ఇరవై నాలుగేళ్ల చక్కటి యువతి. అందంగా నవ్వుతుంది. అదే ఆమెకు శాపం. ఆమె నవ్విందంటే తనకు తెలియకుండానే నిద్రలోకి జారిపోతుంది. ఆ సమయంలో ఎక్కడ ఉందో, ఎలా ఉందో కూడా అనవసరం.  నిలుచునే నిద్రపోతుంది, కూర్చుని నిద్రపోతుంది, ఆఖరికి బస్సులో కూడా నిద్రపోతుంది. నవ్వితే మాత్రం నిద్ర రావడం ఖాయం. చివరికి స్విమ్మింగ్ పూల్ లో కూడా నిద్రపోయిన ఘటనలు ఉన్నాయి. అందుకే  స్విమ్ చేయడం మానేసింది. ఈ మహిళ బ్రిటన్ లోని బర్నింగ్ హామ్ నగరంలో నివసిస్తోంది. పేరు బెల్లా. 


ఇలా నవ్వుతూ పాటు నిద్ర రావడానికి కారణాన్ని వైద్యులు వివరించారు. ఈ పరిస్థితిని నార్కోలెప్సీ అని పిలుస్తారు. నవ్వడం వల్ల ఆమెకు ఆకస్మికంగా కండరాల బలహీనత వచ్చేస్తుంది. వెంటనే ఆమె నిద్రావస్థలోకి చేరుకుంటుంది. చిన్నప్పటి నుంచి ఆమెకు ఈ సమస్య లేదు. టీనేజీ వయసుకు వచ్చాకే ఇది మొదలైంది.అయితే నిద్రావస్థలోకి చేరుకున్నా కూడా తన చుట్టూ ఉన్న విషయాలు ఆమెకు తెలుస్తాయని, మాటలు వినిపిస్తాయని చెబుతోంది. కానీ తనేమీ చేయలేనని నిద్రపోతూ ఉంటానని వివరించింది. ఆ సమయంలో తన మోకాళ్లు బలహీనంగా ఉంటాయని, తల వంగిపోతుందని వివరించింది. చుట్టూ ఉన్న వారు మాట్లాడుతున్నవి వినగలుగుతానని, శరీరాన్ని మాత్రం కదల్చలేనని చెబుతోంది. చివరికి నా మీద తన మీద వేడి కాఫీ పోసినా కూడా తన చేతులను కదల్చలేని పరిస్థితి ఉంటుందని చెప్పింది. అందుకే ఎక్కడికి వెళ్లినా చాలా సురక్షితమైన ప్రదేశంలో కూర్చోవడం వంటివి చేస్తుంది. 


2017లో మొదటిసారి ఆమెకు ఈ వ్యాధి ఉన్నట్టు తేలింది. ఈ వ్యాధితో పాటు కాటాఫ్లెక్సీ అనే మరో వ్యాధి కూడా ఉందని, ఈ రెండూ కలిసి ఈమెకు ఇలాంటి పరిస్థితిని ఇస్తున్నాయని వివరించారు వైద్యులు. దీనికి నివారణ లేదు. కేవలం జీవనశైలిలో మార్పుల ద్వారా  సురక్షితంగా జీవించడమే.


ఏంటి ఈ నార్కోలెప్సి?
నేషనల్ హెల్త్ సర్వీసెస్ ప్రకారం నార్కోలెప్సి బారిన పడిన వ్యక్తికి ఎప్పుడు మేల్కోవాలి, ఎప్పుడు నిద్ర పోవాలి అనేవి వారి ఇష్ట ప్రకారం జరగవు.  వారి మెదడు ఈ విధానాలను నియంత్రించలేదు. దీని ఫలితంగా పగటిపూట విపరీతంగా నిద్రపోవడం జరుగుతుంది. నిద్ర అకస్మాత్తుగా వచ్చేస్తుంది. కాటాఫ్లెక్సీ అనే వ్యాధి వల్ల కండరాల నియంత్రణ కోల్పోతుంది. రాత్రి నడిచే అవకాశం ఉంది.


ఇది ఎందుకు వస్తుంది?
మెదడులో మెలకువగా ఉంచడానికి సహాయపడే ఒరెక్సిన్ లేదా హైపోక్రెటిన్ అనే రసాయనం లేకపోవడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఇది ఆటో ఇమ్యూన్ వ్యాధి కిందకే వస్తుంది. ఆ రసాయనాన్ని ఉత్పత్తి చేసే కణాలపై లేదా గ్రాహకాలపై రోగనిరోధక వ్యవస్థ పొరపాటుగా దాడి చేయడం వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అలాగే హార్మోన్లలో తీవ్ర మార్పులు జరిగినా, మానసిక ఒత్తిడి  తీవ్రంగా ఉన్నా,స్వైన్ ఫ్లూ వంటి అంటువ్యాధుల బారిన పడినా ఈ జబ్బు రావచ్చు.


ఈ వ్యాధికి ప్రత్యేకంగా చికిత్స లేదు. నిద్ర అలవాట్లను  మెరుగుపరుచుకోవడం. మందులు తగిన విధంగా తీసుకోవడం, కచ్చితమైన నిద్రావేళలను పాటించడం వంటి చిన్న చిన్న మార్పులు తప్ప... ఈ వ్యాధి నుంచి బయటపడటం చాలా కష్టం. 



Also read: ఉదయాన్నే ఈ నాలుగు లక్షణాలు కనిపిస్తే ఊపిరితిత్తుల క్యాన్సరేమోనని అనుమానించాల్సిందే







గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.