Minister Prashanth Reddy: కేంద్రం ప్రభుత్వం రాష్ట్రం విషయంలో చిన్న చూపు చూస్తోందని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఎన్ఆర్జీఎస్ కింద రైతులు కల్లాలు కట్టొద్దని, వీటికి డబ్బులు కేంద్రం ఇవ్వదని చెబుతున్నారని అన్నారు. రైతు బంధు కింద ఇప్పటి వరకు 57 వేల కోట్లు కేటాయించామని.. కానీ రైతులకు ఏ ఇబ్బంది కల్గకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని చెప్పారు. ధాన్యం విషయంలో లక్షా 7 వేల కోట్లు చెల్లించారని చెప్పుకొచ్చారు. 36 వేల కోట్లు డిస్కంలకు చెల్లించారని, ప్రాజెక్టుల కోసం లక్షన్నర కోట్లు కేటాయించారని స్పష్టం చేశారు. రైతుల కోసం మొత్తం మూడున్నర లక్షల కోట్లు ఖర్చు చేశారని చెప్పుకొచ్చారు. రైతులు కట్టుకున్న కల్లాల పైసలు తిరిగి ఇవ్వాలని కేంద్రం కోరిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా శుక్రవారం ఉదయం 10 గంటలకు నిజామాబాద్ నగరంలో ధర్నా నిర్వహిస్తామన్నారు. 






కేసీఆర్ ది రాక్ స్టార్ ఫ్యామిలీ..


సీఎం కేసీఆర్, కేటీఆర్, కవిత మీద అరవింద్, బండి సంజయ్ అవాకులు, చవాకులు పేలుస్తున్నారని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. బీజేపీలో ఆజ్ఞానులు ఉన్నారని విమర్శించారు. ఆడబిడ్డ అని కూడా చూడకుండా అరవింద్ విమర్శలు చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ఫ్యామిలి ఫైటర్ ఫ్యామిలీ అని బీజేపీ నాయకులు బండి సంజయ్, అరవింద్ లు చీటర్, ఫ్రాడర్ లు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో గల్లీలో మేమే ఢిల్లీలో మేమే.. అని తెలిపారు. కేసీఆర్ అంటే 11కేవీ పవర్ అని ఏ సర్వే చేసినా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి 100 సీట్లు వస్తున్నాయన్నారు. అలాగే కేసీఆర్ ది రాక్ స్టార్ ఫ్యామిలీ అని, బీజేపీది ఫేక్ స్టార్ ఫ్యామిలీ అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. 


బీఆర్ఎస్ నేతలపై మాత్రమే ఈడీ కేసులు, దాడులు


రైతులకు మద్దతు ధర ఇవ్వమని, ధాన్యాన్ని కొనుగోలు చేయమని, మీటర్లకు మోటార్లు పెడతామంటూ కేంద్ర ప్రభుత్వం అన్నదాతలను ఇబ్బంది పెడుతోందని ఎమ్మెల్యే గణేష్ గుప్తా చెప్పుకొచ్చారు. బీజేపీ ఎంపీలపై ఈడీ కేసులు ఉండవని, కానీ బీఆర్ఎస్ నేతలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు కమిట్మెంట్ తో ఉంటారని, గుజరాత్, యూపీలో సాగినట్లు ఇక్కడ ఆటలు సాగవని అన్నారు. 






రేపటి ధర్నాలో జిల్లా రైతులంతా పాల్గొనాలి..


రేపు జరుగుతున్న రైతు మహా ధర్నాలో జిల్లా రైతులు అందరూ పాల్గొనాలని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. తెలంగాణలో ఎన్ఆర్జీఎస్ స్కీం కింద రైతులు కల్లాలు కట్టుకుంటే వాటి డబ్బులు తిరిగి ఇవ్వాలని కేంద్రం కోరటం కరెక్ట్ కాదని అన్నారు. దేశంలో చౌకి దార్ ల పాలన కాదు జిమ్మే దార్ల పాలన కావాలన్నారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ గా ఉండాలని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందన్నారు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెంచేసి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారన్నారు. కార్పొరేట్ వారికి 19 లక్షల కోట్లు మాఫీ చేశారని.. ప్రజల డబ్బును మాత్రం లూటీ చేస్తున్నారని తెలిపారు.