వెజ్, నాన్ వెజ్, బిర్యానిలో వెల్లుల్లి లేకుండా రుచి రాదు. అందుకే ప్రతి ఇంట్లోనే వెల్లుల్లి వాడకం ఎక్కువగానే ఉంటుంది. ఇది కూరలకి రుచి ఇవ్వడమే కాదు, అనేక రుగ్మతలని తగ్గించడంలో గొప్ప ఔషధంగా ఉపయోగపడుతుంది. వెల్లుల్లిలో ఔషధ గుణాలు ఉన్నట్టు శాస్త్రీయంగా కూడా రుజువైంది. మధుమేహ రోగులు వెల్లుల్లి రెబ్బలను ఉడికించిన అన్నంలో పెట్టి కొద్దిసేపటి తర్వాత వాటిని తింటే చాలా మంచిది. పచ్చిగానే కాదు ఉడికించినవి తిన్నా ఆరోగ్యానికి మంచిదే. జలుబు, దగ్గుని వెల్లులి నివారిస్తుంది. గొంతు కండరాల నొప్పిని కూడా ఇది తగ్గిస్తుంది. బరువు తగ్గించడంలో వెల్లుల్లి కీలక పాత్ర పోషిస్తుంది. క్రమం తప్పకుండా వెల్లుల్లి తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి బయట పడొచ్చు.


☀ వెల్లుల్లి తినడం వల్ల జలుబు తగ్గుతుంది. ఇది రోగనిరోధక వ్యవస్థ పనితీరుని మెరుగుపరచడమే కాకుండా దాని శక్తిని పెంచుతుంది. వివిధ అధ్యయనాల ప్రకారం.. వెల్లుల్లి తినడం వల్ల దాదాపు 60 శాతం వరకు జలుబు తగ్గుముఖం పడుతుంది.


☀ వెల్లుల్లి యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తుంది. కండరాల వాపు, గొంతు నొప్పిని తగ్గిస్తుంది. ఆర్థరైటిస్ తో బాధపడే వాళ్ళు మృదులాస్థి దెబ్బతినకుండా నిరోధించడానికి చాలా మంది డాక్టర్స్ వెల్లుల్లి నూనెని సూచిస్తారు.


☀ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులోని సల్ఫర్ ఎర్ర రక్త కణాల ద్వారా హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువుగా మారుతుంది. ఇది రక్త నాళాలను శుభ్రపరిచి గుండెకి రక్త ప్రసరణ బాగా జరిగేలా చూస్తుంది.


☀ వెల్లుల్లిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మొటిమలు చర్మం పగుళ్ళని నియంత్రించడంలో సహాయపడుతుంది.


☀ LDL కొలెస్ట్రాల్ స్థాయిలను 10-15 శాతం వరకు తగ్గిస్తుంది. దీని వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి.


☀ అల్జీమర్స్, డీమెన్షియా వంటి క్షీణించిన వ్యాధులని నివారించడంలో వెల్లుల్లి బాగా సహాయపడుతుంది.


☀ బరువు తగ్గాలనుకునే వారికి కూడా వెల్లుల్లి నీరు మేలు చేస్తుంది.  దీన్ని రోజూ తాగడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. ఫలితంగా బరువు తగ్గడం ఖాయం. 


☀ వెల్లుల్లి నీరు కీళ్ల నొప్పులు ఉన్నవారికి చాలా మేలు చేస్తుంది. రోజూ తాగడం వల్ల ఆ నొప్పులు అదుపులో ఉంటాయి.


☀ వెల్లుల్లిలోని గుణాలు శరీరంలో రక్తసరఫరా సక్రమంగా జరిగేలా చూస్తుంది. దీనివల్ల హైబీపీ రాకుండా ఉంటుంది.  


ఏదైనా మితంగా తింటే ఆరోగ్యానికి మంచిది. మేలు చేస్తుంది కదా అని అతిగా తిన్నా ప్రమాదమే. వెల్లుల్లిని మోతాదుకు మించి తీసుకోవడం వల్ల తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో సమస్యలు, అలర్జీ, దద్దుర్లు, అలసట, ఆకలి తగ్గడం, మైకం వంటి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే వైద్యుడిని సంప్రదించి తగిన మోతాదులో మాత్రమే వెల్లుల్లి తినాలి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: రాగి పిండితో భలే భలే వంటకాలు - రుచి అమోఘం, తింటే ఆరోగ్యం


Also read: ఏడాదికి రూ.61 లక్షల జీతాన్నిచ్చే ఉద్యోగం, అయిదేళ్ల వయసు దాటిన ఎవరైనా అప్లయ్ చేయచ్చు