Beat the Heat : వాతావరణ మార్పుల ఫలితంగా ప్రపంచ ఉష్ణోగ్రతలు, వేడిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ అధిక ఉష్ణోగ్రతలు మానవ ఆరోగ్యాన్ని నెగిటివ్​గా ప్రభావితం చేస్తాయి. అందుకే సమ్మర్​లో వచ్చే హీట్​ వేవ్​ (Heatwave Precautions ) సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటున్నారు నిపుణులు. ఈ సమయంలో పగలు ఎక్కువగా, రాత్రుళ్లు తక్కువగా ఉంటూ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. ఇవి వివిధ ఆరోగ్య సమస్యలను తీసుకువస్తాయి. 


హీట్ వేవ్ సమయంలో శరీరంపై ఒత్తిడి పెరుగుతుంది. శ్వాసకోశ, హృదయ సంబంధ వ్యాధులు వస్తాయి. మధుమేహం, గుండె, మూత్రపిండ వ్యాధుల ప్రమాదాలు ఈ సమయంలో తీవ్రస్థాయిలో ఉంటాయి. కొన్ని సందర్భాల్లో హీట్​వేవ్ వల్ల ఈ మూడు ప్రధాన ఆరోగ్యసమస్యలు ప్రాణాలను కూడా హరిస్తాయి. కాబట్టి అధిక వేడికి గురికాకుండా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో ఇప్పుడు చూసేద్దాం. 


హీట్ వేవ్ అలెర్ట్​తో.. 


హీట్​ వేవ్ సమయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు మొబైల్స్​కి అలెర్ట్ పంపిస్తారు. లేదంటే మీరు రెగ్యులర్​గా వాతావరణ సూచలను తెలుసుకోండి. దానికి అనుగుణంగా మిమ్మల్ని, మీ ఇంటిని సిద్ధం చేసుకోవాలి. ఇంట్లో ఉంటే వేడిని తగ్గించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండే పనులు చేసుకోవడం.. లేదా ఎండ కంటే ముందే గమ్యస్థానానికి చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలి. అలాగే విద్యుత్ సరఫరా నిలిచినా.. నీటి ఇబ్బంది ఉన్నా.. ముందే ఎలా ప్రిపేర్ అవ్వాలో చూసుకోండి. హెల్త్​కి రిలేటెడ్ మెడిసన్ కచ్చితంగా అందుబాటులో ఉంచుకోవాలి. 


హీట్ వేవ్ సమయంలో 


వీలైనంత నీటిని తాగుతూ హైడ్రేటెడ్​గా ఉండాలి. రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీరు కచ్చితంగా తాగాలి. షుగర్ డ్రింక్స్, కాఫీలకు దూరంగా ఉండండి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 4 గంటల మధ్య బయటకు వెళ్లకుండా చూసుకోండి. కుదిరితే ముందే గమ్యస్థానానికి వెళ్లిపోండి. అలాగే కూలర్స్, ఏసి వినియోగిస్తే వేడి తీవ్రత కాస్త తగ్గుతుంది. 


వేడి ఎక్కువగా ఉండే సమయంలో శ్రమతో కూడిన పనులు చేయకండి. ఇది మీ ఎనర్జీని పూర్తిగా డ్రైన్ చేస్తుంది. చర్మాన్ని కప్పి ఉంచే దుస్తులు ధరించాలి. తేలికగా, వదులుగా ఉంచే దుస్తులు మంచి ఎంపిక. ఎండ నుంచి కాపాడుకోవడానికి స్కార్ఫ్ లేదా టోపీ, గొడుగులను ఉపయోగించవచ్చు. సన్​గ్లాసెస్​ కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తాయి. సన్​స్క్రీన్​ని కూడా కచ్చితంగా అప్లై చేయండి. 


హెల్త్ అలెర్ట్


చెమట ఎక్కువగా వచ్చి.. నాడి వేగంగా కొట్టుకున్నా.. లేదా పల్స్ డౌన్ అయిపోయినా.. వాంతులు, వికారం, తలతిరగడం, మూర్ఛ వంటి లక్షణాలు కనిపిస్తే ముందుగా ఎండ నుంచి నీడకు వెళ్లిపోవాలి. తర్వాత వైద్య సహాయం తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో స్పృహ కోల్పోవడం, హార్ట్ అటాక్స్ కూడా వచ్చే అవకాశముంది. కాబట్టి బయటకు వెళ్లిన నీటిని తాగుతూ.. ఎండ నుంచి నీడలోకి శరీరానికి విశ్రాంతిని అందిస్తూ ఉండండి. 


సన్ స్ట్రోక్ వస్తే.. 


మీ చుట్టూ ఎవరైనా హీట్ స్ట్రోక్​ వల్ల ఇబ్బందిని ఎదుర్కొంటుంటే వెంటనే వైద్య సహాయం ఇవ్వడానికి ప్రయత్నించండి. ఆ వ్యక్తిని నీడలోకి లేదా ఎయిర్ కండీషన్​లోకి తీసుకువెళ్లాలి. శరీరంపై ఉన్న అదనపు దుస్తులు తీసేస్తే మంచిద. చర్మానికి తడిని అప్లై చేస్తే మరీ మంచిది. ఇవి ఆ వ్యక్తి శరీర ఉష్ణోగ్రతలను తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా వైద్య సహాయం అందేవరకు ప్రాణాలతో నిలుపుతాయి. 


మరిన్ని టిప్స్


వృద్ధులు, పెట్స్, పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు తీసుకెళ్లకూడదు. అత్యంత వేడిగా ఉండే సమయంలో ఓవెన్స్, స్టవ్స్, హెయిర్ డ్రైయర్​లు ఉపయోగించకపోవడమే మంచిది. వాహనాలను కూడా నీడలో పార్క్ చేస్తే మంచిది. 





గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.