హైదరాబాద్‌లోని ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి పెద్ద ప్రమాదం తప్పింది. ఆయన లిఫ్టులో వెళ్తున్న క్రమంలో అది ప్రమాదానికి గురైంది. గురువారం ఉప్పల్‌లోని శ్రీకర్ హెల్త్ కేర్ ఆస్పత్రి వార్షికోత్సవానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి హాజరైన ఘటనలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే లిఫ్టు ఎక్కగానే కొద్ది సేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. అంతలోనే లిఫ్టు ఉన్నట్లుండి పెద్ద శబ్ధం చేస్తూ కిందికి గ్రౌండ్ ఫ్లోర్‌లో పడిపోయింది.
దీంతో వెంటనే అప్రమత్తమైన ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బంది, ఎమ్మెల్యే గన్‌మెన్‌లు హుటాహుటిన గ్రౌండ్ ఫ్లోర్‌కు పరిగెత్తి లిఫ్ట్ గ్రిల్స్‌ను బలవంతంగా తెరిచి వారిని బయటకు తీసుకొచ్చారు. అయితే, తక్కువ ఎత్తు నుంచి లిఫ్టు కింద పడడంతో అందరూ సురక్షితంగా ఉన్నారు. ఆస్పత్రిలో ఉన్నట్టుండి జరిగిన ఈ ఘటనతో రోగులు, వారి సహాయకులు ఆందోళనకు గురయ్యారు. ఆస్పత్రి యాజమాన్యం కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
ఇదే కార్యక్రమానికి బోడుప్పల్ కార్పొరేటర్ సామల బుచ్చిరెడ్డి, మాజీ కార్పొరేటర్ మందముల్ల పరమేశ్వర్ రెడ్డి కూడా హాజరయ్యారు. వారు కూడా ఎమ్మెల్యేతోపాటే లిఫ్టు ఎక్కారు. అయితే, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నిత్యం వందల మంది రోగులు ఆ ఆస్పత్రికి వస్తుంటారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో లిఫ్టు కుప్పకూలిపోవడంతో కలకలం రేగింది. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే వెంట వచ్చిన అనుచరులు పరిమితికి మించి లిఫ్టులోకి ఎక్కడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.