కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా అల్లకల్లోలంగా మారిపోయింది.  కొత్తగా వచ్చిన వేరియంట్ల కారణంగా ప్రజలు అనేక ఆరోగ్య సవాళ్లని ఎదుర్కొంటూనే ఉంటున్నారు. కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత వారిలో అనేక సైడ్ ఎఫ్ఫెక్ట్స్ రావడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. కోవిడ్ 19 లక్షణాలు ఇప్పటికీ ప్రజల్లో కనిపించి గందరగోళానికి గురి చేస్తున్నాయి. జ్వరం, గొంతునొప్పి, అలసట, సాధారణ జలుబు, ఫ్లూ, కాలానుగుణంగా వచ్చే అలర్జీలు కూడా కోవిడ్ లక్షణాలను పోలి ఉండటం కలవరపెడుతోంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతిలో నొప్పి వంటి  లక్షణాలు వెలుగులోకి వచ్చి ప్రజలని మరింత భయపెడుతున్నాయి. మానసిక ఆందోళన (యాంగ్జయిటీ), కోవిడ్ రెండింటి కారణంగా ఛాతిలో నొప్పి వస్తుంది. ఇవి రెండింటి మధ్య ఉన్న తేడాపై అవగాహన లేకపోవడం వల్ల అది ఏ రకమైన ఛాతీ నొప్పి అనేది తెలుసుకోవడంలో ప్రజలు విఫలమవుతున్నారు.


కోవిడ్ ఛాతీ నొప్పి ఎలా తెలుస్తుంది?


కరోనా వైరస్ వాళ్ళ శ్వాసకోశ సంబంధిత ఇబ్బంది, ఛాతిలో మంట, నొప్పి, బిగుతుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. COVID-19 ఉన్నవారిలో 17.7 శాతం మంది వ్యక్తులు ఛాతీలో అసౌకర్యం, నొప్పిని అనుభవిస్తున్నారని ఓ పరిశోధనలో తేలింది. అయితే ఈ అధ్యయనం ఓమిక్రాన్ రావడానికి ముందు జరిగింది. ఛాతీ నొప్పి అనేది కోవిడ్ తీవ్రమైన లక్షణంగా  అధ్యయనం వెల్లడిస్తోంది. ఊపిరి పీల్చుకోవడం కష్టమవడం, ఛాతిలో బిగుతుగా ఉండటం, ఊపిరితిత్తులకు తగినంత గాలి అందకపోవడం వల్ల ఛాతిలో నొప్పి వస్తుంది.


ఆందోళన వల్ల వచ్చే ఛాతీ నొప్పి సంకేతాలు


ఆందోళన అనేది ఒక వ్యక్తి కొన్ని పరిస్థితుల గురించి తీవ్రంగా ఆలోచించడం, తిండి నిద్ర కూడా మానేసి దాని ధ్యాసలోనే ఉండటం భయపడటం వల్ల వస్తుంది. ఇందులో కండరాల బిగుతుగా అనిపించడం, గుండె దడ, వణుకు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కండరాలు బిర్రుగా మారడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది. ఆందోళనతో సంబంధం ఉన్న ఛాతీ నొప్పి తరచుగా ఛాతిని ఇబ్బంది పెడుతుంది. మరొక ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే కోవిడ్ వల్ల కూడా ఆందోళన సంభవించి ఛాతిలో నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి.


రెండింటి మధ్య తేడా


కోవిడ్, ఆందోళన రెండూ ఛాతీ బిగుతుగా అయి, నొప్పికి దారితీయవచ్చు. కానీ అవి పూర్తిగా భిన్నమైన లక్షణాలను కలిగి ఉంటాయి. ఆందోళన మానసిక క్షోభ, భయం, గుండె దడ మరియు హైపర్‌వెంటిలేషన్‌కు కారణమవుతుంది. కోవిడ్ జ్వరం, గొంతు నొప్పి, అలసట, ముక్కు కారటం మరియు శరీర నొప్పులు వంటి ఫ్లూ-వంటి లక్షణాలతో సంబంధం కలిగి ఉంటుంది. ముఖ్యంగా వాసన రుచిని కోల్పోతారు. ఇది కోవిడ్ ప్రత్యేక లక్షణం. ఛాతీ నొప్పి 5 నుండి 20 నిమిషాల పాటు కొనసాగితే, అది చాలావరకు కోవిడ్ కంటే ఆందోళనగా ఉంటుంది. కోవిడ్ సంబంధ ఛాతీ నొప్పి సాధారణంగా నిరంతరంగా ఉంటుంది. తీవ్రమైన ఒత్తిడి అనుభూతి కలుగుతుంది.


రెండింటిని సూచించే లక్షణాలు


కోవిడ్, ఆందోళన రెండింటిలోనూ సంభవించే లక్షణాలు ఉన్నాయి. ఇందులో అలసట, చలి, కడుపు నొప్పి, వికారం, చెమటలు పట్టడం, మూర్చలు రావడం వంటివి కనిపిస్తాయి. కోవిడ్ పరీక్ష చేయించుకోవడం ద్వారా మీ రోగ నిర్ధారణ తెలుసుకోవచ్చు.


వైద్యులని ఎప్పుడు సంప్రదించాలి


ఛాతీ నొప్పి, ఊపిరి ఆడకపోవడం వంటి తీవ్రమైన లక్షణాలు తక్కువగా ఉన్నప్పటికీ అవి నిరంతరం కనిపిస్తూ ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మేలు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: కొలెస్ట్రాల్ తగ్గించే బ్లాక్ రైస్ - ఇది తినడం వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలు


Also Read: జుట్టు చివర్లు చిట్లిపోయి ఇబ్బంది పడుతున్నారా? ఇలా చేస్తే అద్భుత ఫలితం