జీడిపప్పు తింటే కొవ్వు చేరి బరువు పెరుగుతారనే అపోహ ఉంది. కానీ ఇది నిజం కాదని మితంగా తీసుకుంటే బరువు తగ్గేందుకు దోహదపడుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. తియ్యగా ఉండే జీడిపప్పు అందరూ ఇష్టపడే గింజల్లో ఒకటి. పోషక విలువలకు ప్రసిద్ధి చెందింది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, డైటరీ ఫైబర్, విటమిన్లు బి, ఇ, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్ వంటి ఖనిజాలు ఉన్నాయి. కేలరీలు పుష్కలంగా అందిస్తుంది. కొద్ది మొత్తంలో తీసుకుంటే బరువు తగ్గేందుకు అవసరమైన కేలరీలు ఇస్తుంది.


ఆరోగ్యకరమైన కొవ్వులు


జీడిపప్పులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. వాటి కొవ్వు పదార్థాలలో ఎక్కువ భాగం అసంతృప్త కొవ్వు ఉంటుంది. ఇది గుండెకి ఆరోగ్యకరమైనది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గిస్తుంది. వీటిని తింటే పొట్ట నిండిన అనుభూతి కలుగుతుంది. ఆకలిని తగ్గిస్తుంది. రోజూ ఆహారంలో జీడిపప్పు చేర్చుకోవడం వల్ల పోషకాలు గ్రహించి జీర్ణం చేయడంలో సహాయపడుతుంది.


గుండె ఆరోగ్యం


ఇతర గింజలతో పాటు జీడిపప్పు తీసుకోవడం వల్ల హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం తక్కువగా ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలని పెంచుకోవాలని అనుకుంటే కొద్ది మొత్తంలో జీడిపప్పు తీసుకోవచ్చు. ఎక్కువగా తీసుకుంటే బరువు పెరుగుతారు.


యాంటీ ఆక్సిడెంట్లు


మెగ్నీషియం వంటి ఖనిజాలు జీవరసాయన చర్యలకు సహాయపడతాయి. శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని గ్లూకోజ్ జీవక్రియని మెరుగుపరుస్తుంది. తగినంత మెగ్నీషియం తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి, ఇన్సులిన్ సెన్సిటివిటీకి తోడ్పడుతుంది.


డైటరీ ఫైబర్


ఇందులో డైటరీ ఫైబర్ ఉంటుంది. జీర్ణక్రియ సజావుగా సాగేలా చేస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తక్కువ గ్లైసెమిక్ సూచికని కలిగి ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండేలా చేస్తాయి. అతిగా తింటే మాత్రం షుగర్ లెవల్స్ లో హెచ్చుతగ్గులు నమోదు అవుతాయి.


ఆకలి తగ్గిస్తుంది


జీడిపప్పులోని ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, పీచు పదార్థాల కలయిక వల్ల పొట్టకి సంతృప్తి భావన కలిగిస్తాయి. అతిగా తినడాన్ని నివారిస్తుంది. కొద్ది మొత్తంలో ఆహారం తీసుకోవాలి. వేయించిన వాటి కంటే నానబెట్టి తీసుకుంటే మంచిది. అనారోగ్యకరమైన స్నాక్స్ కంటే వీటిని తింటే ఆరోగ్యం, బరువు తగ్గాలనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు.


ఎన్నో పోషకాలు నిండి ఉన్నజీడిపప్పు గుండెకి చాలా మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఇవి తినడం వల్ల శరీరంలోని అవయవాల పనితీరుకే కాదు చర్మం, వెంట్రుకలకి కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మృదువైన, ప్రకాశవంతమైన చర్మాన్ని ఇస్తుంది. అంతే కాదు మగవారిలో సంతనోత్పత్తికి అవసరమైన వీర్య కణాలు వృద్ధి చెయ్యడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వాటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు, మధుమేహం కూడా అదుపులో ఉంటాయి. 


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: ఈ మూడు చాలు మీ గుండెని ప్రమాదంలో పడేయడానికి!