ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజున అతని అభిమానులు అనేక రకాలుగా సెలెబ్రేట్ చేస్తున్నారు. ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ యజమాని ఏకంగా ఎనిమిదన్నర లక్షల బహుమతిని ప్రకటించాడు. ఆ నగదు మీరు దక్కించుకోవాలంటే మీరు చేయాల్సిందల్లా ఒక్కటే... అతడు పెట్టే భారీ థాలీని మీరు పూర్తిగా తినేయాలి. బహుమతిని చూసి చాలా మంది ప్రయత్నించేందుకు సిద్ధమవుతున్నారు. కానీ ఆ భారీ థాలీ తినాలంటే చాలా ధైర్యం కావాలి. ఈ పోటీ ఈ ఒక్కరోజే కాదు దాదాపు 10 రోజుల పాటూ ఉంటుంది. కాబట్టి పదిరోజుల్లో ఎప్పుడైనా మీరు కూడా వెళ్లి ప్రయత్నించవచ్చు. అతడు పెట్టిన భారీ థాలీని 40 నిమిషాల్లో పూర్తి చేస్తే ఎనిమిదన్నర లక్షల రూపాయలు సొంతం చేసుకోవచ్చు. 


ఆ రెస్టారెంట్ యజమాని సువీత్ కల్రా మాట్లాడుతూ సెప్టెంబర్ 17న నరేంద్ర మోడీ 72 సంవత్సరాలు పూర్తి చేసుకుంటారని, దేశప్రధాని అయిన అతడిని గౌరవించడానికే ఈ పోటీ పెట్టామని చెప్పుకొచ్చాడు. కచ్చితంగా బహుమతిని అందజేస్తామని, అందులో ఎలాంటి సందేహం పెట్టుకోవద్దని చెప్పాడు. 


ఎన్ని వంటలు...
ఈ భారీ థాలీలో 56 రకాల వంటలు ఉంటాయి. అందులో 20 రకాలు కూరలే ఉంటాయి. అలాగే బిర్యానీలు, చపాతీ, రోటీ, డిజర్ట్ లు ఉంటాయి. వీటన్నింటినీ కేవలం 40 నిమిషాల్లో పూర్తి చేసేయాలి. ఎవరైతే పూర్తి చేస్తారో వారికి ఎనిమిన్నర లక్షల నగదు బహుమతి అందిస్తారు. అలాగు ఇద్దరికి కేదార్ నాథ్‌ పుణ్యక్షేత్రాన్ని సందర్శించే అవకాశాన్ని కల్పిస్తారు.   ఇంతకుముందు కూడా చాలా రెస్టారెంట్లు ఇలాంటి పోటీలను నిర్వహించాయి.  గతంలో విజయవాడలో కూడా ఓ రెస్టారెంట్ వారు ‘బాహుబలి థాలీ’ ని తింటే లక్ష రూపాయల బహుమతిని ప్రకటించారు. దీనిలో 30 వంటకాలు ఉంటాయి. ఆ థాలీని కేవలం అరగంటలోనే పూర్తి చేయాలి. ఒక యువకుడు ఆ థాలీని అరగంటలో తినేసి బహుమతి గెలుచుకున్నాడు. 


ఆరోగ్యం జాగ్రత్త...
ఎనిమిదన్నర లక్షల రూపాయల డబ్బు మిమ్మల్ని ఆకర్షించడం ఖాయం. కానీ అంత తిన్నాక మీ ఆరోగ్యానికి ఏమవుతుందో ఆలోచించండి. కొన్ని సార్లు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం కూడా రావచ్చు. మీరు సంపాదించిన దాంట్లో సగం ఆసుపత్రికే ఖర్చు కావచ్చు. కాబట్టి ఇలాంటి పోటీలకు వెళ్లేముందుకు కాస్త ఆలోచించి వెళ్లండి.  ఎందుకంటే ఆహారం అతిగా తింటే మీ శరీరంలోని అవయవాలు కూడా అతిగా పనిచేయాలి. దీని వల్ల అవి అతిగా అలిసి అనారోగ్యానికి గురవుతాయి. ఒక్కోసారి తీవ్రమైన అనారోగ్యం బారిన కూడా పడవచ్చు.






Also read: వేడి వేడి ఆహారంపై నిమ్మకాయ రసాన్ని పిండి తప్పు చేస్తున్నాం - చెబుతున్న పోషకాహార నిపుణులు


Also read: పీరియడ్స్ కేవలం ఒకటి లేదా రెండు రోజులకే ముగిసిపోతున్నాయా? ఇది అనారోగ్యానికి సంకేతం