శరీరంలో కొన్ని అవయవాలు విశ్రాంతి లేకుండా పనిచెయ్యాల్సి ఉంటుంది. అవి అలసిపోయినప్పుడు ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. శరీరం కదల్లేని స్థితికి చేరుతుంది. అలాంటి ముఖ్యమైన అవయవాలనే వైటల్ ఆర్గాన్స్ అంటారు. వాటిలోకి కిడ్నీలు కూడా వస్తాయి. ఇవి శరీరం నుంచి మలినాలను వేరుచేసే పని నిరంతరాయంగా చేస్తూనే ఉంటాయి. అంతేకాదు కొన్ని రకాల హర్మోన్ల సంతులనంలోనూ, రక్తపోటు నియంత్రణలోనూ కిడ్నీలు భాగం పంచుకుంటాయి.  ఇవి మానవ విసర్జన వ్యవస్థలో ముఖ్యమైన అవయవాలుగా చెప్పుకోవాలి. రకరకాల కారణాలతో కిడ్నీలు దెబ్బతింటూ ఉంటాయి. వాటి పనితీరు మందగించడానికి డయాబిటిస్, బీపీ వంటి అనేక అనారోగ్య సమస్యలు కారణం కావచ్చు. కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తప్పనిసరిగా షుగర్ స్థాయి, బీపిని అదుపులో ఉంచుకోవాలి, తగినంత వ్యాయామం కూడా కిడ్నీ ఆరోగ్యానికి కూడా అవసరం. ‘వరల్డ్ కిడ్నీ డే’ నేపథ్యంలో మన మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడే మూలికలు గురించి తెలుసుకుందాం. 


మన ఆహార రుచి, వాసన, రంగు వంటి వాటన్నీంటిని మెరుగు పరిచేందుకుగాను వంటలో కొన్ని రకాల హెర్బ్స్ లేదా మసలా దినుసులు ఉపయోగిస్తుంటాం. ఇవి మనం తీసుకునే ఆహారానికి మంచి రుచితో పాటు ఆరోగ్యాన్ని, పోషకాలను కూడా చేర్చుతాయని నిపుణులు తెలుపుతున్నారు. వీటిని తప్పనిసరిగా రోజూతీసుకోవడం వల్ల  కిడ్నీ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చు. అవేంటో చూద్దాం. 


తిప్పతీగ


అఫ్లాటాక్సిన్ వల్ల కిడ్నీలకు నష్టం జరగకుండా రక్షించటంలో తిప్పతీగ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఆల్కలాయిడ్లు అఫ్లాటాక్సిన్ కు విరుగుడుగా పనిచేస్తాయి. తిప్పతీగకు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువ అందువల్ల అఫ్లాటాక్సిన్ వల్ల విడుదలైన ఫ్రీరాడికల్స్ ను నాశనం చేస్తుంది.


పసుపు


పసుపు మెరుగైన ప్లాస్మా ప్రోటీన్ల ఉత్పత్తికి దోహదం చేస్తుంది. T2DM పేషెంట్లలో సీరం యూరియా, క్రియాటినిన్ లెవల్స్ అదుపులో ఉంచుతుంది. మూత్రపిండాల పనితీరును కూడా మెరుగు పరుస్తుంది.


అల్లం


అల్లం యాంటీ ఇన్ఫమ్లేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది. అందుకే ఇన్ఫెక్షన్లను అరికట్టడంలో అల్లం మంచి పాత్ర పోషిస్తుంది. ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీల్లో వచ్చే ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది.


ఆమ్లకి, బిభితకి, హరితకీ (త్రిఫల)


ఆమ్లకి, బిభితకి, హరితకి ఈ మూడు మూలికలను కలిపి త్రిఫల గా ప్రాచూర్యంలో ఉంది. వీటిని ప్రకృతి ప్రసాదించిన వరంగా చెప్పుకోవచ్చు. త్రిఫల కిడ్నీ కణజాలలాలను బలోపేతం చేస్తుంది. ప్లాస్మా ప్రోటీన్లను మెరుగుపరుస్తుంది. అల్బుమిన్, క్రియాటినిన్ ఆరోగ్యవంతమైన స్థాయిలో ఉంచుతుంది. మొత్తంగా చెప్పాలంటే కిడ్నీ పనితీరును పూర్తిస్థాయిలో మెరుగ్గా ఉంచుతుంది.


నోట్: వైద్య నిపుణులను సంప్రదించిన తర్వాతే వీటిని తీసుకోవాలి. సొంత వైద్యం ఎప్పటికీ ప్రమాదకరమే. కాబట్టి, పై మూలికలను ఏ సమయంలో ఎంత స్థాయిలో తీసుకోవాలనేది సంబంధిత వైద్యులు మాత్రమే చెప్పగలరని గమనించగలరు. 


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.