మధుమేహం (Diabetes) శాశ్వత అతిధి లాంటివి, ఒక్కసారి వచ్చిందా ఉండిపోవడమే తప్ప, మళ్లీ వదలదు. అందుకే అది రాకుండా చూసుకోవడం తప్ప మరో అవకాశం లేదు. మధుమేహం రాకుండా అడ్డుకోవాలంటే ఉప్పు వాడకాన్ని కూడా తగ్గించాలి అని చెబుతోంది కొత్త అధ్యయనం. స్టాక్‌హోమ్ లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్ వారు ఈ పరిశోధనను నిర్వహించారు. ఇందులో ఉప్పు వల్ల కూడా మధుమేహం వచ్చే అవకాశం ఉందని తెలిసింది. ఉప్పు అధికంగా వాడే వారిలో డయాబెటిస్ త్వరగా వస్తుందని తేల్చిచెప్పింది ఆ అధ్యయనం. 


కూరలో కాస్త ఉప్పు తగ్గినా భరించలేరు వెంటనే ఉప్పు కలిపేసుకుంటారు, పెరుగన్నం తిన్నప్పుడు కూడా పచ్చి ఉప్పు వేసుకుంటారు. ఇలా రోజువారీ జీవితంలో  తెలియకుండానే ఉప్పు అధికంగా తినేస్తుంటారు. ఇలా తిన్నా మధుమేహం వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి. డయాబెటిస్ అనగానే అందరికీ తీపి పదార్థాలు మాత్రమే గుర్తుకొస్తాయి. ఉప్పును పెద్దగా పట్టించుకోరు. కానీ సాల్ట్ కూడా సైలెంట్ కిల్లర్. 


ఇన్సులిన్ నిరోధకత...
ఉప్పు తినడం వల్ల అందులోని సోడియం అధికంగా శరీరంలో చేరుతుంది. ఇది ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. దీనివల్ల మధుమేహం వచ్చే అవకాశం ఉంది. సోడియం సాధారణంగా తీసుకునే వారితో పోలిస్తే అధికంగా తీసుకునేవారిలో మధుమేహం వచ్చే అవకాశం 72 శాతం ఎక్కువని తేల్చింది కొత్త అధ్యయనం. ఉప్పు తినడం వల్ల రక్తపోటు పెరగడం, అధిక బరువు సమస్యలు కూడా మొదలవుతాయి. అవి కూడా డయాబెటిస్ రావడానికి దారితీస్తాయి. అధిక బరువు ఉన్న వారిలో రక్తంలో గ్లూకోజు స్థాయిలో హెచ్చుతగ్గులు ఎక్కువ. ఇది కూడా మధుమేహం ముప్పును తెచ్చిపెడుతుంది. 


అమెరికాన్ హార్ట్ అసోసియేషన్ చెప్పిన ప్రకారం రోజుకు ఒక మనిషి 1500 మిల్లీ గ్రాముల వరకు సోడియం తినవచ్చు. అంతకన్నా ఎక్కువ రోజూ తింటుంటే మాత్రం భవిష్యత్తులో మధుమేహ మహమ్మారి త్వరగానే పలకరిస్తుంది. కూరల్లో వండిన ఉప్పు కన్నా, అన్నంలో, వంటకాల్లో నేరుగా చల్లుకునే ఉప్పు వల్ల చాలా నష్టం జరుగుతుంది. అందుకే కూర చప్పగా ఉన్న సర్దకుపోయి తినడమే ఉత్తమం. ఉప్పును తక్కువగా తినడం అలవాటు చేసుకుంటే చాలా మంచిది. 


గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.


Also read: వేలానికి ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం, ఎంతకి అమ్ముడుపోయిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు


Also read: ప్రతి చిన్నవిషయానికి కోపం వస్తుందా? వీటిని రోజూ తినండి కంట్రోల్‌లో ఉంటుంది