Blasting in a house in Nalla Gutta: నగరంలోని సికింద్రాబాద్ లో ఓ ఇంట్లో ఒకటవ అంతస్థులో భారీ పేలుడు సంభవించింది. పేలుడు దాటికి ఇంట్లో నివసిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తలించారు. సికింద్రాబాద్ లోని రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్ నల్ల గుట్ట జే బ్లాక్ లో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇంకా ఏమైనా పేలుడు జరుగుతుందేమోనని, అసలేం జరిగిందో అర్థం కాక కొంత సమయం ఆందోళనకు గురయ్యారు.
పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ లోని రామ్ గోపాల్ పేట పోలీస్టేషన్ పరిధిలో నల్లగుట్ట జే బ్లాక్ లోని ఓ ఇంట్లో ఉన్నట్లుంది ఒక్కసారిగా భారీ శబ్ధంలో పేలుడు సంభవించింది. దీంతో స్దానికులు పరుగులు పెడుతూ పేలుడు జరిగిన ఇంటి వద్దకు వెళ్లి చూశారు. పేలుడు దాటికి ఇళ్లు పాక్షికంగా ధ్వంసమైంది. ఇంటి గోడలు కూలిపోయాయి. అప్పటికే తీవ్ర గాయాలపాలైన ఇద్దరు వ్యక్తులను గుర్తించారు. స్దానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.  


ఆలస్యం చేయకుండా పెట్రోలింగ్ పోలీసులు ముందుగా తమ వాహానంలోనే గాయాలపాలైన బాధితులను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. మార్గం మధ్యలో 108 వాహనం రావడంతో గాయపడ్డ వారిని అందులోకి ఎక్కించి చికిత్స నిమిత్తం స్థానిక కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పేలుడు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 
సిలిండర్ పేలలేదు.. 
మొదట ఇంట్లో ఉండే గ్యాస్ సిలిండర్ పేలిందని, దాని వల్లే ఇదంతా జరిగిందని భావించారు. కానీ వంట గదిలో పరిశీలించగా, సింలిండర్ పేలిన ఆనవాళ్లు కనిపించలేదు. దాంతో పేలుడు ఎలా సంభవించింది. పేలుడుకు గల కారణాలపై విచారణ చేపట్టారు రామ్ గోపాల్ పేట పోలీసులు. ఒకవేళ సిలిండర్ పేలి ఉంటే ప్రమాదం తీవ్రత మరింత అధికంగా ఉండేదని పోలీసులు తెలిపారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు.