స్కూల్‌కి వెళ్లే పిల్లల్లో ఎక్కువమంది తలలో పేలుతో ఇబ్బంది పడుతూ ఉంటారు. తలలో పేలు పట్టడం వల్ల విపరీతంగా దురద వస్తుంది. అవి రక్తాన్ని కూడా తాగేస్తాయి కాబట్టి వారికి ఏకాగ్రత కుదరదు. దీనివల్ల వారు సరిగా చదవలేరు. ఏకాగ్రత లోపిస్తుంది. ఒక్క పేను తలలో చేరిందంటే అది సులువుగా తన సంఖ్యను పెంచేస్తుంది. అందుకే పేలు పడితే వాటిని త్వరగా వదిలించుకోవాలి. ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా పేలను వదిలించుకోవచ్చు.


జుట్టు అపరిశుభ్రంగా ఉన్నప్పుడు పేలు ఎక్కువగా పట్టే అవకాశం ఉంది. కాబట్టి వారానికి రెండుసార్లు కచ్చితంగా తల స్నానం చేయాలి. పేలు తల మీదకు చేరాయంటే విపరీతంగా రక్తాన్ని తాగేస్తాయి. ఎందుకంటే వాటి ఆహారం రక్తం. తలపై పేలతో ఇబ్బంది పడేవారు త్వరగా రక్తహీనత సమస్య బారిన పడతారు. అలాగే జుట్టు త్వరగా ఊడిపోతుంది. ఇలాంటివారు పెరుగు, నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని మాడుకు పట్టించాలి. అరగంట తర్వాత బాగా కడిగేయాలి. పేలు కూడా స్నానం చేసినప్పుడు ఆ నీళ్లతో పాటు బయటికి పోయే అవకాశం ఉంది. అలాగే తలలో పేలు ఉంటే వేపాకు, తులసి ఆకులతో చిన్న చిట్కాను పాటించండి. వేపాకు, తులసి ఆకులను మిక్సీలో వేసి పేస్టులా చేయండి. ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పసుపు, కొబ్బరి నూనె కలపండి. మాడుకు తగిలేలా మిశ్రమాన్ని పట్టించండి. జుట్టు మొత్తం బాగా ఆరిపోయాక తల స్నానం చేయండి. పేలు ఆ వాసనను భరించలేక నీళ్లతో పాటు బయటకు పోయే అవకాశం ఉంది.


ఒక్క పేను తలపై చేరిందంటే రోజుకు అది పది దాకా గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లు త్వరగానే పేలుగా మారిపోతాయి. అందుకే ముందుగానే జాగ్రత్తపడాలి. కొబ్బరి నూనెలో కాస్త సోంపు నూనె కలిపి జుట్టుకు పట్టించడం అలవాటు చేసుకోండి. సోంపు వాసనకు పేలు తలలో ఉండలేవు. నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా కలిపి జుట్టుకు పట్టించినా మంచిదే. బేకింగ్ సోడా వాసన కూడా పేలకు సరిపడదు. తరచూ పేల దువ్వెనతో తలను దువ్వుకోవడం వల్ల పేలు రాలిపోయే అవకాశం ఉంది. మాడును  పరిశుభ్రంగా ఉంచుకోవడం అలవాటు చేసుకోండి. ముఖ్యంగా పేలు అధికంగా ఉండే వారికి దూరంగా ఉండండి. తల తరచూ దురద పెడుతూ ఉంటే పేలు వల్లనేమో తెలుసుకోండి. వారం రోజులు పట్టించుకోకపోయినా తలపై పుట్టెడు పేలే చేరే అవకాశం ఉంది. 


Also read: తిన్నది అరగకపోవడం చిన్న సమస్య కాదు, క్యాన్సర్ సంకేతం కావచ్చు


Also read: గుండెలో వేసిన స్టంట్‌లు పూడుకుపోయే ముప్పు ఉందా? పూడుకుపోతే ఏం చేస్తారు?
























గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.