భారత్‌తో టెస్ట్‌ సిరీస్‌కు ముందు ఇంగ్లాండ్‌ జట్టుకు ఊహించని షాక్‌ తగిలింది. ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్ క్రికెట్‌ నుంచి నిరవధిక విరామం ప్రకటించాడు. అన్ని క్రికెట్‌ ఫార్మాట్లకు గుడ్‌ బై చెబుతున్నట్టు వెల్లడించాడు. వ్యక్తిగత కారణాలతో అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు నాలుగో తేదీ నుంచి భారత్, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ప్రారంభం కానున్న వేళ బెన్‌ స్టోక్స్‌ తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఇంగ్లాండ్‌ జట్టు సాధించిన అనేక విజయాల్లో ఈ ఈ ఎడమ చేతివాటం ఆటగాడు కీలక పాత్ర పోషించాడు.


కొన్నాళ్లు గుడ్ బై..


కొన్నాళ్ల పాటు ఏ ఫార్మాట్ లోనూ ఆడకూడదని స్టోక్స్ నిర్ణయం తీసుకున్నట్టు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) వెల్లడించింది.తన మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు, ఎడమచేతి చూపుడు వేలుకు తగిలిన గాయం నుంచి కోలుకోవడంపైనా దృష్టి సారించేందుకు ఈ విరామాన్ని ఉపయోగించుకోవాలని స్టోక్స్ భావిస్తున్నాడని ఈసీబీ పేర్కొంది. స్టోక్స్ నిర్ణయానికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు బోర్డు వెల్లడించింది. తన మనోభావాలను నిర్భయంగా వెల్లడించాడని, తాము అతడికి అండగా నిలుస్తామని ఈసీబీ మేనేజింగ్ డైరెక్టర్ ఆష్లే గైల్స్ తెలిపారు.


ఆగస్టు 4 నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టెస్టుల సిరీస్ జరగనుంది. సుదీర్ఘమైన ఈ సిరీస్ లో స్టోక్స్ వంటి ప్రపంచస్థాయి ఆల్ రౌండర్ సేవలు కోల్పోవడం ఇంగ్లాండ్ జట్టుకు పెద్ద లోటే. అయితే, స్టోక్స్ స్థానాన్ని సోమర్సెట్ ఆల్ రౌండర్ క్రెగ్ ఒవర్టన్ తో భర్తీ చేయనున్నారు. ఇక, ఈ సిరీస్ తో పాటు ఐపీఎల్ కి కూడా దూరం కానున్నాడు బెన్ స్టోక్స్.


ఈ ఏడాది తొలి విడత ఐపీఎల్ సీజన్ లో బెన్ స్టోక్స్ గాయపడ్డాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లకు దూరమయ్యాడు. అయితే, గాయం నుంచి కోలుకున్న బెన్ స్టోక్స్ హండ్రెడ్ లీగ్ ఆడుతున్నాడు. అయితే, ఇప్పుడు ఈ ఆల్ రౌండర్ నిర్ణయం క్రికెట్ ఫ్యాన్స్ ను అయోమయంలో పడేసింది. గతంలోనూ మ్యాక్స్ వెల్ లాంటి క్రికెటర్ కూడా మానసిక కారణాలతో కొన్ని నెలల పాటు క్రికెట్ కు దూరం ఉన్నాడు.


సూపర్ ఆల్ రౌండర్..


బెన్ స్టోక్స్ ఆడిన మేటి ఇన్నింగ్స్ లో 2019 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఓటమి అంచుల్లో కూరుకుపోయిన ఇంగ్లాండ్ ను అజేయంగా 84 పరుగులు చేసి విశ్వవిజేతగా నిలిపాడు. న్యూజిలాండ్- ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ ను క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు.