వేడివేడి పప్నన్నంలో ఓ స్పూను నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరు. కానీ చాలామంది తినరు, బరువు పెరుగుతామేమోనని భయం. అధ్యయనాలు మాత్రం రోజులో కనీసం స్పూను నెయ్యి తినమని సూచిస్తున్నాయి. కనీసం అరస్పూను అన్నంలో కలుపుకుని మంచి ఆరోగ్య ప్రయోజనాలే కలుగుతాయంటున్నారు పరిశోధనకర్తలు. ఫిట్ నెస్ ఫ్రీక్స్ కూడా నెయ్యిని రోజూ తినవచ్చని చెబుతున్నారు. 


చాలామంది కొవ్వులేని పదార్థాలనే ఎంచుకుని తింటారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అన్ని కొవ్వులు చెడ్డవి కాదు. కొన్ని మంచిది కూడా ఉన్నాయి. మనశరీరానికి కొంత కొవ్వు కూడా అత్యవసరం. నెయ్యి నుంచి వచ్చే కొవ్వు... మంచి కొవ్వుల జాబితాలోకే వెళుతుంది. దీనివల్ల అతిగా బరువు పెరగరు. మితంగా రోజుకో స్పూను మించకుండా తింటే చాలా మంచిది. ఇది శరీరానికి చేటు చేసే ఎల్ డిఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. నెయ్యిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి కనుక వృద్ధాప్య లక్షణాలను నిరోధిస్తుంది. అంతేకాదు అల్జీమర్స్ వంటి మతిమరుపు లక్షణాలు కలగవు. బిర్లా ఆయుర్వేదా సంస్థకు చెందిన డాక్టర్  వృందా లోట్లికర్ చెప్పిన దాని ప్రకారం రోజూ నెయ్యి తినే వాళ్లలో మతిమరుపు ఛాయలు చాలా తగ్గాయి. అందుకే పిల్లలకు రోజుకో స్పూను నెయ్యిని అన్నంలో కలిపిస్తే మంచిదని చెబుతున్నారు ఆమె. 


రోగనిరోధక శక్తికి...
నెయ్యిలో బ్రూట్యిక్ ఆమ్లంతో పాటూ, ఎ, డి,ఇ, కె విటమిన్లు ఉంటాయి. వీటి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు పొట్ట, ప్రేగులు శుభ్రపరిచి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. న్యూఢిల్లీకి చెందిన పోషకాహార నిపుణుడు లవనీత్ బాత్రా మాట్లాడుతూ ‘కీళ్లలో ఉండే ద్రవపదార్థాన్ని సంరక్షించడంలో కూడా నెయ్యి సహకరిస్తుంది. జుట్టు, చర్మాన్ని కూడా ఆరోగ్యంగా అందంగా ఉంచుతుంది’ అని తెలియజేశారు. 


బరువు తగ్గిస్తుంది
చాలామంది ఈ విషయం నమ్మకపోవచ్చు కానీ నెయ్యి శరీరంలోని కొవ్వును కరిగించేందుకు సహకరిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వువల్లే బరువు పెరుగుతుంది. రోజుకో స్పూను నెయ్యి తినడం వల్ల అందులో ఉన్న బ్యూట్రిక్ ఆమ్లం, ట్రైగ్లిజరైడ్స్ కలిసి చెడు కొవ్వును కరిగించిపారేస్తాయి. చెడు కొవ్వును పేరుకుపోనివ్వదు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి... నెయ్యి అతిగా తింటే మాత్రం బరువు పెరుగుతారు. కనుక మితంగా రోజుకో స్పూనుకు మించి తినకపోవడం మంచిది. 


Also read: అక్కడ ఎవరినైనా విజిలేసి పిలుస్తారు... పేర్లు కూడా ఈల శబ్ధాలే...


Also read: ఊరికి రోడ్డేసే వరకు పెళ్లిచేసుకోను... యువతి శపథం... దిగొచ్చిన సీఎం


Also read: సరిగా వండని అన్నం తింటే క్యాన్సర్ ముప్పు... ఇలా వండితే సేఫ్