Rohini Karthe Effect on Telugu States : రోహిణి కార్తీ పూర్తిగా సూర్యుడి ఆధీనంలో ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశిస్తే దానిని రోహిణి కార్తె అంటారు. అందుకే ఈ సమయంలో ఎండలు మండిపోతాయి. ప్రతి నక్షత్రంలో సూర్యుడు సుమారు 13.5 రోజులు ఉంటాడు. ఈ సంవత్సరం మే 25వ తేదీన ఈ రోహిణి కార్తె మొదలైంది. జూన్ 8వ తేదీవరకు ఈ ఎండలను భరించాల్సిందే. ఎందుకంటే ఆ సమయంలో సూర్యుడి తీవ్రత తారా స్థాయికి చేరుకుంటుంది. అనంతరం ఎండతీవ్రత తగ్గుతుంది. 


మండే సూరీడు..


సంవత్సరం మొత్తంలో అధిక వేడి ఈ సమయంలోనే ఉంటుంది. సాధారణంగా రోహిణి కార్తె మే మూడోవ లేదా మే చివరి వారంలో వస్తుంది. ఈ సంవత్సరం చివరి వారం అనగా మే 25న వచ్చింది. ఇది జూన్​ 8వ తేదీతో ముగిసిపోతుంది. వ్యవసాయ పంచాంగం ప్రకారం ఈ నక్షత్రాలను కార్తెలు అంటారు. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి కార్తె అని పేరును జోడించి పిలుస్తారు. అంటే సంవత్సరానికి 27 కార్తెలు ఉంటాయి. సాధారణంగా ఉగాది నుంచి సూర్యుడి ప్రభావం పెరుగుతుంది. క్రమంగా ఎండలు పెరిగి.. రోహిణి కార్తె సమయంలో తీవ్రమైన స్థాయికి చేరుకుని క్రమంగా తగ్గి.. వర్షాకాలన్ని వెల్​కమ్ చెప్తాయి. ఈ కార్తెతో వేసవి కాలం పూర్తై.. వర్షాకాలం ప్రారంభమవుతుంది. వ్యవసాయంపై ఆధారపడే రైతులు అప్పుడు పొలం పనులు ప్రారంభిస్తారు. 


ఎల్లో అలెర్ట్


అసలే ఎండలు భరించలేకుండా ఉన్నాయిరా బాబు అనుకుంటే ఈ రోహిణి కార్తె వల్ల మరింత ఇబ్బంది కలుగుతుంది. అందుకే మధ్యాహ్నం వేళలో బయటకు వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు. దాదాపు రోడ్లు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఒకవేళ ఎండలో బయటకు వెళ్తే జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెప్తున్నారు. తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రతల నేపథ్యంలో ఎల్లో అలెర్ట్ కూడా చేశారు. ఈ సమయంలో రిస్క్ తీసుకోవడం కంటే ఇంట్లోనే జాగ్రత్తగా ఉండడం మంచిదని చెప్తున్నారు. 


తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..


ఎండ తీవ్రత వల్ల అలసిపోకుండా ఉండేందుకు నీరు తాగుతూ ఉండాలి. ఫ్రిడ్జ్ వాటర్​ కాకుండా మట్టి కుండలోని నీటి తాగడం మంచిది. కూల్ డ్రింక్స్ కాకుండా మజ్జిగ, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, జావ వంటివి తాగాలి. ఇవి శరీరంలోని వేడిని తగ్గిస్తాయి. పైగా వీటితో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. వెళ్లాల్సి వస్తే.. షేడ్స్, స్కార్ఫ్ వంటివి తీసుకుని జాగ్రత్తగా వెళ్లాలి. కాటన్, వైట్ కలర్ దుస్తులు శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. డీప్ ఫై చేసిన ఫుడ్స్​కి దూరంగా ఉంటే మరీ మంచిది.



చల్లని కబురు.. 


నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు మరో మూడురోజుల్లో వస్తాయని వాతావరణశాఖ తెలిపింది. జూన్ రెండవ తేదీన వర్షం వచ్చే సూచనలు ఉన్నాయని కూడా తెలిపింది. అయితే వర్షం వచ్చినా.. ఈ ఎండల వల్ల ఉక్కపోత ఎక్కువగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రజలు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలని.. వాతావరణంలోని సడెన్ మార్పులు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని అంటున్నారు. 


Also Read : ఎండ తీవ్రత ఎక్కువ అవుతోంది జాగ్రత్త.. ముఖ్యంగా వారు ఏమాత్రం లైట్ తీసుకున్నా అంతే సంగతులు