కోవిడ్19 వ్యాప్తి నేపథ్యంలో శరీరానికి ఆక్సిజన్ ఎంత అవసరమో సామాన్యులకు సైతం అర్థమైంది. ఆరోగ్యవంతులుగా కనిపించినా కరోనా సోకడంతో చాలా మందిలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోయాయి. దీంతో వెంటిలేటర్ సాయంతో చికిత్స అందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితులలో మన శరీరంలో ఆక్సిజన్‌ను సహజంగా పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను ఎలా పెంచుకోవాలి.. ఏయే ఆహార పదార్థాల ద్వారా ఇది లభిస్తుందో ఇక్కడ ఆ వివరాలు అందిస్తున్నాం.
సాధారణంగా వాయు కాలుష్యం వల్ల అనారోగ్యం బారిన పడిన వారిలో ఆక్సిజన్ స్థాయి పడిపోవడం లాంటి సమస్యలు వస్తాయని.. ప్రస్తుతం కోవిడ్ కారణంగా ఎక్కువ మందిలో ఈ సమస్య కనిపిస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మాస్కులు ధరించడం ద్వారా కొంత వరకు మనం కాలుష్యం బారిన పడకుండా ఉంటామని అంటున్నారు. యోగా, వ్యాయామాలు చేయడం ద్వారా శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ అందుతుందని పేర్కొన్నారు.
వీటితో పాటు కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటే శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయని సూచిస్తున్నారు. విటమిన్లు, ఖనిజ లవణాలు అధికంగా ఉన్న పళ్లు, తాజా కూరగాయల ద్వారా ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయని చెబుతున్నారు. ఆహారంలో 80 శాతం ఆల్కలీన్ ఉన్న పదార్థాలను తీసుకుంటే రక్తంలో ఆక్సిజన్ స్థాయి పెరుగుతుందని అంటున్నారు. వీటిని రోజు తీసుకునే ఆహారంలో భాగం చేయడం ద్వారా శరీరానికి అవసరమైన ఆక్సిజన్ అందుతుందని పేర్కొన్నారు.
- అరటిపళ్లలో పీహెచ్ విలువ 4.5 నుంచి 4.7 మధ్య ఉంటుంది. ఆల్కలీన్ మోతాదు కూడా అధికంగా ఉంటుంది. అరటి పండ్లు (పచ్చి లేదా పండినవి) శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచేందుకు తోడ్పడతాయి.
- నిమ్మకాయలో ఉండే విటమిన్ సి శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడంతో పాటు శక్తిని ఇస్తుంది. వీటితో పాటు శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది.
- వెల్లుల్లిలో ఉండే అద్భుతమైన గుణాలు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు తోడ్పడతాయి. వీటిలో ఆల్కలీన్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. అలాగే పీహెచ్ స్థాయి కూడా 8 కంటే ఎక్కువగా ఉంటుంది. వెల్లుల్లిలో ఉండే గుణాలు బరువు తగ్గించేందుకు కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతిరోజూ ఉదయాన్నే ఓ వెల్లుల్లి రెబ్బ తీసుకుంటే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయి.
- ద్రాక్ష పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్‌ని తగ్గించి ఆక్సిజన్ స్థాయిని పెరిగేలా చేస్తాయి.
- బొప్పాయి వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో పీహెచ్ విలువ 8.5 కంటే ఎక్కువ ఉంటుంది. దీని వల్ల రక్త కణాలలో ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయి. షుగర్ ఉన్న వారు కూడా దీనిని తీసుకోవచ్చు.
- కీరా దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది ఏ మాత్రం ఆమ్ల గుణాన్ని కలిగి ఉండదు. శరీరానికి చలవ చేయడంతో తోడ్పడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది మంచి ఆహారం. కీరా కూడా శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ పెంచుతుంది.
- బ్రకోలీలో చాలా రకాల విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీనిని ఆహారంగా వల్ల శరీరంలో ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది. క్యాబేజీలోనూ ఇవే గుణాలు ఉంటాయి. క్యాబేజీలో అధిక మొత్తంలో ఆల్కలీన్ ఉండటంతో ఆక్సిజన్ స్థాయిలను పెంచేందుకు తోడ్పడుతుంది.