Delhi Liquor Policy Case:
కోర్టు పరిశీలనలో..
మనీశ్ సిసోడియాను 10 రోజుల పాటు రిమాండ్‌లో ఉంచేందుకు రౌజ్ అవెన్యూ కోర్టుకు పిటిషన్ పెట్టుకుంది ఈడీ. విచారణకు ఆయన సహకరించడం లేదని, మరి కొద్ది రోజులు ప్రశ్నించాల్సిన అవసరముందని నివేదించింది. ఇదే సమయంలో సిసోడియా బెయిల్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణను మార్చి 21కి వాయిదా వేసిన కోర్టు..మార్చి 17 వరకూ ఈడీ రిమాండ్‌లో ఉంచేందుకు అంగీకరించింది.
ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు సిసోడియా. అయితే...ఆయనను పూర్తి స్థాయిలో విచారించాలని, సమన్లు జారీ అయిన వారందరితో సిసోడియాకు ఎలాంటి సంబంధం ఉందో తేల్చాలని చెబుతోంది. సిసోడియా CA కూడా కొన్ని కీలక విషయాలు చెప్పాడని, కానీ సిసోడియా మాత్రం విచారణకు ఏ మాత్రం సహకరించడం లేదని అసహనం వ్యక్తం చేస్తోంది. అయితే...ఈడీ రిమాండ్ పిటిషన్ వేయడంపై సిసోడియా తరపున న్యాయవాది ఖండిస్తున్నారు. సీనియర్ అడ్వకేట్ దయన్ కృష్ణన్ తన వాదనలు వినిపించారు.
"ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఆమోదించారు. ఏ మాత్రం పరిశీలించకుండానే ఆ నిర్ణయం తీసుకుంటారా..? ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేకున్నా కేవలం ఉద్దేశపూర్వకంగా అరెస్ట్‌లు చేస్తూ పోతున్నారు. అమాయకులను నిందితులుగా చేసి వాళ్లను నిరపరాధులుగా నిరూపించుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. మొత్తం 57 పేజీల రిమాండ్ పిటిషన్ వేశారు. అందులో దాదాపు సీబీఐ కేసులో ఉన్న అంశాలే ఉన్నాయి. మనీలాండరింగ్ జరిగింది అని చెప్పడానికి కనీసం ఓ డాక్యుమెంట్ ఆధారం కూడా ఈడీ వద్ద లేదు. అయినా రిమాండ్ అడుగుతున్నారు. ఇదంతా కావాలని చేస్తున్నదే. PMLA చట్టాన్ని అడ్డంగా పెట్టుకుని సిసోడియాకు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు"
- సిసోడియా తరపు న్యాయవాది