ఆడా, మగా తేడా లేకుండా అందరికీ పొట్ట చుట్టూ కొవ్వు చేరిపోతుంది. పెద్ద బొజ్జను కరిగించడానికి వాకింగ్‌లు, జిమ్ లో వ్యాయామాలు చేస్తూ చాలా మంది కష్టపడుతున్నారు. కేవలం అవొక్కటే చేస్తే సరిపోదు... కొవ్వున్న ఆహారాన్ని మానేసి, కొవ్వు కరిగించే ఆహారాన్ని మెనూలో చేర్చుకోవాలి. కొన్ని అధ్యయనాల ప్రకారం కాలా చానా అదేనండి కొమ్ము శెనగలు ఈ పనిని సమర్థవంతంగా చేస్తాయని తేలింది. బొడ్డు చుట్టూ పేరుకున్న కొవ్వును విసెరల్ ఫ్యాట్ అని పిలుస్తారు. ఇది ఎన్నో అనారోగ్యాలకు కారణం అవుతుంది. జీవక్రియలు సక్రమంగా జరగవు, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు త్వరగా వచ్చేస్తాయి. చాలా మొండి కొవ్వుగా విసెరల్ ఫ్యాట్‌ను చెప్పుకోవచ్చు. ఆ కొవ్వును తగ్గించే శక్తి కొమ్ము శెనగలకు ఉంది. 


ఎలా తగ్గిస్తుంది?
రోజుకోసారి కొమ్ము శెనగలతో చేసిన వంటకాన్ని తింటే చాలు అది బరువు తగ్గించే పనిలో ఉంటుంది. ఇందులో డైటరీ ఫైబలర్ అధికంగా ఉంటుంది. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురించిన కథనం ప్రకారం 2007లో ఎలుకలపై చేసిన ప్రయోగంలో కొమ్ము శెనగలు వాటి పొట్ట దగ్గరి కొవ్వును కరిగించినట్టు తేలింది. అలాగే ఇన్సులిన్ నిరోధకతను తిప్పికొట్టింది. దీంతో మధుమేహం ఉన్నవారికి, అధిక బరువు ఉన్నవారికి ఇవి చాలా మేలు చేస్తాయని అధ్యయనం తేల్చింది. 


కొన్ని రెసిపీలు ఇవిగో...


1. కొమ్ము శెనగలను రాత్రంతా నానబెట్టాలి. ఉదయం బాగా శుభ్రం చేయాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటిని వేసి, నీళ్లు పోసి ఉడికించాలి. ఆ నీటిని వడకట్టి నిమ్మరసం, వేయించిన జీలకర్రతో చేసిన పొడి, మిరియాల పొడి, కాస్త ఉప్పు జోడించి తాగేయాలి. 


2. కొమ్ముశెనగలను బాగా ఉడికించాక వాటిపై టోమాటో ముక్కలు, కీరాదోస ముక్కలు, ఆలివ్ ఆయిల్, కొత్తిమీరు తరుగు,  క్యాప్సికం ముక్కలు, నిమ్మరసం కలిపి సలాడ్‌లా చేసుకుని తినొచ్చు. 


3. ఉడికించిన కొమ్ము శెనగలను ఒక పక్కగా పెట్టుకోవాలి. స్టవ్ పై కళాయి పెట్టి నూనె వేసి కాస్త ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకులు వేసి వేయించాలి. చిటికెడు పసుపు కూడా వేయాలి. ఇప్పుడు ఉడకబెట్టిన శెనగలను వేసి వేయించాలి. రుచికి తగిపడినంత ఉప్పు వేయాలి. దీని రుచి కూడా బావుంటుంది. 


గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.


Also read: మీ సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించే అయిదు అలవాట్లు ఇవే...


Also read: ఈ దోశె మొత్తం తింటే రూ.71,000 క్యాష్ ప్రైజ్... తినడానికి మీరు సిద్ధమేనా?