Telangana News :  హైదరాబాద్ లోని కొత్తగా నిర్మించిన సచివాలయాన్ని ఏప్రిల్ 30న ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దాంతో పాటు హుస్సేన్ సాగర్ పక్కనే స్మృతి వనాన్ని జూన్ 2న ప్రారంభించేందుకు సీఎం పచ్చజెండా ఊపారు.  కొత్త సచివాలయ నిర్మాణ పనులను కేసీఆర్ పరిశీలించారు.  సెక్రటెరీయట్ ప్రారంభ తేదీపై అధికారులతో చర్చించారు. మరోవైపు సచివాలయం పక్కనే నిర్మిస్తున్న డా. అంబేడ్కర్ విగ్రహాన్ని ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  సచివాలయమంతా పరిశీలించిన సీఎం కేసీఆర్... త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జూన్‌ 2 లోపు సెక్రటేరియట్‌, అంబేద్కర్ విగ్రహం, అమరుల స్థూపం ప్రారంభించాలని ఇటీవల జరిగిన కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రకారం వేగంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. 


 


పలుమార్లు వాయిదా పడిన నూతన సచివాలయం ప్రారంభోత్సవం 


నూతన సచివాలయాన్ని సంక్రాంతికే ప్రారంభించాలని ప్రభుత్వం ముందు భావించింది. అయితే అప్పటికి సచివాలయ పనులు ఇంకా పూర్తి కాలేదు. దాంతో పాటు బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభ ఏర్పాటు, రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడంతో సచివాలయ ప్రారంభోత్సవం మొదటిసారి వాయిదా పడింది. ఆ తరువాత కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఫిబ్రవరి 17న ప్రారంభించాలని నిర్ణయించారు. పలువురు ముఖ్యమంత్రుల్ని జాతీయ నేతల్ని కూడా ఆహ్వానించారు. ఇంతలోనే ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో ఎన్నికల కోడ్ కారణంగా రెండో సారి ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఇప్పుడు ఏప్రిల్ 30వ తేదీని ఖరారు చేశారు. 


అత్యాధునిక హంగులతో తెలంగాణ వైభవం ఉట్టిపడేలా భవనం నిర్మాణం 


నూతన  సచివాలయం చూడగానే నిజాం కాలం నాటి కట్టడాలు కళ్లముందు కదలాడుతాయి.డిజైన్ రూపొందిచడంలో ఇందు కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. దశాబ్దాల కాలంపాటు నిజాం నవాబుల పాలనలో హైదరాబాద్ స్టేట్ ఉంది.  ఇప్పుడున్న ప్రభుత్వ కార్యాలయాల్లో అనేక కట్టడాలు ఆనాడు నిజాం ప్రభువులు నిర్మించినవే. అందుకే అలనాటి వైభవానికి ఏమాత్రం తీసిపోకుండా అత్యాధునిక హంగులతో కొత్త సచివాలయం రూపుదిద్దుకుంటోంది. మొత్తం 11.45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన సచివాలయం నిర్మిస్తున్నారు. ఎత్తు 278 అడుగులు ఉండగా గ్రౌండ్ ఫ్లోర్ తో కలిసి మొత్తం ఏడు ఫ్లోర్లతో మొత్తం నిర్మాణం జరుగుతోంది. రూఫ్ టాప్ లో ఏర్పాటు చేయబోతున్న స్కై లాంజ్ సచివాలయానికి ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. ఆహ్లదకరమైన పార్కులతో సుందరంగా తీర్చిదిద్దడంతోపాటు పటిష్టమైన భద్రత మధ్య సచివాలయం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


శరవేగంగా పనులు 


నూతన సచివాలయంలో 6వ అంతస్తులో అత్యాధునిక హంగులతో సీఎం చాంబర్ ఉంటుంది. సీఎం కోసం ప్రత్యేక ద్వారం, స్పెషల్ లిఫ్ట్ ఏర్పాటు చేశారు. సచివాలయం నిర్మాణంలో మూడు  సింహాల జాతీయ చిహ్నం ప్రధాన ఆకర్షన కానుంది.  భవనం ముందు,వెనుక వైపున అమర్చిన ప్రధాన గమ్మటాలపై ఈ మూడు సింహాల జాతీయ చిహ్నం ఏర్పాటు చేశారు. ఢిల్లీ నుండి ప్రత్యేకంగా తెప్పించిన ఈ చిహ్నాలు ఒక్కొక్కటి ఐదు టన్నుల కాంస్య లోహంతో తయారు చేయించారు.అంతే కాదు సందర్శకుల కోసం ప్రత్యేక వెయిటింగ్ హాల్ ఉంటుంది. సచివాలయం ఆవరణలో మందిరం, మసీదు, చర్చిలను కూడా నిర్మిస్తున్నారు.సచివాలయ భవనంముందు విశాలంగా ఉండేలా పచ్చికబయళ్లు, ల్యాండ్‌ స్కేపింగ్‌ పనులు సమాంతరంగా జరుగుతున్నాయి. మూడు షిఫ్టుల్లో 24 గంటల పాటు  పనులు చేస్తున్నారు.