వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి ఇవాళ(శుక్రవారం) మరోసారి సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటికే ఓసారి సీబీఐ విచారణ హాజరైన ఆయన ఇప్పుడు హాజరుకావడం ఇది మూడోసారి. తనకు తెలిసిన విషయాలను ఇప్పటికే చెప్పానంటున్న అవినాష్‌... ప్రస్తుతం విచారణ తన ఫ్యామిలీ టార్గెట్‌గా జరుగుతోందని ఆరోపించారు. 


సిబిఐ అధికారులు వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటికే జనవరి 28న, ఫిబ్రవరి 24న రెండుసార్లు అవినాష్ రెడ్డిని విచారించారు. విచారణలో భాగంగా ఈనెల ఆరో తేదీన హైదరాబాద్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఈనెల 4వ తేదీన పులివెందులలోని వైయస్ అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. అయితే తనకు ముందుగా నిర్ణయించిన పలు కార్యక్రమాల వలన ఆరోజు విచారణకు హాజరు కాలేనని అవినాష్ రెడ్డి సిబిఐకి లేఖ రాశారు. దీంతో సిబిఐ అధికారులు ఈనెల 10వ తేదీన విచారణకు హాజరుకావాలని అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లి నోటీసులు జారీ చేశారు. ఆయన మూడోసారి సిబిఐ విచారణకు హాజరువుతున్నారు. 


ఈనెల 12వ తేదీన వైయస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని కూడా విచారణకు హాజరు కావాలని ఇప్పటికే సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ విషయంపై అవినాష్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ సిబిఐ అధికారులు తనకు పదో తేదీన, తన తండ్రికి 12వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారని ఈ మేరకు తాము హాజరు అవుతామని స్పష్టం చేశారు. 


వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి పైనే ప్రధానంగా సీబీఐ అనుమానం 


వై.ఎస్. వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో సీబీఐ దాఖలు చేసిన కౌంటర్‌లో అవినాష్ రెడ్డిపై ప్రధానంగా అనుమానాలు వ్యక్తం చేసింది.  వైఎస్ అవినాష్‌రెడ్డి, శివశంకర్ రెడ్డితో వివేకాకు రాజకీయ వైరుధ్యం పెరిగిందని సీబీఐ పేర్కొంది. ఎంపీ టికెట్ అవినాష్‌రెడ్డికి బదులు తనకు ఇవ్వాలని వివేకా కోరుకున్నారని తెలిపింది. తనకు ఇవ్వకపోయినా షర్మిల, విజయమ్మకు ఇవ్వాలని వివేకా పట్టుబట్టారని పేర్కొంది. వివేకా రాజకీయ కదిలికలు అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డికి నచ్చలేదని సీబీఐలో తెలిపింది. శివశంకర్‌రెడ్డితో కలిసి అవినాష్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి వివేకా హత్యకు కుట్ర పన్నినట్లు తెలుస్తోందని పేర్కొంది. హత్య జరిగిన రోజు రాత్రి వై.ఎస్. అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి ఇంటికి సునీల్ యాదవ్ వెళ్లాడని ఐదుగురితో కలిసి అవినాష్‌రెడ్డి హత్య స్థలానికి వెళ్లాడని తెలిపింది. నిందితులు హత్య జరిగిన స్థలాన్ని శుభ్రం చేశారని వివేకా శరీరంపై ఉన్న గాయాలు కనిపించకుండా బ్యాండేజీ కట్టారని కోర్టుకు సమర్పించిన కౌంటర్‌లో సీబీఐ పేర్కొంది. 
 
అరెస్ట్ ఊహాగానాలతో ఎంపీ ముందు జాగ్రత్త ప్రయత్నాలు ! 


వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను అరెస్ట్  చేయకుండా సీబీఐకి ఆదేశాలివ్వాలని కోరుతూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.  సీబీఐ తనను విచారించే సమయంలో ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని పిటిషన్‌లో కోరారు అవినాష్‌రెడ్డి. తన న్యాయవాది సమక్షంలోనే విచారణ చేయాలని ... పలుమార్లు కోరినా సిబిఐ తన అభ్యర్ధనను అంగీకరించలేదన్నారు.  160 CRPC నోటీస్‌ ఇచ్చారు కాబట్టి సీబీఐ ఎలాంటి బలవంతపు ,చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు.  వివేకా హత్య కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న దస్తగిరిని.. ఇప్పటివరకు సీబీఐ అరెస్ట్ చేయలేదని.. దస్తగిరి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కూడా సీబీఐ ఎక్కడా వ్యతిరేకించలేదని  అవినాష్ రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు.  దస్తగిరి అక్కడ ఇక్కడ విని చెప్పిన మాటల ఆధారంగానే..సీబీఐ విచారణ కొనసాగుతోందన్నారు. తనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినప్పటికీ..ఈ కేసులో నన్ను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. 


సునీల్ యాదవ్ గూగుల్ టేక్ఔట్ ఫోన్ సిగ్నల్ లొకేషన్ చూపి సిబిఐ తనను వేధిస్తోందని..  స్పాట్ లో దొరికిన లేఖపై సిబిఐ దర్యాప్తు చేయటం లేదన్నారు.  వివేకా హత్య కేసులో దర్యాప్తు అధికారి పనితీరు పక్షపాతంగా ఉందని..  వివేకా హత్య ఎలా జరిగిందో ముందుగానే నిర్ణయించుకొని..అదే కోణంలో విచారణ చేస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. తప్పుడు సాక్ష్యాలు చెప్పేలా విచారణాధికారి కొందరిపై ఒత్తిడి తెస్తున్నారని..  తాను విచారణలో చెప్పిన విషయాలను కూడా విచారణ అధికారి మార్చేస్తున్నారని  అవినాష్‌రెడ్డి ఆరోపించారు. నోటీస్ దశలో విచారణ సాగుతుండగా చార్జ్ షీట్‌లో నేరస్తునిగా సిబిఐ చిత్రీకరిస్తోందన్నారు.