Sleeping Late Regularly : మనలో చాలా మంది అర్థరాత్రి వరకు మేల్కొని ఉంటారు. కొందరికి ఇది ఓ అలవాటుగా మారిపోయింది. ఉద్యోగ ఒత్తిడి, మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా, ఓటీటీలు, చదువు వంటి కారణాల వల్ల నిద్ర సమయం ఆలస్యమవుతోందని పలు పరిశోధనలు చెప్తున్నాయి. అయితే తరచూ రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోవడం వల్ల శారీరకంగానే కాకుండా.. మానసికంగా కూడా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Continues below advertisement

నిద్ర అనేది శరీరానికి విశ్రాంతిని ఇవ్వడమే కాకుండా, మెదడు పనితీరు, హార్మోన్ల సమతుల్యత, రోగనిరోధక శక్తి, గుండె ఆరోగ్యం వంటి అనేక ముఖ్యమైన వ్యవస్థల పనితీరుకు హెల్ప్ చేస్తుంది. అలాగే శరీరాన్ని రీసెట్ చేయడానికి నిద్ర అవసరం. ఒకవేళ సరిపడా నిద్ర లేకపోతే ఆరోగ్య సమస్యల ప్రమాదం పెరుగుతుంది. ఇదే కంటిన్యూ అయితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

అలసట, నీరసం 

రాత్రి నిద్ర తగినంత లేకపోతే మరుసటి రోజు శరీరం అలసటగా అనిపిస్తుంది. పనిపై ఏకాగ్రత తగ్గి ఉత్సాహం కూడా తగ్గుతుంది. రోజంతా నీరసంగా ఉంటారు.

Continues below advertisement

రోగనిరోధక శక్తి ఉండదు

నిద్ర సమయంలో శరీరం తనను తాను రిపేర్ చేసుకుంటుంది. ఒకవేళ నిద్ర తగ్గితే ఇమ్యూనిటీ బలహీనమవుతుంది. దీంతో తరచూ జలుబు, దగ్గు, ఇతర సీజనల్ వ్యాధులు త్వరగా వచ్చేస్తాయి. 

బరువు పెరగడం

రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఆకలిని నియంత్రించే హార్మోన్లపై ప్రభావం పడుతుంది. దీంతో అధికంగా తినడం, జంక్ ఫుడ్‌పై ఆసక్తి పెరగడం జరుగుతుంది. తెలియకుండానే బరువు పెరిగిపోతారు. 

గుండె ఆరోగ్యంపై ప్రభావం

నిద్రలేమి వల్ల రక్తపోటు పెరగడం, గుండె సంబంధిత సమస్యల ప్రమాదం అధికమయ్యే అవకాశం ఉందని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. ముఖ్యంగా హార్ట్ ఎటాక్ తీవ్రత రెట్టింపు ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మానసిక ఆరోగ్యంపై ఎఫెక్ట్

ఆందోళన, ఒత్తిడి, చిరాకు, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు నిద్రలేమితో మరింత తీవ్రమవుతాయి. దీంతో నిద్ర మరింత దూరమవుతుంది. ఏకాగ్రత ఉండదు. ఏ పని మీద ఫోకస్ చేయలేరు. ఎందుకంటే మెదడు సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి నిద్ర చాలా అవసరం. సరిపడా నిద్ర లేకపోతే గుర్తుంచుకునే సామర్థ్యం తగ్గిపోతుంది.

మధుమేహం ప్రమాదం 

నిద్రలేమి ఇన్సులిన్ పనితీరుపై ప్రభావం చూపి రక్తంలో చక్కెర స్థాయిలను అసమతుల్యం చేసే అవకాశం ఉంది. టైప్ 2 డయబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

చర్మ ఆరోగ్యం

నిద్ర సమయంలో చర్మం తనను తాను పునరుద్ధరించుకుంటుంది. నిద్రలేమి వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు, చర్మం నిస్సత్తువగా కనిపించడం వంటి సమస్యలు వస్తాయి. 

హార్మోన్ల అసమతుల్యత

రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోవడం వల్ల శరీరంలోని ముఖ్యమైన హార్మోన్ల ఉత్పత్తి ప్రభావం పడుతుంది. దీంతో వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.

మంచి నిద్ర కోసం ఏమి చేయాలంటే..

ఈ ఆరోగ్య సమస్యలు రాకూడదంటే.. కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలని నిపుణులు చెప్తున్నారు. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, లేవడం అలవాటు చేసుకోవాలని చెప్తున్నారు. అలాగే నిద్రకు గంట ముందు మొబైల్, ల్యాప్‌టాప్ వినియోగించకూడదు. సాయంత్రం తర్వాత అధిక కాఫీ, టీ తీసుకోవడం తగ్గించండి. పడకగదిని ప్రశాంతంగా, చీకటిగా ఉంచుకోవాలి. ప్రతిరోజూ వ్యాయామం చేస్తే నిద్ర మెరుగవుతుందని నిపుణులు చెప్తున్నారు. 

నిద్రకు సంబంధించిన మరిన్ని ఆర్టికల్స్ కోసం దీనిని క్లిక్ చేయండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.