Heart disease in young adults : వయసైపోయాక వచ్చే సమస్యల్లో గుండెపోటు ఒకటి. కానీ ఇప్పుడు హార్ట్ చాలా వీక్ అయిపోతుంది. ఎందుకంటే యువతలోనే గుండె సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. అంతేకాదు.. అవి మరణాలకు దారితీస్తున్నాయి. ఈ మధ్యకాలంలో గుండె సమస్యలతో సంభవిస్తున్న మరణాల్లో యువతే ఎక్కువగా ఉంటున్నారని పలు అధ్యయనాలు తేల్చాయి. అసలు వీటి వెనక ఉన్న కారణాలు ఏంటి? యూత్​ గుండె సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూసేద్దాం. 

లైఫ్​స్టైల్​లో మార్పులు

యువతలో గుండె సమస్యలు పెరగడానికి అత్యంత ప్రధాన కారణం లైఫ్ స్టైల్​. జీవనశైలిలోని ఎన్నో అంశాలు గుండెకు ప్రమాద కారకాలుగా మారి.. గుండె సమస్యలను కలిగిస్తున్నాయి. ఇవి క్రమంగా మరణాలకు దారి తీస్తున్నట్లు నిపుణులు చెప్తున్నారు. వేగవంతమైన ఈ ప్రపంచంలో చాలా మంది యువకులు హెల్తీ లైఫ్​స్టైల్​ని ఫాలో అవ్వలేకపోతున్నారు. పనిలో లేదా చదువులో ఎక్కువ సమయం గడపడం, స్క్రీన్ సమయం పెరగడం, ఎక్కువసేపు ఒకటే పనిలో కూర్చోవడం చేస్తున్నారు. అలాగే షుగర్స్, ఫ్రై చేసిన ఫాస్ట్​ని ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇవన్నీ శరీరంలో కొలెస్ట్రాల్​ని పెంచి గుండె జబ్బులకు కారణమవుతున్నాయి. 

తీసుకునే ఆహారం.. 

వర్క్​లో ఉన్నా.. లేదా చదువు కోసం ఏ ఊరైనా వెళ్తే.. ఫుడ్ విషయంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సోడియం ఎక్కువగా ఉండే, ప్రాసెస్ చేసిన ఫుడ్స్, హైజీన్​గా లేని ఆహారం, అన్​హెల్తీ ఫ్యాట్స్, డీప్ ఫ్రైచేసిన ఫుడ్స్ వారికి ఆప్షన్​గా మారుతున్నాయి. ఇవన్నీ కొలెస్ట్రాల్​ని, బీపీని పెంచి.. హృదయ సంబంధ వ్యాధులను రెట్టింపు చేస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల మనిషి హెల్తీగానే కనిపించినా.. గుండె సమస్యలతో ఇబ్బంది పడి ఆకస్మిక మరణాలకు కారణంగా మారుతున్నాయి. 

పెరుగుతున్న దీర్ఘకాలిక సమస్యలు

లైఫ్​స్టైల్​లోని అలవాట్లతో ఊబకాయం కూడా యువతలో ఎక్కువగా కనిపిస్తుంది. అధిక బరువు వల్ల రక్తపోటు, టైప్ 2 డయాబెటిస్, కొలెస్ట్రాల్​ వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. బీపీ హృదయనాళ వ్యవస్థపై ప్రెజర్ ఎక్కువ పెడుతుంది. మధుమేహం గుండె సమస్యలను రెట్టింపు చేస్తుంది. ఒబెసిటీ వల్ల ఆయాసం వస్తుంది. ఇవన్నీ గుండెను నెగిటివ్​గా ఇంపాక్ట్ చేస్తాయి. వీటికి తగ్గట్టు శరీరానికి తగినంత పోషకాలు అందించకపోవడం వల్ల గుండె ప్రమాదం రెట్టింపు అవుతుంది. 

కీ రోల్ ప్లే చేస్తోన్న స్ట్రెస్ 

యువతను వేధిస్తున్న అతిపెద్ద సమస్య ఒత్తిడి. చదువుకుంటున్న వారి నుంచి ఉద్యోగం చేసేవారి వరకు దాదాపు అందరూ స్ట్రెస్​తో ఇబ్బందులు పడుతున్నారు. యువతలో ఈ మానసిక సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయే తప్పా తగ్గే దారి దొరకడం లేదు. ఈ ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసాల్ విడుదలై.. ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. రక్తపోటు పెరుగుతుంది. ఈ స్ట్రెస్​ని తగ్గించుకునేందుకు కొందరు స్మోక్ చేస్తారు. మరికొందరు డ్రింకింగ్ చేస్తారు. ఈ రెండూ కూడా గుండె సమస్యలను రెట్టింపు చేస్తాయి. 

జన్యుపరమైన

యువతలో గుండె సమస్యలు రావడానికి జన్యుపరమైన కారణాలు కూడా ఉన్నాయి. ఇవి గుండె జబ్బులకు నేరుగా కాకపోయినా.. హైపర్ కొలెస్టెరోలేమియా పరిస్థితులకు దారి తీసి.. చిన్న వయసు నుంచే కొలెస్ట్రాల్ సమస్యను పెంచుతాయి. ఇవి క్రమంగా హార్ట్ సమస్యలను పెంచుతాయి. అందుకే జన్యుపరమైన వాటిని ముందుగా గుర్తిస్తే మంచిది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. 

లైఫ్​స్టైల్​ని వీలైనంతవరకు మార్చుకోవాలి. యంగ్​గా ఉన్నప్పుడే శరీరానికి ఓ హెల్తీ రొటీన్​ని అలవాటు చేయాలి. దానిలో భాగంగా వ్యాయామాన్ని చేర్చుకోవాలి. జిమ్​కి వెళ్లడం, డ్యాన్స్, రన్నింగ్ వంటివి డైలీ రొటీన్​లో భాగమైతే గుండె స్ట్రాంగ్​గా మారడంతో పాటు మీరు హెల్తీగా ఉంటారు. ఫుడ్ విషయంలో కూడూ కచ్చితంగా మార్పులు చేసుకోవాలి. బయట ఫుడ్ కొనుక్కునే డబ్బులతో హెల్తీగా ఫ్రూట్స్, కూరగాయలను కొనుక్కోవచ్చు. వీటిని మీ డైట్​లో చేర్చుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. రెగ్యులర్​గా మెడికల్ టెస్ట్​లు చేయించుకుంటే ప్రమాద కారకాలను ముందే గుర్తించి ట్రీట్​మెంట్ తీసుకోవచ్చు. ఈ గుండె సమస్యలకు చెక్​ పెట్టొచ్చు. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.