కొంతమంది మాటల మధ్యలో గానీ, సినిమాలు చూస్తున్నపుడుగానీ పక్కనవారిని కొడుతుంటారు. కామెడీ సినిమాలు, విడియోలు చూస్తున్నపుడైతే సాధారణంగా చాలామందికి ఈ అలవాటు ఉంటుంది. కానీ ఏ ఎమోషన్నైనా కొంతమంది పక్కనవారిని కొడుతూ బయటపెడుతుంటారు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. సరిగ్గా అర్థం చేసుకుంటే, ఈ అలవాటు వల్ల పక్కనవారిని ఇబ్బంది పెట్టకుండా బయటపడొచ్చు.
అత్యుత్సాహం
సినిమాలో ఎక్కువ ఉత్సాహాన్ని కలిగించే సీన్స్ వచ్చినపుడో, వారికి ఎగ్జైట్మెంట్ కలిగించే వార్త విన్నపుడో, ఉత్సాహవంతమైన సంభాషణల్లో ఉన్నపుడో ఆనందంతో పక్కనవారికి కొట్టడం చూస్తుంటం. అర్థం చేసుకునే బెస్ట్ ఫ్రెండ్స్ దగ్గర ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ ఇదే అలవాటుగా మారితే మీతో సోషలైజ్ అవటానికి పక్కవారు ఇబ్బంది పడొచ్చు. మీక్కూడా అలా కొట్టిన తర్వాత అవమానకరంగా ఉండొచ్చు. ఈ అలవాటు నుంచి బయటపడాలంటే..పక్కనవారిని కొట్టాలనే టెండెన్సీ నుంచి ఆలోచనను చప్పట్ల ద్వారా గానీ, మాటల ద్వారా గానీ, జెస్చర్స్ ద్వారా గానీ బయటపెట్టొచ్చు.
అవగాహన లేకపోవటం
కొంతమందికి ఎక్కడున్నాం. ఎవరితో ఉన్నాం అనే సోషల్ అవేర్నెస్ లేకపోవటం వల్ల ఎమోషన్స్‌ని కొట్టడం ద్వారా బయటపెడుతారు. అది సరదాకైనా సరే..అన్ని పరిస్థితుల్లో అందరూ ఒకేలా తీసుకోలేరు. ఇలాంటి వారితో ఉండేవారు ఈ ప్రవర్తన వల్ల ఎంతో ఇబ్బంది పడుతుండొచ్చు. అప్పుడు వారికి అవతలి వారు దీనివల్ల ఎలా ఫీల్ అవుతున్నారో అర్థమయ్యే ప్రయత్నం చేయాలి.
నెర్వస్ అవటం వల్ల
ఉద్రేకాన్ని కలిగించే సన్నివేశాలు, సంభాషణల వల్ల కొందరు నెర్వస్ ఫీల్ అవుతారు. దీనిని ఎలా బయటపెట్టాలో తెలియక, పక్కనవారిని కొడుతారు. ఇలాంటపుడు, బ్రీతింగ్, మైండ్ ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయటం వల్ల పక్కనవారిని కొట్టాలనే ఆలోచన రాకుండా ఉంటుంది.
సోషల్ డైనమిక్స్
ఫ్రెండ్స్ గ్రూపులో లేదా కొత్తగా పరిచయమైన టీం తోనో సోషలైజ్ అవాల్సి వచ్చినపుడు, ఆటపట్టుగా సంభాషణల మధ్య పక్కనవారిని కొట్టి మాట్లాడే అలవాటు కొంతమందికి ఉంటుంది. ఆ పక్కవారికి మీకు మధ్య బాండింగ్ ఎంత వరకు ఉంది. మీ బౌండరీస్ తెలుసుకొని ప్రవర్తిస్తే అవతలివారు ఫీల్ అవకుండా ఉండగలుగుతారు. అంతేగాక, మీరు ఎలాంటి గ్రూపులో ఉన్నారు. అది అఫిషియల్ మీటింగా? లేదా క్యాజువల్ ఫ్రెండ్స్ మీటింగా అనే దాని బట్టి కూడా మీకు ఈ అలవాటు ఉంటే ముందుగా కాన్షియస్ అవటం మంచిది.
అసౌకర్యం లేదా చికాకు
కొన్ని సందర్భాల్లో, మాట్లాడుతున్న సమయంలో లేదా సినిమాలు చూస్తున్నప్పుడు కొంతమంది నిరాశ, అసౌకర్యం లేదా చికాకుతో పక్కనవారిని కొడుతుంటారు. అసౌకర్యం లేదా నిరాశకు మూలకారణాన్ని అర్థం చేసుకొని, విభేదాలు, అపార్థాలను పరిష్కరించడానికి ఓపెన్ గా కమ్యూనికేట్ చేయటం మంచిది.
ఈ చిన్న అలవాటు అన్నిసార్లూ పెద్ద ఇబ్బంది కాకపోయినప్పటికీ, కొందరికి తెలియకుండానే జరిగే ఈ ప్రవర్తనకు అంతర్లీనంగా ఏమేం కారణాలున్నాయో అవగాహన చేసుకొని దానికి తగిన విధంగా చిన్న చిన్న ప్రవర్తనా మార్పుల వల్ల పూర్తిగా, ఎంతో సులభంగా తగ్గించుకోవచ్చు. ఇది అంత పెద్ద జబ్బు కాదు.