Reliance Campa Cola: మండే వేసవిలో జనాన్ని చల్లబరిచేందుకు, పోటీ కంపెనీల్లో వేడి పెంచేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక కొత్త శీతల పానీయాన్ని (Beverage) మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.
రిటైల్ వ్యాపారంలో ఉన్న 'రిలయన్స్ రిటైల్ వెంచర్స్'కు చెందిన FMCG కంపెనీ 'రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్' (Reliance Consumer Products Limited), శీతల పానీయ బ్రాండ్ కాంపాను (Campa) మార్కెట్‌లోకి లాంచ్ చేసింది.
ప్రస్తుతం, మూడు ఫ్లేవర్‌లతో క్యాంపా పోర్ట్‌ఫోలియోను ప్రారంభించింది. అవి... కాంపా కోలా (Campa Cola), క్యాంపా లెమన్ (Campa Lemon), క్యాంపా ఆరెంజ్ (Campa Orange).
పెద్ద కంపెనీలకు పోటీ
పెప్సీ (Pepsi), కోక-కోలాకు (Coca Cola) పోటీగా కాంపా బ్రాండ్‌ను పునఃప్రారంభించింది రిలయన్స్ ఇండస్ట్రీస్.
వాస్తవానికి కాంపా బ్రాండ్ కొత్తది కాదు, కొన్ని దశాబ్దాలుగా భారతీయ మార్కెట్‌లో ఒక వెలుగు వెలిగింది. 1970, 1980 దశాబ్దాల్లో భారతదేశ పానీయాల మార్కెట్‌లోని అతి పెద్ద కంపెనీల్లో ఇది ఒకటి. 1990 దశకంలో కోకా-కోలా & పెప్సీ ఆగమనంతో ఆగమాగం అయింది. వాటి సవాలు ముందు నిలబడలేక మూలనబడింది.
తన FMCG వ్యాపారాన్ని మరింతగా పెంచే వ్యూహంలో భాగంగా, గతేడాది ఆగస్టులో, సాఫ్ట్ డ్రింక్స్ & ఫ్రూట్ జ్యూస్ తయారీ సంస్థ సోస్యో హజూరి బేవరేజెస్‌లో (Sosyo Hajoori Beverages Pvt Ltd) 50 శాతం వాటాను రిలయన్స్ రిటైల్‌కు చెందిన రిలయన్స్ కన్జూమర్ ప్రోడక్ట్స్ కొనుగోలు చేసింది. ప్యూర్ డ్రింక్స్ గ్రూప్ నుంచి కాంపా బ్రాండ్‌ను సోస్కో అంతకుముందే దక్కించుకుంది. సోస్కోలో వాటా కొనుగోలుతో కాంపా బ్రాండ్ రిలయన్స్ వశమైంది. ఆరు నెలల తర్వాత, కాంపా బ్రాండ్‌కు కొత్త మెరుగులద్ది మార్కెట్లోకి విడుదల చేసింది రిలయన్స్.
తెలుగువాళ్లకే ఫస్ట్ ఆఫర్
మొదట తెలుగు రాష్ట్రాల్లో ఈ పానీయాన్ని రిలయన్స్ లాంచ్ చేసింది. క్రమంగా దేశంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తుంది. 200ml, 500ml, 600ml, 1000ml, 2000ml బాటిల్స్‌లో ఈ డ్రింక్స్ లభ్యమవుతాయి. వీటి ధరల వివరాలను కంపెనీ వెల్లడించలేదు.
"గొప్ప వారసత్వాన్ని కలిగిన స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలన్న కంపెనీ వ్యూహానికి అనుగుణంగా కంపా కోలా బ్రాండ్‌ను పునఃప్రారంభిస్తున్నామని రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ వెల్లడించింది. దీని ప్రత్యేక రుచి, వాసన కారణంగా ఇది భారతీయ వినియోగదార్లతో లోతైన అనుబంధాన్ని కలిగి ఉందని తెలిపింది".
"ద గ్రేట్ ఇండియన్ టేస్ట్" స్లోగన్‌తో తొలినాళ్లలో కాంపా బ్రాండ్ చెలరేగింది. ఇప్పుడు అదే స్లోగన్‌తోనే కాంపా బ్రాండ్‌ను మార్కెట్ చేస్తున్నట్లు రిలయన్స్ కన్జూమర్ ప్రోడక్ట్స్ వెల్లడించింది.
గత సంవత్సరం ఆగష్టు 29న, రిలయన్స్ ఇండస్ట్రీస్ AGMలో ప్రసంగిస్తూ, FMCG వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నట్లు రిలయన్స్ రిటైల్ డైరెక్టర్ ఇషా అంబానీ ప్రకటించారు. ఆమె ప్రకటించిన కేవలం రెండు రోజుల్లోనే Campa బ్రాండ్ కొనుగోలు తెరపైకి వచ్చింది. భారతదేశంలో FMCG రంగం విలువ సుమారు $110 బిలియన్లని ఒక అంచనా.