అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవడానికి ఎక్కువ మంది చేసే పని కొబ్బరి నీళ్లు తాగడం. నీరసం, లోబీపీ వంటి వాటి నుంచి కూడా త్వరగా ఉపశమనం కలిగేలా చేస్తుంది. అలాగే ఇది బరువు తగ్గడానికి కూడా సహకరిస్తుంది. దీన్ని తాగితే శరీరానికి ఎంతో హాయిగా ఉండడమే కాదు, శక్తి కూడా అందుతుంది. దీన్ని కేవలం అనారోగ్యంగా ఉన్నప్పుడు తాగే పానీయంలాగే చూస్తారు కానీ అందరూ రోజూ తాగితే చాలా మంచిది. డైటిషియన్ విధి చావ్లా చెబుతున్న ప్రకారం కొబ్బరినీరు శరీరానికి హైడ్రేషన్‌ను అందిస్తుంది. అలాగే కొవ్వును కరిగించడంలో కూడా మీకు సహాయపడుతుంది.
తక్కువ కేలరీలు
కొబ్బరి నీళ్లు ఎన్ని తాగినా బరువు పెరగరు. ఇందులో ఉండే కేలరీలు, కార్బోహైడ్రేట్లు చాలా తక్కువ. పొట్ట కూడా తేలికగా ఉంటుంది. ఇందులో పొటాషియం, బయో ఎంజైమ్లు ఆహారం సులభంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి కనుక చాలా కాలం పాటూ పొట్ట నిండిన అనుభూతి కలుగుతుంది. నిజం చెప్పాలంటే పండ్ల రసాల కన్నా కూడా కొబ్బరి నీళ్లే మంచివి. కొబ్బరినీటిలో అత్యధిక మొత్తంలో ఖనిజాలు ఉంటాయి. కానీ పండ్ల రసాల్లో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. కొంతమంది పంచదారను కూడా కలుపుతారు. అందుకే వాటిని తాగడం వల్ల బరువు పెరుగుతారే కానీ తగ్గరు. కానీ కొబ్బరి నీళ్లు ఎలక్ట్రోలైట్లతో నిండి ఉంటుంది. బరువు తగ్గడం సహకరిస్తుంది.
తిన్నది అరిగేలా...
కొబ్బరినీళ్లలో పోషకాలతో పాటూ పొటాషియం, ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి జీవక్రియ రేటును అధికంగా పెంచుతాయి. అంటే తిన్నది అరిగిపోతుంది కానీ కొవ్వు రూపంలో చేరదు. జీర్ణక్రియ నెమ్మదిగా జరిగితే అది ఊబకాయానికి కారణం అవుతుంది. అందుకే కొబ్బరి నీళ్లు రోజూ తాగడం వల్ల త్వరగా బరువు తగ్గొచ్చు.
అతిగా తినకుండా..
కొబ్బరి నీళ్లలో లారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది అతిగా తినడాన్ని నిరోధిస్తుంది.జంక్ ఫుడ్ లాంటివి తినాలన్న కోరికను చంపేస్తుంది. ఆహారాన్ని ఎక్కువగా తీసుకోనివ్వదు. కాబట్టి సహజంగానే బరువు తగ్గుతారు. ఇందులో పొటాషియం అధికంగా ఉండటం వల్ల మీ శరీరం నుండి ఎక్కువ సోడియంను బయటకు పంపి, బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.
ఎప్పుడు తాగితే బరువు తగ్గుతాం?
డైటీషియన్ విధి చావ్లా ప్రకారం, ఉదయాన్నే ఖాళీ పొట్టతో కొబ్బరి నీళ్లు తాగితే బరువు తగ్గే అవకాశం చాలా ఎక్కువ. ఇది అదనపు కొవ్వును పోగొడుతుంది. బరువు త్వరగా తగ్గాలనుకునే వారు రోజులో మూడు సార్లు కొబ్బరి నీళ్లు తాగాలి. రెండు వారాల్లోనే మీకు మంచి ఫలితం కనిపిస్తుంది. నెల రోజుల్లో చాలా బరువు తగ్గుతారు. కొబ్బరి నీళ్లు కిడ్నీ ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మీ రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రించడంలో సహాయపడుతుంది.
Also read: మీరు ఎలాంటి వారో తెలుసుకోవాలనుంటే ఈ చిన్న వ్యక్తిత్వ పరీక్షను తీసుకోండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.