హై బ్లడ్ ప్రెషర్ అనేది నిజానికి ప్రాణాంతక పరిస్థితి. దీన్నే హైపర్ టెన్షన్ అని కూడా అంటారు. రక్తనాళాల్లో పెరిగే ఒత్తిడి వల్ల గుండె మాత్రమే ఇతర వైటల్ ఆర్గాన్స్ మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. ఇది ఎలాంటి సంకేతం లేకుండా ప్రాణాల మీదకు వచ్చే సైలెంట్ కిల్లర్. సమస్య ఉన్న వారిలో చాలా మందికి ఆ విషయం తెలియక పోవచ్చు కూడా.
బీపీ ఎక్కువగా ఉంటే గుండె మీద భారం పెరుగుతుంది. ఇది హార్ట్ ఎటాక్ లేదా స్ట్రోక్ కు కారణం కావచ్చు. రక్తనాళాల మీద కూడా భారం పడుతుంది. కనుక గుండె మాత్రమే కాదు.. కిడ్నీ, బ్రెయిన్, కళ్ల మీద కూడా భారం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ సమస్యను త్వరగా గుర్తించి చికిత్స తీసుకోవడంతో పాటు కొన్ని లైఫ్ స్టైల్ మార్పులు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సమతుల ఆహారం తీసుకోవడం, భోజనంలో ఉప్పు తగ్గించడం, ప్రతి రోజూ తప్పనిసరిగా కొంత వ్యాయామం చెయ్యడం, స్మోకింగ్‌కు దూరంగా ఉండటం వంటి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.
ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సమస్య. అయితే చాలా మందిలో భోజనంలో ఉప్పు తగ్గించి తీసుకోవడం వల్ల మంచి గుణం కనిపిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. మరి అసలు ఈ హైబ్లడ్ ప్రెషర్ కథా కమామిషు ఒకసారి తెలుసుకుందాం.
బ్లడ్ ప్రెషర్ అంటే?
రక్తనాళాల్లో రక్తం ఒక నిర్ణీత వేగంతో నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ఫలితంగా రక్తనాళాల గోడల మీద ప్రసరించే రక్తం కొంత ఒత్తిడికి గురవ్వుతుంది. ఈ రక్తం గుండె నుంచి ఇతర శరీర భాగాలకు చేరుతుంది. ఇలాంటి క్రమంలో బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటే.. రక్తనాళాల గోడల మీద రక్తం వల్ల కలిగే ఒత్తిడి ఎక్కువగా ఉండటం అని అర్థం. దీన్నే రక్తపోటు అని కూడా అంటారు. ఇలాంటి పరిస్థితిలో రక్తం శరీర భాగాలకు అందించడానికి గుండె తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. అది క్రమేనా హానికరంగా మారుతుంది.
రక్త పోటు ఎక్కువగా ఉంటే.. కాలం గడిచే కొద్దీ రక్తనాళాల్లో సాగే గుణం తగ్గిపోతుంది. గట్టిగా మారి రక్త నాళాలు కొద్దికొద్దిగా కుంచించుకు పోతాయి. ఇలా జరగడానికి రక్తంలో చేరిన కొవ్వు కూడా కారణం అవుతుంది. దీన్నే కొలెస్ట్రాల్ అంటారు. ఇది ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం ఉంటుంది.
రక్తపోటు ఎంత ఉంటే సేఫ్? ఎంత ఉంటే డేంజర్?
- బ్లడ్ ప్రెషర్ ను రెండు నెంబర్లతో సూచిస్తారు. మొదటి నెంబర్ ను సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటారు. ఇది గుండె కొట్టుకుంటున్నపుడు రక్తనాళాల్లో ఉండే ఒత్తిడిని తెలుపుతుంది.
- రెండో నెంబర్ ను డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటారు. ఇది రెండు హృదయ స్పందనల మధ్య విరామంలో రక్తనాళాల్లో ఉండే ఒత్తిడిని తెలుపుతుంది.
- ఉదాహరణకు 120 సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్, 80 డాయస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ ఉంటే 120 ఓవర్ 80 లేదా 120/80 mmHg అని సూచిస్తారు.
- మామూలుగా అయితే.. 120 ఓవర్. 80 కంటే కాస్త తక్కువ ఉంటే ఆరోగ్యకరం అని నిపుణులు సూచిస్తున్నారు.
- రెండు మూడు నిమిషాల్లో పూర్తయ్యే అతి చిన్న పరీక్ష ద్వారా దీన్ని నిర్ధారించ వచ్చు.
- ఫార్మసీలు, జిమ్ లు, వర్క్ ప్లేసుల్లో ఈ మధ్య ఈ పరికరాలను అందుబాటులో ఉంచుతున్నారు.
40 సంవత్సరాల వయసు దాటిన ప్రతి ఒక్కరూ కనీసం ఏడాదికి ఒక్కసారైనా బీపీ చెక్ చేసుకోవాలని చెబుతున్నారు. బీపీ చెక్ చెయ్యడానికి వాడే పరికరాన్ని స్పిగ్మోమానోమీటర్ అంటారు. భుజం దగ్గర ఒక చిన్న కట్టులాంటిది కట్టి దానిలోకి గాలిని పంప్ చేసి రక్త ప్రసరణకు చిన్నగా అంతరాయం కలిగిస్తారు. నెమ్మదిగా చిన్న వాల్వ్ ద్వారా లోపలికి పంపిన గాలిని తీసేస్తారు. డాక్టర్ లేదా మిషన్ కు బ్లడ్ ప్రెషర్ కొలిచేందుకు అవకాశం ఏర్పడుతుంది.
బీపీ ఎక్కువగా ఉంటే అది దమనులు అంటే మంచి రక్తం శరీరానికి అందించే రక్తనాళాల మీద అదనపు ఒత్తిడి కలుగుతుంది. గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు, వాస్కూలార్ డిమెన్షియా, ఫెరీఫెరల్ ఆర్టరీ, పురుషుల్లో లైంగిక సామర్థ్యం తగ్గడం వంటి సమస్యలు రావచ్చు. బీపీ ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. అయితే రక్తపోటు మోతాదు కంటే తక్కువగా ఉన్నపుడు తలతిరగడం, వికారం వంటి చిన్నచిన్న లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సార్లు డీహైడ్రేషన్ వల్ల కొంచెం ప్రమాదకరం కావచ్చు. బీపీ అనేది చికత్స అందుబాటులో ఉన్న సమస్య అయినప్పటికీ చాలా మందిలో మరణానికి కూడా కారణం అవుతోంది.
లక్షణాలు
సాధారణంగా లక్షణాలు పెద్దగా కనిపించవు. కానీ కొందరిలో తీవ్రమైన తలనొప్పి, విపరీతమైన అలసట, చూపు సమస్యలు, ఛాతిలో నొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇంకొందరిలో శ్వాసలో ఇబ్బంది, హృదయ స్పందన క్రమబద్ధంగా లేకపోవడం, మూత్రంలో రక్తం కూడా కనిపించవచ్చు. వీటిలో ఏ లక్షణాలు కనిపించినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి బీజీ చెక్ చేయించుకోవడం ఉత్తమం. నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదం.
Also Read: ఈ కరోనా కాలంలో రోగనిరోధక శక్తి పెంచే పవర్ ఫుల్ డికాషన్ ఇదే, ఇలా తయారు చేయండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.