భార్యాభర్తలు నిద్రపోవడానికి ఒక డబుల్ కాట్ బెడ్ ఉంటే సరిపోతుంది. మరి ఇద్దరేసి, ముగ్గురేసి భార్యలు ఉన్నవారికి? డబుల్ కాట్ కాదు కదా.. కింగ్ సైజ్ బెడ్‌లు రెండున్నా సరిపోవు. అలాంటిది అతడికి ఏకంగా ఆరుగురు భార్యలున్నారు. వారిలో ఎవరితో కలిసి నిద్రపోయినా.. మిగతా భార్యలు అలుగుతారు. అందుకే, ఆ ఆదర్శ భర్తకు ఓ కత్తిలాంటి ఐడియా వచ్చింది. మొత్తం ఏడుగురు (భర్తతో కలిపి) కలిసి హాయిగా నిద్రపోయేందుకు 20 అడుగుల బెడ్ తయారు చేయించకున్నాడు. చీకూ చింత లేకుండా రాత్రంతా వారితో కలిసి నిద్రపోతున్నాడు. అతడి నిద్రమాట దేవుడెరుగు.. ఆ బెడ్ ధర తెలిస్తే మాత్రం, తప్పకుండా మీకు నిద్రపట్టదు. ఎందుకంటే.. ఆ బెడ్‌ను ఏకంగా రూ.81 లక్షలు చెల్లించి తయారు చేయించుకున్నాడు. అరే, ఆ డబ్బుతో హైదరాబాదులో ఒక ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ వచ్చేస్తుందే అనుకుంటున్నారు కదూ. అది సరే, ఇంతకీ ఈ ఆదర్శ భర్త ఎక్కడున్నాడో తెలుసుకుందాం.
అందుకే ఆ ఆలోచన వచ్చిందట
బ్రెజిల్‌కు చెందిన ఆర్థర్ ఓ ఉర్సోకు ఆరుగురు భార్యలున్నారు. అయితే, వారిని మేనేజ్ చేయడం అతడికి చాలా కష్టంగా మారిందట. ఆరుగురు భార్యలు ఎంతో ఆదర్శంగా, అక్క చెల్లెల్లుగా కలిసి ఉన్నా.. ఆ ఒక్క విషయం దగ్గర కాస్త ఆలోచనలో పడేవాడట ఆర్థర్. ఎందుకంటే.. మంచం సరిపోక అతడే చాలాసార్లు సోఫాలో లేదా నేలపై పడుకోవల్సి వచ్చేదట. అందుకే, అందరికీ కలిపి ఒక బెడ్ ఉండాలనే ఆలోచన వచ్చిందట. అంతా తలోదిక్కు నిద్రపోడానికి బదులు.. ఒకే చోట నిద్రపోతే ఎంతో హాయిగా ఉంటుందని భావించి.. ఒక పెద్ద మంచాన్ని తయారు చేయాలని నిర్ణయించుకున్నాడట. దాని తుది రూపమే ఈ 20 అడుగుల బెడ్.
15 నెలలు శ్రమించారట
ఈ మంచం తయారీ కోసం ఆర్థర్ 80 వేల పౌండ్లు (భారత కరెన్సీ ప్రకారం రూ.81.54 లక్షలు) వెచ్చించాడట. 20 అడుగుల వెడల్పు, 7 అడుగుల పొడవు గల మంచం తయారీకి సుమారు 15 నెలల సమయం పట్టిందని తెలిపాడు. ఈ మంచం తయారీకి మొత్తం 12 మంది సిబ్బంది పనిచేశారట. మొత్తం 950 స్క్రూలతో ఈ మంచాన్ని బిగించారట. ఆర్థర్ తాజాగా తన ఘనకార్యాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. తన 20 అడుగుల మంచం ఫొటోలను పోస్ట్ చేశాడు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద మంచమని పేర్కొన్నాడు. ఎందుకైనా మంచిది గిన్నీస్ రికార్డు అధికారులు ఈ విషయాన్ని చెక్ చేసుకోవడం బెటర్.
10 మంది భార్యలు - ఇప్పుడు మిగిలింది ఆరుగురే
ఇక ఆర్థర్ పెళ్లి విషయానికి వస్తే.. గత మూడేళ్లల్లో పది పెళ్లిల్లు చేసుకున్నాడు. 2021లో అతడు మొదటి పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు లువానా. ఆ తర్వాత ఆమె అనుమతి తీసుకున్ని మరో తొమ్మిది మందిని పెళ్లి చేసుకున్నాడు. అయితే, ఆ దేశంలో బహుభార్యత్వం చట్టవిరుద్ధం. అందుకే, ఆ పెళ్లిల్లు చట్టబద్ధం కాలేదు. ప్రభుత్వం దృష్టిలో అతడికి ఒకరే భార్య. మరి, తొమ్మిది మందిలో మిగతా ముగ్గురు భార్యలు ఏమయ్యారనేగా సందేహం? గతేడాది అతడికి నలుగురు భార్యలు విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత 51 ఏళ్ల ఒలిండా మారియాను పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం లువానా కజాకి (27), ఎమెల్లీ సౌజా (21), వల్క్విరియా శాంటోస్(24), ఒలిండా మారియా(51), డామియానా(23), అమండా అల్బుకెర్కీ(28)లతో సంసారం చేస్తున్నాడు. ఆర్థర్ ఇప్పుడు పెళ్లిల్లకు పుల్‌స్టాప్ పెట్టి.. ఒక బిడ్డకు తండ్రి కావాలనే ఆలోచనలో ఉన్నాడట.
Also Read: ప్రమాదంలో పురుష జాతి - మహిళల కంటే త్వరగా చనిపోయేది మగాళ్లేనట, తాజా అధ్యయనం వెల్లడి