గర్భం ధరించిన సమయంలో ఎంత పోషకాహారాన్ని తింటే బిడ్డకు అంత మంచిది. వైద్యులు ఇచ్చిన సప్లిమెంట్లను కూడా ఖచ్చితంగా వాడాలి. గర్భిణీలు ఎంత జాగ్రత్త తీసుకుంటే పుట్టబోయే బిడ్డలు అంత ఆరోగ్యంగా ఉంటారు. కానీ కొన్ని జబ్బులకు మూలం తల్లి కడుపులో ఉన్నప్పుడే ఏర్పడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా గర్భిణుల్లో ఎవరైతే విటమిన్ D లోపంతో బాధపడతారో, వారికి పుట్టే పిల్లలు ఆరోగ్య సమస్యలతో జన్మించే అవకాశం ఉందని కొత్త అధ్యయనం చెబుతుంది. ముఖ్యంగా విటమిన్ డి లోపం వల్ల పుట్టే పిల్లల్లో టైప్2 డయాబెటిస్ ముప్పు పొంచి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ కొత్త అధ్యయనాన్ని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వారు నిర్వహించారు.
గర్భంతో ఉన్నప్పుడు తల్లికి విటమిన్ D లోపం ఉంటే పుట్టే పిల్లలు అతి త్వరగా టైప్2 డయాబెటిస్ బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ సమయంలో వైద్యులు ఇచ్చిన విటమిన్ డి సప్లిమెంట్లను కచ్చితంగా వాడాలి. అలాగే సూర్యరశ్మిలో రోజులో అరగంటైనా ఉండాల్సిన అవసరం ఉంది. గుడ్లు, చేపలు, పుట్టగొడుగులు వంటివి తింటే విటమిన్ డి కొంతమేరకు అందుతుంది.
విటమిన్ డి లోపం వల్ల పుట్టిన పిల్లల్లో ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది. ఇది భవిష్యత్తులో మధుమేహానికి దారితీస్తుంది. అంతేకాదు గర్భిణులు విటమిన్ డి లోపం బారిన పడడం వల్ల వారిలో ఎదుగుతున్న పిండంలో రోగనిరోధక కణాలు కూడా దెబ్బతింటాయి. ఇవి కూడా మధుమేహం పెరగడానికి సహకరిస్తాయి. అందుకే గర్భం ధరించినప్పుడు విటమిన్ డి లోపం లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ లోపం వల్ల మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. త్వరగా చిరాకు కోపం వస్తాయి. డిప్రెషన్ బారిన పడే అవకాశం కూడా ఎక్కువ. విటమిన్ డి లోపం వల్ల నడుము నొప్పి ఎక్కువగా వేధిస్తుంది. కాళ్లు, కీళ్లలో నొప్పి అధికంగా వస్తుంది. రోగనిరోధక వ్యవస్థ బలంగా మార్చడానికి ఇది అవసరం. విటమిన్ D లోపం వల్ల జుట్టు విపరీతంగా రాలిపోతుంది. అలోపేసియా అరెటా అనే వ్యాధి కూడా విటమిన్ డి లోపంతో ముడి పడి ఉంది.
విటమిన్ డి లోపం వల్ల కాల్షియం లోపం కూడా వచ్చే అవకాశం ఉంది. ఆహారం నుంచి కాల్షియంను శరీరం శోషించుకోవాలంటే విటమిన్ డి అవసరం. ఎప్పుడైతే విటమిన్ డి లోపం వచ్చిందో కాల్షియం ఎముకలకు అందడం తగ్గిపోతుంది. కాబట్టి విటమిన్ డి లోపం లేకుండా చూసుకోవాలి.
Also read: ప్రతి ఏడు సెకన్లకు ఒక శిశువు లేదా ఒక తల్లి మరణం, కలవరపెడుతున్న ఐక్యరాజ్యసమితి నివేదిక
Also read: నా భార్య కన్నా ఆమె నాకు ఎక్కువ నచ్చుతోంది, ఏం చేయాలి?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.