వంటనూనె లేని ఇల్లు ఉండదు. ప్రతిరోజు కూర నుంచి పచ్చళ్ల పోపుల వరకు అన్నింటికీ వంటనూనె చాలా అవసరం. కూరగాయలు, పండ్లు పుచ్చువో, మంచివో చూసి తీసుకునే వీలుంటుంది... మరి వంటనూనెను ఎలా తెలుసుకోవాలి? అసలు కొన్ని వంటనూనెలు పసుపు రంగులో ఎందుకు ఉంటాయి? పసుపు రంగు కలిపిన వంటనూనె వల్ల ఏమైనా ఆరోగ్యపరమైనా నష్టాలు ఉన్నాయా? వీటన్నింటికీ ఈ కథనంలో సమాధానాలు దొరుకుతాయి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) కల్తీ ఆహారపదార్థాలు కనిపెట్టే విషయంలో చైతన్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. దీనికి ‘డిటెక్టింగ్ ఫుడ్ అడల్ట్రెంట్స్’ అని పేరు పెట్టింది. అంటే తెలుగులో ‘కల్తీ ఆహారపదార్థాలను గుర్తించడం’అని అర్థం. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి వారం ఒక ఆహారపదార్థానికి సంబంధించి అది కల్తీదో, మంచిదో ఎలా తెలుసుకోవాలో ఎఫ్ఎస్ఎస్ఏఐ చెబుతుంది. ఈ వారం కల్తీ వంటనూనెను ఎలా గుర్తించాలో చెప్పింది.
చాలా వంటనూనెలో మెటానిల్ పసుపు రంగును వాడుతున్నట్టు ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తించింది. ఇది నిషేధిత రంగు పదార్థం. ఆహారంలో వాడటానికి వీల్లేదు. అయినా కొన్ని వంటనూనెల్లో దీన్ని కలిపి పసుపు రంగు వచ్చేలా చేసి అమ్ముతున్నారు. ఇలాంటి కల్తీ నూనెలను ఇంట్లోనే కనిపెట్టేయచ్చు అంటోంది ఎఫ్ఎస్ఎస్ఏఐ.
ఎలా పరీక్షించాలి?
1. ఒక మిల్లీ లీటరు వంటనూనెను ఒక టెస్ట్ ట్యూబులో వేయాలి.
2. దీనికి నాలుగు మిల్లీలీటర్ల డిస్టిల్డ్ వాటర్ ను కలిపి ట్యూబును బాగా షేక్ చేయాలి.
3. బాగా కలిపిన ఆ మిశ్రమంలోని రెండు మిల్లీలీటర్ల మిశ్రమాన్ని మరొక ట్యూబులో వేయాలి.
4. ఆ ట్యూబులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ను వేసి బాగా కలపాలి.
5. కాసేపు అలా కాసేపు వదిలేస్తే ట్యూబుపై పొరలో పసుపు రంగు పొర ఏర్పడుతుంది. అలా ఏర్పడితే అది కల్తీది. అంటే నిషేధిత మెటానిల్ పసుపు రంగు కలిపారని అర్థం.
6. పై పొరలో ఎలాంటి రంగు పొర ఏర్పడకుండా, నూనె అంతా ఒకే రంగులో ఉంటే ఆ ఆయిల్ మంచిదని అర్థం.
మెటానిల్ పసుపు రంగుకు మనదేశంలో వాడేందుకు ఎలాంటి అనుమతి లేదు. నేషనల్ లైబ్రరీ ఆప్ మెడిసిన్ ప్రకారం మానవులు తినదగినది కాదు. ఫుడ్ కెమిస్ట్రీ మరియు టాక్సికాలజీ జర్నల్ 1993లో చేసిన అధ్యయనం ప్రకారం ఈ మెటానిల్ ఎల్లోను దీర్ఘకాలికంగా ఉపయోగిస్తే మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుంది. మెదడులో విడుదలయ్యే సెరోటోనిన్, డొపమైన్, నోరాడ్రిలనలిన్ స్థాయులపై ఈ ప్రభావం అధికంగా ఉంటుంది. దీని వల్ల మెదడు విషయాలను గ్రహించే, నేర్చుకునే సామర్థ్యం క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. కనుక మీ నూనెలో మెటానిల్ ఎల్లో అనే నిషేధిత రంగు పదార్థం ఉందేమో తెలుసుకోండి. అయితే ఆలివ్ ఆయిల్ మాత్రం సహజంగానే కాస్త పసుపు రంగులోనే ఉంటుంది.
Also read: రోజుకు నాలుగైదు వేరు శెనగపలుకులు తినండి చాలు... ఆ జబ్బులకు దూరంగా ఉండొచ్చు
Also read: గుడ్లు తిన్నాక... వీటిని తినకండి, తింటే ఏమవుతుందంటే...
Also read: ఆ చాకోలెట్ వినాయకుడిని చివరికి ఏం చేస్తారంటే...?