నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ప్రభుత్వంపై ప్రతీకారం తీర్చుకోడానికి సిద్ధమయ్యారు. రూరల్ నియోజకవర్గ సమస్యలపై పదే పదే గళమెత్తుతున్నారు. ఆయనకు భయపడి పనులు పూర్తి చేస్తున్నారని చెప్పలేం కానీ, రూరల్ సమస్యల పట్ల తమకు చిత్తశుద్ధి ఉంది అని నిరూపించుకోడానికి, ఇన్ చార్జ్ గా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి పరువు కాపాడటానికి రూరల్ సమస్యలపై ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. ఇటీవల బారాషహీద్ దర్గా అభివృద్ధి పనులకు నిధులు ఇలాగే మంజూరయ్యాయి. షాదీమంజిల్ పనులు కూడా ఓ కొలిక్కి వచ్చాయి. ఈ దశలో ప్రభుత్వానికి మరో డెడ్ లైన్ పెట్టారు కోటంరెడ్డి. 


మే 15వ తేదీ లోపల ఎన్.టి.ఆర్. నెక్లెస్ రోడ్డు - గణేష్ ఘాట్ అభివృద్ధి పనులు ప్రారంభం కాకపోతే అందరిని కలుపుకొని నుడా ఆఫీసును పెద్దఎత్తున ముట్టడిస్తామని హెచ్చరించారు. నెల్లూరు అర్బన్ డెవలప్ మెంట్ అథారిడీ (నుడా) కార్యాలయానికి వెళ్లిన కోటంరెడ్డి.. నుడా వైస్ చైర్మన్ బాపిరెడ్డిని కలిశారు. సమస్యల చిట్టా ఆయనకు వినిపించారు. నుడా పరిధిలోకి వచ్చే వాటిని వెంటనే పరిష్కరించాలని కోరారు. 


ఎన్.టి.ఆర్. నెక్లెస్ రోడ్డు - గణేష్ ఘాట్ పనులు పూర్తి చెయ్యగలిగితే, ఆ ప్రాంతం నెల్లూరు నగరానికే తలమానికంగా మారుతుందని, జిల్లాలోనే మంచి పర్యాటక కేంద్రం, ఆధ్యాత్మిక క్షేత్రంగా తయారవుతుందని అన్నారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో వెంకయ్య నాయుడు, అప్పటి సీఎం చంద్ర బాబు నాయుడు, మంత్రిగా ఉన్న నారాణ, అప్పటి నగర మేయర్ అబ్దుల్ అజీజ్, నుడా ఛైర్మెన్ గా కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఎన్.టి.ఆర్. నెక్లెస్ రోడ్డు - గణేష్ ఘాట్ అభివృద్ధికి తోడ్పాటును అందించారని గుర్తు చేశారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. వైసీపీ హయాంలో పనులు ముందుకు సాగలేదని, కనీసం అభివృద్దిని ముందుకు తీసుకెళ్లలేకపోయామని చెప్పారు. తాను వైసీపీలో ఉన్నప్పటినుంచి ఈ సమస్యపై గళమెత్తుతున్నానని, ఇప్పుడు తాను పార్టీలో లేనని, మరింత ఉధృతంగా తన గొంతు వినిపిస్తానని చెప్పారు. 


వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత స్థానిక శాసనసభ్యుడిగా అనేక ప్రయత్నాలు చేశానని, అనేక సార్లు సీఎం జగన్ ని కలసి అభివృద్ధి కార్యక్రమాల గురించి అభ్యర్దించానని చెప్పారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. 17.50 కోట్ల రూపాయలతో ఎన్.టి.ఆర్. నెక్లెస్ రోడ్డు - గణేష్ ఘాట్ అభివృద్ధి చేయడానికి 6 నెలల ముందు టెండర్లు పిలిచామని, అప్పట్లో టెండర్లు పూర్తయిన ఇంకా పనులు ప్రారంభం కాలేదని గుర్తు చేశారు. 


నెల్లూరు జిల్లాలో ముగ్గురు శాసన సభ్యుల్ని వైసీపీ సస్పెండ్ చేసింది. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కూడా అజ్ఞాతంలోనే ఉన్నారు. రాజకీయంగా సైలెంట్ గా ఉన్నారు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా అనారోగ్యం కారణంగా కార్యకర్తలతో కలవడంలేదు. ఆయనకంటూ సొంత వర్గం కూడా ఎవరూ లేకపోవడంతో స్తబ్దుగా ఉన్నారు. ఇక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం తన నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం కదం తొక్కుతున్నారు. ఎమ్మెల్యే సోదరుడు గిరిధర్ రెడ్డి ముందుగా టీడీపీలోకి వెళ్లి, అన్నకోసం ప్లాట్ ఫామ్ రెడీ చేస్తున్నారు. ప్రస్తుతానికి రెబల్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్న శ్రీధర్ రెడ్డి.. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పనులు చేయించే ఆలోచనలో ముందుకు కదులుతున్నారు.