EPFO 3.0 ATM Withdrawal: మీ పీఎప్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలంటే ఒకప్పుడు వారాల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. కంపెనీ చుట్టూ, పీఎఫ్ ఆఫీస్‌ల చుట్టూ తిరుగుతూ నానా తంటాలు పడేవాళ్లు. కానీ ఇకపై ఆ కష్టాలకు కాలం చెల్లింది. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న ఈపీఎఫ్‌వో 3.0 వెర్షన్‌తో మీ పీఎప్ అకౌంట్ ఒక ఏటీఎం కార్డులా మారిపోతోంది. అంటే మీ మొబైల్‌లో యూపీఐ ద్వారా గానీ లేదా దగ్గరలోని ఏటీఎం సెంటర్‌కు వెళ్లి చిటికెలో పీఎఫ్ డబ్బులను డ్రా చేసుకోవచ్చు. ఈ నెలాఖరు నాటికి అంటే జూన్ చివరి వారంలోనే ఈ సరికొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సమాచారం. సుమారు కోట్లాది మంది వేతనజీవులకు ఇది ఒక భారీ ఊరట అని చెప్పాలి. ముఖ్యంగా ఎమర్జెన్సీ సమయాల్లో హాస్పిటల్ ఖర్చులు లేదా ఇతర అత్యవసరాల కోసం పీఎఫ్ డబ్బులను పొందే ప్రక్రియను EPFO పూర్తిగా డిజిటలైజ్ చేస్తోంది.
ఏటీఎం నుంచి ఎంత డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు?
ఈపీఎఫ్‌వో 3.0 నిబంధనల ప్రకారం, చందాదారులు తమ పీఎఫ్ బ్యాలెన్స్‌లో గరిష్టంగా 75 శాతం వరకు తక్షణమే విత్‌డ్రా చేసుకునే వీలు కల్పిస్తున్నారు. అయితే కొన్ని నివేదికల ప్రకారం ఇది 50 శాతం నుంచి 75 శాతం మధ్య ఉండే అవకాశం ఉంది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ మొత్తం బ్యాలెన్స్‌లో కనీసం 25శాతం సొమ్మును రిటైర్‌మెంట్ కోసం తప్పనిసరిగా ఖాతాలోనే ఉంచాలి.
పెన్షన్‌పై ప్రభావం ఉంటుందా?
చాలా మంది ఉద్యోగులకు ఉన్న ప్రదాన సందేహం, పీఎప్ డబ్బులు ఇలా ఏటీఎం ద్వారా డ్రా చేస్తే భవిష్యత్‌లో వచ్చే పెన్షన్ తగ్గిపోతుందా అని. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇచ్చింది. ఈ ఏటీఎం విత్‌డ్రా సదుపాయం కేవలం మీ ఈపీఎస్ ఖాతాలో ఉండే పెన్షన్ డబ్బులు పూర్తిగా సురక్షితంగా ఉంటాయి. మీరు పదేళ్ల సర్వీస్ పూర్తి చేసిన తర్వాత నిబంధనల ప్రకారం పెన్షన్ పొందేందుకు అర్హులుగా ఉంటారు. మధ్యలో పీఎఫ్ డబ్బులు డ్రా చేసినా మీ సర్వీస్ రికార్డు మారదు.
ఈపీఎఫ్‌వో 3.0లోని ఫీచర్స్ ఇవే!
ఈ సరికొత్త సిస్టమ్ కేవలం విత్‌డ్రాయల్స్ కోసమే కాదు, మరిన్ని అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. ఐదు లక్షల వరకు ఉండే అడ్వాన్స్ క్లెయిమ్స్ ఇప్పుడు ఎటువంటి మాన్యువల్ ప్రమేయం లేకుండా ఆటోమేటిక్‌గా సెటిల్ అవుతాయి. పేరు, పుట్టిన తేదీ లేదా ఇతర ప్రొఫైల్ వివరాలను ఆఫీసులకు వెళ్లకుండానే ఆన్‌లైన్‌లో సరిచేసుకోవచ్చు. ఈ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి రూపొందించారు. దీని వల్ల UAN నంబర్, OTP వెరిఫికేషన్ ద్వారా అత్యంత వేగంగా లావాదేవీలు జరుగుతాయి. గతంలో పీఎఫ్ విత్‌డ్రా కోసం యజమాని అనుమతి తప్పనిసరిగా ఉండేది. కానీ ఇప్పుడు ఆధార్ ఆధారిత అథెంటికేషన్‌తో ఈ ప్రక్రియ చాలా సులభతరం కానుంది.
ఈ సేవలు ఎప్పటి నుంచి ప్రారంభం?
కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఇప్పటికే దీనిపై కీలక ప్రకటన చేశారు. సిస్టమ్ టెస్టింగ్ పూర్తి అయ్యిందని త్వరలోనే అధికారికంగా లాంచ్ చేస్తామని తెలిపారు. సర్వర్ వెర్షన్ 2.01 అందుబాటులోకి వచ్చిన వెంటనే జూన్ నెలాఖరులోపు ఈ సర్వీస్‌లు లైవ్‌లోకి వచ్చే అవకాశం ఉంది.
పీఎఫ్ ఏటీఎం సేవలు పొందాలంటే మీరు చేయాల్సిన పనులు
ఈ సదుపాయం ప్రారంభం కాకముందే మీ అకౌంట్‌ను సిద్ధం చేసుకోవడం మంచిది. దీని కోసం మీ UANతో ఆధార్ లింక్ అయ్యి ఉండాలి. పీఎప్ పోర్టల్‌లో మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు, IFSC కోడ్ సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఆధార్, పాన్, పీఎప్ రికార్డుల్లో మీ పేరు, పుట్టిన తేదీ ఒకేలా ఉండాలి. మీ బ్యాంకు అకౌంట్‌కు లిక్ అయ్యి ఉన్న UPI ఐడీని యాక్టివ్‌గా ఉంచుకోండి.
