Postal Ballot Counting: పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విధానంలో ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల మార్గదర్శకాల ప్రకారం ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల యంత్రాంగం నూతన విధానాన్ని అవలంభించనుంది. గతంలో 25 పోస్టల్ బ్యాలెట్లను కట్టలు కట్టి లెక్కిస్తుండగా ఈ సారి యాభై పోస్టల్ బ్యాలెట్లను ఒక కట్టగా కట్టి లెక్కించనున్నారు. జూన్ 2వ తేదీన జిల్లా ఎన్నికల పరిశీలకులు, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిథులు, పార్టీల ఏజెంట్లు, రిటర్నింగ్ అధికారులు, మైక్రో ఆబ్జర్వర్ల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్ బ్యాక్సులను తెరవనున్నారు. యాభై పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చొప్పున కట్టలుగా కడతారు. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలోని ఎన్నికల గోడౌన్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు.
వేగంగా కౌంటింగ్
50 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కట్ట కట్టడం ద్వారా వాటిని వేగంగా లెక్కించవచ్చని జిల్లా ఎన్నికల యంత్రాంగం భావిస్తోంది. ఈ ప్రక్రియ అంతా నియోజకవర్గాల వారీగా జరగనుంది. 50 చొప్పున కట్టలుగా కట్టి.. సంబంధిత నియోజకవర్గాల బ్యాలెట్ బాక్సులలో వేస్తారు. లెక్కింపు రోజున ఈ కట్టలను లెక్కింపు చేపడతారు. అయితే ఈ విధానంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఈ కట్టల ప్రాతిపదికన మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లన్నింటినీ విప్పి చూపించిన తరువాత మళ్లీ వాటిని కట్టలుగా కట్టాల్సి ఉంటుంది. ఏదైనా కట్టలో 50 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయా లేదా అనే అనుమానం వచ్చినప్పుడు వాటిని మళ్లీ లెక్కించాలంటే ఎక్కువ సమయం పడుతుంది.
వేయింగ్ మిషన్లు ఏర్పాటు చేయాలి
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ఉన్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఏపీ నిరుద్యోగ జేఏఏసీ రాష్ట్ర అధ్యక్షులు సమయం హేమంతకుమార్ ఎన్నికల సంఘానికి కీలక విజ్ఞప్తి చేశారు. పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలలో వేయింగ్ మిషన్లను ఏర్పాటు చేయాలని కోరారు. 50 ఓట్ల పోస్టల్ బ్యాలెట్ కట్ట సగటు తూకాన్ని నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏదైనా కట్టపై అనుమానాలు వచ్చినపుడు వాటన్నింటినీ లెక్కించే బదులు తూకం ద్వారా నివృత్తి చేసుకోవచ్చని అన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం అమల్లోకి తీసుకురావాలని ఆయన కోరారు.
ఎన్నికల సిబ్బందికి శిక్షణ
ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపడుతున్నట్లు ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అధికారులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఢిల్లీరావు మాట్లాడుతూ.. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సమయంలో అనుసరించాల్సిన విధివిధానాలను వివరించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సజావుగా సాగేందుకు నోవా, నిమ్రా కళాశాలల్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
అత్యంత పారదర్శకంగా లెక్కింపు
అధికారులు, సిబ్బంది పూర్థిస్తాయి అవగాహన పెంపొందించుకోవాలని, శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్, పోస్టల్ ఓటింగ్ సెంటర్, హోం ఓటింగ్, ఎలక్ర్టానికల్లీ ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ఓట్ల లెక్కింపును అత్యంత పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ప్రతి టేబుల్‌కు కౌంటింగ్ సూపర్‌వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్‌ను నియమించినట్లు ఢిల్లీ రావు తెలిపారు. ఫారం-13సి, ఫారం-13ఏ (డిక్లరేషన్), ఫారం-13బీ స్థాయిల్లో రిజెక్షన్ల నిబంధనలు, డిక్లరేషన్‌లో సీరియల్ నెంబర్, ఓటర్ సంతకం, అటెస్టర్ సంతకం తదితరాలతో పాటు బ్యాలెట్‌లో మార్కింగ్, ట్యాబ్యులేషన్ అంశాలను కలెక్టర్ వివరించారు.