మనిషి జీవించడానికి ఆరోగ్యం ఎంత ముఖ్యమో తెలిసిందే. అయితే, ఆహారాన్ని కూడా ఒక నియమం ప్రకారమే తీసుకోవాలి. ఏదిపడితే అది తినేయడం. సరైన వేళలు పాటించకుండా ఆహారాన్ని తీసుకోవడం వంటివి పాటిస్తే.. ప్రాణాంతకం కూడా. మీకు తెలియకుండా కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు స్లో పాయిజన్‌లా మీ శరీరాన్ని క్షీణించేలా చేస్తాయి. అక్టోబరు 16.. వరల్డ్ ఫుడ్ డే నేపథ్యంలో ఈ కింది విధంగా మీ ఆహార నియమాలను మార్చుకుని ఆరోగ్యంగా ఉండండి.
‘ఫుడ్ డే’లో మనం ఎలాంటి ఆహారపు అలవాట్లు అలవరుచుకోవాలో తెలుసుకొనే ముందు.. అసలు ఈ ‘ఫుడ్ డే’ ఎందుకు నిర్వహిస్తున్నారనేది తెలుసుకోవాలి. ఎందుకంటే, ఆహారం మనం తింటే సరిపోదు. దాని విలువ కూడా తెలుసుకోవాలి. మనకు దొరికే ఆ నాలుగు మెతుకులు.. ఇతరులకు దొరక్కపోవచ్చు. అలాగే, పంట పండిన రోజు నుంచి నోటివరకు వచ్చే వరకు ఎంత శ్రమ ఉంటుందో కూడా తెలుసుకోవాలి. అప్పుడే మనం ఆహారానికి విలువ ఇవ్వగలం. ఇక నియమం ప్రకారం తీసుకోగలం. అందుకే అక్టోబరు 16న ‘వరల్డ్ ఫుడ్ డే’ నిర్వహిస్తున్నారు. ఇదే రోజు ‘యునైటెడ్ నేషన్స్ ఫూడ్ అండ్ అగ్రికల్చర్’ ఆవిర్భావ దినం కూడా. ప్రపంచ వ్యాప్తంగా హెల్దీ ఈటింగ్ ప్రాధాన్యతకు సంబంధించిన అవగాహన, ఆకలి, దారిద్ర్యం గురించి అవగాహన కూడా అందించడం ఈ రోజు లక్ష్యం. ప్రపంచంలో ఇప్పటికీ ఇంకా కోట్లలో జనాభా ఆరోగ్యాన్ని అందించే పౌష్టిక ఆహారాన్ని తీసుకునే స్తోమత లేని వారు ఉన్నారనే నిజం మీద ఈ సారి దృష్టి సారించారు.
పౌష్టికాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటారు. అంతేకాదు పౌష్టికాహారం తీసుకోకపోవడం, పోషకాలు లేని ప్రాసెస్డ్, జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల రకరకాల అనారోగ్యాలు చుట్టుముడతాయి. కాబట్టి ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడం ఆరోగ్యవంతమైన జీవితానికి చాలా ముఖ్యమైన అవసరం. తీసుకునే ఆహారంలో రోజువారీ ప్రొటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన ఫ్యాట్, విటమిన్లు, మినరల్స్ తో పాటు ఇతర అన్ని పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలి. నిజానికి ఆరోగ్యవంతమైన ఆహారం ఏమిటి? దాని వల్ల కలిగే ఆరోగ్యం ఎటువంటిది ఒకసారి తెలుసుకుందాం
గుండె ఆరోగ్యానికి
క్రమం తప్పకుండా సమతుల ఆహారం తీసుకోవడం, తగినంత వ్యాయామం చెయ్యడం వల్ల గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. బీపి, కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి ఈ అలవాటు కాపాడుతుంది. బీపీ, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటే గుండె ఆరోగ్యం కచ్చితంగా బావుటుంది.
క్యాన్సర్ ముప్పు తప్పుతుంది
క్యాన్సర్ ప్రాణాంతకమైన వ్యాధి. అది ఎందువల్ల వస్తుందో చెప్పటం కష్టం. శరీరంలో ఇన్ఫ్లమేషన్ లేకుండా చూసుకోవడం చాలా అవసరం. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్స్ కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. శరీరం ఫ్రీ రాడికల్స్ తో పోరాడే శక్తిని సంతరించుకొని ఉంటుంది. ఫలితంగా క్యాన్సర్ ముప్పు చాలా వరకు నివారించబడుతుంది.
జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి
పోషకాలు కలిగిన తాజా ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. పోషకాలు కలిగిన ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. ఆహారంలోని ఫైబర్ పేగుల కదలికలకు దోహదం చేస్తుంది. ఫలితంగా మలబద్దకం కూడా రాదు. ఇది జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి అత్యంత అవసరం.
ఆరోగ్యవంతమైన బరువు కలిగి ఉండాలి
పోషకాలు కలిగిన ఆహారం తగిన మోతాదులో తీసుకోవడం వల్ల అధిక బరువు, స్థూల కాయ సమస్యలు దూరం అవుతాయి. ఈరోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అధిక బరువు ప్రాణాంతంగా పరిణమిస్తోంది. స్థూలకాయం వల్ల బీపీ, గుండె సమస్యలు, డయాబెటిస్ వంటి రకరకాల దీర్ఘకాలిక అనారోగ్యాలకు కారణం అవుతోంది. హెల్తీ ఫూడ్ తీసుకోవడం వల్ల అందులోని ప్రొటీన్లు, ఫైబర్, కార్బోహైడ్రేట్స్, ఇతర పోషకాలు శరీర బరువును మేనేజ్ చెయ్యడంలో దోహదం చేస్తాయి.
మానసిక ఆరోగ్యానికి కూడా
మంచి ఆహారం శరీరానికి మాత్రమే కాదు మనసుకు కూడా అవసరం. కొన్ని రకాల ఆహారపదార్థాలు తీసుకుంటే యాంగ్జైటీ పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల మీ మూడ్ పాడైపోవచ్చు. పని చెడి పోవచ్చు. ఎక్కువ కాలం పాటు యాంగ్జైటీ కొనసాగితే ఇతర అనారోగ్యాలు కూడా కలగ వచ్చు. మానసిక ఆరోగ్యానికి కూడా సమతుల ఆహారం తీసుకోవడం అవసరం. అలాగే ఆహారాన్ని టైమ్‌కు తినాలి. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ఆహారాన్ని పడేయకుండా మీకు సరిపడా మాత్రమే తీసుకోవాలి. రెస్టారెంట్లలో మిగిలిపోయే ఆహారాన్ని వేస్ట్ చేయొద్దు. దాన్ని ప్యాక్ చేసి ఆకలితో ఉండే పేదలకు ఇవ్వండి.