ఈ రోజుల్లో చాలా జంటలు సంతాన సమస్యలను ఎదుర్కొంటున్నారు. పిల్లల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఫలితం లేకపోవడంతో ఐవీఎఫ్ విధానంలో పిల్లలను కనేందుకు ప్రయత్నిస్తారు. అయితే, మన పూర్వికుల్లో ఇలాంటి సమస్యలు చాలా తక్కువగా ఉండేవి. అప్పటి ప్రజల జీవన విధానం, తీసుకొనే ఆహారం కూడా ఒక కారణం. ప్రస్తుతం బిజీ లైఫ్‌లో ప్రజలు తమ ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు. మరోవైపు కాలుష్యం సైతం ప్రజలు ప్రతికూల ప్రభావం చూపుతోంది. శృంగారం, సంతానం సాఫల్యంపై అవగాహన తక్కువగా ఉండటం కూడా ఒక కారణం. అయితే, ఈ కింది టిప్స్ పాటించడం ద్వారా తప్పకుండా గుడ్ న్యూస్ వింటారు.
రుతుక్రమం తేదీలను గుర్తుంచుకోవాలి: పిల్లల కోసం పరితపించే మహిళలు తప్పకుండా తమ రుతుక్రమ తేదీలను రికార్డు చేసుకోవాలి. ఎందుకంటే కొందరికి రుతుక్రమ తేదీల మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి ఆ తేదీలను నమోదు చేసుకోవడం ద్వారా అండోత్పత్తి సమయాన్ని అంచనా వేయొచ్చు. గ్లోఅవులేషన్ పీరియడ్ ట్రాకర్ అనే యాప్ ద్వారా కూడా కచ్చితమైన సమాచారాన్ని పొందవచ్చు.
8 నుంచి 18 రోజులు కీలకం: అండాశయం నుంచి అండం విడుదలయ్యే సమయాన్ని ‘ఒవులేషన్’ అని అంటారు. ఈ ప్రక్రియ జరగడానికి ఎనిమిది రోజుల ముందు మహిళలు గర్బం దాల్చే అవకాశం ఉంటుంది. అందుకే ఆ సమయాన్ని కచ్చితంగా అంచనా వేయగలగాలి. రుతుక్రమ ప్రక్రియ మొదలైన 8వ రోజు నుంచి 18వ రోజు వరకు శృంగారంలో పాల్గోంటే గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయి. ఈ సమయంలో రోజు విడిచి రోజు శృంగారంలో పాల్గొంటే సత్ఫలితాలు కనిపిస్తాయి. అమెరికన్ ప్రెగ్నెన్సీ అసోసియేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. మహిళలో అండం విడుదలైన తర్వాత 12 నుంచి 24 గంటల వరకు మాత్రమే ఫలవంతంగా ఉంటుంది. అలాగే మహిళ జననేంద్రియంలో పురుషుడు స్కలించే వీర్యం ఆమెలో సుమారు ఐదు రోజులు జీవిస్తుంది. కాబట్టి.. ఆ సమయంలో అండం ఎప్పుడు విడుదలైన గర్భధారణ జరుగుతుంది.
బరువు పెరిగినా.. బాగా తగ్గినా సమస్యే: బరువు కూడా సంతాన అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మహిళలు బరువు విపరీతంగా పెరిగినా, బాగా తగ్గినా సంతాన అవకాశాలు సన్నగిల్లుతాయి. కాబట్టి.. మహిళలు తప్పకుండా తమ ఫిట్‌నెస్ మీద దృష్టిపెట్టాలి. ఫలితంగా పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. బాగా బరువు తగ్గే మహిళలు గర్భం దాల్చేందుకు కాస్త ఎక్కువ సమయం పడుతుంది. 2020లో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం.. చైనాలో సంతానం కోసం ప్రయత్నిస్తున్న సుమారు 50 వేల జంటల నుంచి డేటాను సేకరించారు. వారిలో బీఎంఐ (Body Mass Index) ఎక్కువగా ఉండేవారిలో సంతాన సాఫల్య అవకాశాలు తగ్గిపోయాయినట్లు కనుగొన్నారు.
ప్రినేటల్ విటమిన్లు తీసుకోవాలి: గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తున్న మహిళలు ప్రినేటల్ విటమిన్ తీసుకోవడం ప్రారంభించాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.
శిశువు మెదడు, వెన్నెముకలో పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి అవసరమైన విటమిన్-బి, ఫోలిక్ యాసిడ్ రోజుకు కనీసం 400 మైక్రోగ్రాములు (mcg) తీసుకోవాలని చెబుతున్నారు. వీటిని ఉపయోగించడానికి ముందు మీరు తప్పకుండా వైద్యుడి సలహా తీసుకోవాలి.
Also Read: ముంచుకొస్తున్న ‘మార్బర్గ్ వైరస్’.. కరోనా కంటే ప్రాణాంతకం, లక్షణాలివే!
వయస్సు పెరగక ముందే ప్రయత్నించాలి: గర్భధారణపై వయస్సు కూడా ప్రభావం చూపుతుంది. 35 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు ఎలాంటి సమస్యలు లేకుండా సంతానం పొందేందుకు అవకాశం ఉంటుంది. కానీ, 35 ఏళ్లు దాటిన తర్వాత సంతాన సమస్యలు తలెత్తితే మాత్రం తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి. మహిళల వయస్సు పెరిగే కొద్ది గర్భధారణ అవకాశాలు సన్నగిల్లుతాయి. అలాగే అండాల సంఖ్య, వాటి నాణ్యత కూడా తగ్గిపోతుంది. ఆ సమయంలో గర్భం దాల్చినట్లయితే అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. మహిళల్లో 30 ఏళ్ల వయస్సు నుంచే ఈ సమస్య మొదలవుతుంది. 37 ఏళ్ల వయస్సు నుంచి మరింత తీవ్రమవుతుంది. 40 ఏళ్ల తర్వాత సంతాన అవకాశాలు దాదాపు తగ్గిపోతాయి.
Also Read: విటమిన్-డి లోపిస్తే చాలా డేంజర్.. ఈ లక్షణాలుంటే జాగ్రత్త!
స్మోకింగ్ ప్రమాదకరం: గర్భం దాల్చాలంటే.. స్త్రీ, పురుషులిద్దరూ స్మోకింగ్‌కు దూరంగా ఉండాలి. సిగరెట్లలో ఉండే నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్ వంటి రసాయనాలు అండోత్పత్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. మహిళలు పొగతాగేవారికి సైతం దూరంగా ఉండాలి. ఎందుకంటే.. సిగరెట్ వాసన చూసినా ప్రమాదమే. మాదక ద్రవ్యాలు, మద్యం అలవాట్లకు కూడా దూరంగా ఉండాలి.
గమనిక: వివిధ అధ్యయనాలు, విశ్లేషణల ఆధారంగా ఈ సమాచారాన్ని అందించాం. ఇది వైద్య నిపుణుల అభిప్రాయానికి ప్రత్యామ్నాయం కాదని గమనించగలరు. సంతాన సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వైద్యుడి సూచనలు పాటించాలి.