డిజిటల్ ఎకానమీకి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ మరో కీలక ప్రకటన చేశారు. భారతీయ రిజర్వు బ్యాంకు నేతృత్వంలో బ్లాక్‌చైన్ సాంకేతికతో డిజిటల్ రూపాయిని తీసుకొస్తామని ప్రకటించారు. 2022-23 ఆర్థిక ఏడాదిలోనే డిజిటల్ రూపాయిని విడుదల చేస్తామని వెల్లడించారు. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇంతకీ ఇది క్రిప్టో కరెన్సీకి పోటీగా తెస్తున్నారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
శక్తికాంత్ వ్యతిరేకం
క్రిప్టో కరెన్సీని భారతీయ రిజర్వు బ్యాంకు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది ఆర్థిక వ్యవస్థకు చేటు చేస్తుందని గవర్నర్ శక్తికాంత దాస్ గట్టిగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం డిజిటల్ రూపాయిని తీసుకొస్తోందని సమాచారం. బహుశా ఇది క్రిప్టో కరెన్సీ కాకపోవచ్చు. ఎందుకంటే ఇందకు ముందే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) ప్రక్రియను ఆరంభించింది. డిజిటల్ రూపంలోని కరెన్సీని చేరుస్తూ 'బ్యాంక్ నోట్' నిర్వచనం సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్‌బీఐకి అనుమతి ఇచ్చింది. డిజిటల్ రూపాయి ద్వారా నోట్లు, నగదుపై ఆధారపడటం తగ్గుతుందని భావిస్తోంది. కేంద్రం క్రిప్టో అసెట్ బిల్లు తీసుకొస్తేనే స్పష్టత వస్తుంది.
ఆర్‌బీఐ సన్నద్ధం
సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) ప్రక్రియ వేగవంతమైంది. ఇది నోట్ లేదా కాయిన్ రూపంలో ఉండదు. పూర్తిగా డిజిటల్ ఫార్మాట్లోనే ఉంటుంది. త్వరలోనే పైలట్ ప్రాజెక్ట్‌ను మొదలు పెడతారని తెలిసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం అంటే ఏప్రిల్‌లోనే ప్రాజెక్టు ఆరంభం అవుతుందని ఆర్‌బీఐ అధికారులు పరోక్షంగా సూచిస్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్షిక బ్యాంకింగ్, ఆర్థిక సదస్సుల్లో ఆర్‌బీఐ అధికారులు దీని గురించి చర్చించారు.
పరిష్కరించాల్సిన అంశాలెన్నో?
ఆర్‌బీఐ డిజిటల్ కరెన్సీపై అడిగిన ప్రశ్నలకు ఆర్‌బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ పి.వాసుదేవన్ సమాధానాలు ఇచ్చారు. 'వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలోనే పైలట్ ప్రాజెక్ట్ మొదలుపెట్టొచ్చని అనుకుంటున్నా' అని ఆయన తెలిపారు. ఈ డిజిటల్ కరెన్సీపై ఉన్న చాలా ప్రశ్నలకు పరిష్కారాలు వెతకాల్సిన అవసరం ఉందన్నారు. రేపట్నుంచే సీబీసీడీ ఒక అలవాటుగా మారిపోయినా చెప్పలేమన్నారు. ఇదంతా జరగాలంటే అత్యంత పర్యవేక్షణ కావాలన్నారు. చిన్న లేదా పెద్ద స్థాయిలో అమలు చేసినా దాని ఉద్దేశం మాత్రం పక్కగా ఉండాలని స్పష్టం చేశారు.
క్రిప్టో, సీబీసీడీ వేర్వేరు
ఆర్‌బీఐ ప్రవేశపెట్టే సీబీసీడీ ఒక డిజిటల్ కరెన్సీ. ఇప్పుడున్న రూపాయిల్లానే అన్ని అవసరాలకూ వాడుకోవచ్చు. సింపుల్‌గా మీ డబ్బు డిజిటల్ ఫామ్‌లో ఉందని చెప్పొచ్చు. వీటితో చేసే లావాదేవీలు అన్నిటిపైనా ఆర్‌బీఐ నియంత్రణ ఉంటుంది. కానీ క్రిప్టో కరెన్సీలపై ఏ బ్యాంకు లేదా ప్రభుత్వాలకు నియంత్రణ ఉండదు. పూర్తిగా వికేంద్రీకరణ విధానంలో ఉంటుంది. ఇందులో బ్యాంకులు కలగజేసుకోవడానికి లేదు.