AP Fiber Net Case: ఏపీ ఫైబర్ నెట్ కేసులో తొలి అరెస్టు... సాంబశివరావును అరెస్టు చేసిన సీఐడీ... హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు

ఏపీ ఫైబర్ నెట్ కేసులో అరెస్టుల పర్వం మొదలైంది. ఐఆర్టీఎస్ అధికారి సాంబశివరావును సీఐడీ అధికారులు శనివారం అరెస్టు చేశారు.

Continues below advertisement

ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌ నెట్‌ తొలిదశ టెండర్ల ప్రక్రియలో అవకతవకలపై అరెస్ట్‌ల పర్వం మొదలైంది. ఈ కేసులో ఐఆర్టీఎస్ అధికారి సాంబశివరావును శనివారం సీఐడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ కు సంబంధించిన తొలి దశ టెండర్లను గత ప్రభుత్వ హయాంలో టెరా సాఫ్ట్‌వేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. ఈ ప్రక్రియలో అక్రమంగా టెండర్లు కట్టబెట్టారని వచ్చిన ఆరోపణలపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో విచారణలో భాగంగా ఐఆర్‌టీఎస్‌ అధికారి కోగంటి సాంబశివరావును సీఐడీ అరెస్టు చేసింది. ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న సాంబశివరావు అప్పట్లో ఏపీ మౌలిక వసతుల సంస్థ (ఇన్‌క్యాప్‌) ఎండీగా పనిచేశారు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఫైబర్‌ నెట్‌ టెండర్ల వ్యవహారంపై ఈ నెల 9న సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో 14వ తేదీన తొలిసారిగా సాంబశివరావు విచారణకు హాజరయ్యారు. 

Continues below advertisement

14 రోజుల రిమాండ్

విజయవాడ సత్యనారాయణపురంలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో శనివారం సాంబశివరావును విచారించారు. రెండు గంటల పాటు విచారణ చేసిన అధికారులు మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయన్ను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించి న్యాయస్థానం ముందు హాజరపరిచారు. ఆయనకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండు విధించారు. ముందుగా మచిలీపట్నం కారాగారానికి, అక్కడి నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు పంపడానికి చర్యలు చేపట్టారు. టెరా సాఫ్ట్‌వేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు టెండర్ల కేటాయింపులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని సీఐడీ కోర్టుకు తెలిపింది. ప్రభుత్వాధికారిగా ఉంటూ నిందితులతో కలిసి ప్రభుత్వ ఖజానాకు రూ.119.98 కోట్ల మేర నష్టం కలిగించారని తెలిపింది. రిమాండు రిపోర్టులో సీఐడీ ఆర్థిక నేరాల విభాగం డీఎస్పీ ఎన్‌.నరేంద్ర ఈ విషయాలు తెలిపారు. 

ప్రభుత్వ ఖజానాకు నష్టం 

ఈ కేసులో సాంబశివరావు పాత్రపై ప్రాథమిక ఆధారాలున్నాయని సీఐడీ తెలిపింది. తన చర్యలు ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగిస్తాయని తెలిసే ఆయన అధికారిక దుర్వినియోగానికి పాల్పడ్డారని పేర్కొంది. ఏ3గా ఉన్న టెరా సాఫ్ట్‌వేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు లబ్ధి కలిగించేలా ఆయన చర్యలు ఉన్నాయని తెలిపారు. టెరా సాఫ్ట్‌వేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కోసం తప్పుడు పత్రాల్ని ఆమోదించారన్నారు. నిబంధనలకు విరుద్ధంగాటెరా సాఫ్ట్‌వేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను బ్లాక్‌లిస్ట్‌ నుంచి తొలగించారని రిమాండ్ రిపోర్టులో తెలిపారు. టెండర్ల ప్రక్రియతో సంబంధం ఉన్న సీనియర్‌ అధికారులు, ఇతర వ్యక్తులు టెండర్ల ప్రక్రియపై అభ్యంతరాలు తెలిపినా వాటిని పరిగణనలోకి తీసుకోలేదని సీఐడీ అధికారులు తెలిపారు. 

బెయిల్ కోసం పిటిషన్ 

ఫైబర్‌నెట్‌ కేసులో శనివారం అరెస్టైన ఐఆర్టీఎస్ అధికారి కోగంటి సాంబశివరావు మధ్యంతర బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్‌తో పాటు సీఐడీ నమోదు చేసిన కేసు కొట్టి వేయాలని ఆయన కోర్టును కోరారు. దీనిపై స్పందించిన కోర్టు ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపడతామని వివరించింది. 

Also Read: Whistiling village Kongthong: అక్కడ ఎవరినైనా విజిలేసి పిలుస్తారు... పేర్లు కూడా ఈల శబ్ధాలే...

Continues below advertisement
Sponsored Links by Taboola