుమేహం నియంత్రణ


షుగర్ వ్యాధిగ్రస్తులు పాలలో ఈ పొడిని కలుపుకుని తాగడం మంచిది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రించడంలో సహాయపడుతుంది.


గుండెకి మేలు చేస్తుంది


ఇది గుండెకి మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి గుండెని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీని వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.


పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది


అవిసె గింజలు, పాలు కలిపి తీసుకుంటే పేగులకి మంచిది. వీటిలో ఫైబర్ అధిక పరిమాణంలో ఉంటుంది. ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఫైబర్ పేగులకి సహాయపడుతుంది. దీంతో జీర్ణశక్తి మెరుగుపడుతుంది. జీర్ణవ్యవస్థకి సంబంధించిన సమస్యలు కూడా దూరమవుతాయి.


ఈస్ట్రోజెన్ పెంచడానికి సహాయపడుతుంది.


అవిసె గింజలు లిగ్నాన్స్ గొప్ప మూలం. ఇది పురుషులకు, స్త్రీలకి అవసరమైన ఈస్ట్రోజన్ స్థాయిని పెంచుతుంది.


పాలతో అవిసె గింజలు ఎలా తీసుకోవాలి?


అవిసె గింజలు పొడి చేసి పెట్టుకోవాలి. ఒక గ్లాసు పాలు తీసుకుని అందులో 1 టీ స్పూన్ అవిసె గింజల పొడి వేసి మరిగించుకోవాలి. తర్వాత ఆ పాలని ఫిల్టర్ చేసుకుని తాగాలి. గోరువెచ్చని పాలలో నేరుగా పొడి కలుపుకుని కూడా తాగొచ్చు. రాత్రి పడుకునే ముందు ఈ పాలు తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు పొందుతారు. అవిసె గింజలు తీసుకోవడం వల్ల హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. ఇవి తీసుకోవడం వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: ఆయుర్వేద చిట్కాలు: ఇలా చేశారంటే శీతాకాలంలో జలుబు బాధే ఉండదు