బరువు పెరుగుతామనే భయంతో చాలా మంది అన్నం తగ్గించి చపాతీలు తినటం అలవాటు చేసుకుంటున్నారు. మరికొంతమంది తెల్లన్నం పూర్తిగా మానేసి, బ్రౌన్ రైస్ మీదే ఆధారపడుతున్నారు. నిజంగానే బ్రౌన్ రైస్ తో బరువు తగ్గుతామా? బరువు తగ్గేందుకు బ్రౌన్ రైస్ ఎలా సహకరిస్తుంది? అసలు బ్రౌన్ రైస్ ప్రత్యేకతలేంటి?
బ్రౌన్ రైస్ అనగానే ప్రత్యేకంగా వాటిని పండిస్తారని అనుకుంటారు చాలా మంది. కానీ కాదు. సాధారణ బియ్యాన్నే ప్రాసెస్ చేయకుండా అమ్మేవే బ్రౌన్ రైస్. ఇప్పుడు మనం తింటున్న వైట్ రైస్ బాగా రిఫైన్ చేసి, ప్రాసెస్ చేసిన బియ్యం. దీని వల్ల అవి సహజసిద్ధమైన ఆరోగ్యానికి మేలు చేసే గుణాలను కోల్పోతాయి. ఇక అన్ ప్రాసెస్ట్ బియ్యం బ్రౌన్ రైస్. అందుకే తెల్లఅన్నంతో పోలిస్తే బ్రౌన్ రైస్ లో పోషకాలు ఎక్కువ. తాజాగా జరిగిన ఓ పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే రోజూ కప్పు బ్రౌన్ రైస్ తినేవారిలో మధుమేహం వచ్చే ప్రమాదం అరవై శాతం వరకు తగ్గుతుంది. దీంట్లో కేలరీలు కూడా చాలా తక్కువ. కనుక బరువు పెరిగే అవకాశం తక్కువ.
బ్రౌన్ రైస్ లో గామా అమైనోబ్యుటిరిక్ యాసిడ్ అని పిలిచే అమైనో యాసిడ్ ఉంటుంది. శరీరంలో చేరిన ఈ యాసిడ్లు మంచి కొలెస్ట్రాల్ ను పెంచి, చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. దీని వల్ల బరువు పెరిగే ఛాన్సు కూడా తగ్గుతుంది. ఇందులో పీచు పదార్థం (ఫైబర్) అధికంగా ఉంటుంది. కాబట్టి త్వరగా అరగదు. అందువల్ల బ్రౌన్ రైస్ ను తింటే ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. దీనివల్ల ఆహారం తక్కువగా తింటారు. తద్వారా శరీరం బరువు పెరగదు.
గుండె ఆరోగ్యానికి కూడా బ్రౌన్ రైస్ సహకరిస్తుంది. ఇందులో విటమిన్ బి1, మెగ్నిషియం పుష్కలంగా ఉంటాయి. గుండె పోటు రాకుండా అడ్డుకుంటుంది. అనేకరకాల క్యాన్సర్లను అడ్డుకోవడంలో కూడా ఈ రైస్ సహకరిస్తుంది. రొమ్ము క్యాన్సర్, పెద్దపేగు, బ్లడ్ క్యాన్సర్ లాంటివి అడ్డుకుంటుంది. కాబట్టి బ్రౌన్ రైస్ ను కేవలం బరువు తగ్గడం కోసం మాత్రమే కాదు, ఆరోగ్య రక్షణకు కూడా తినొచ్చు.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: రోజూ ఇలా పసుపు నీళ్లు తాగితే... ఊహించని ప్రయోజనాలు
Also read: రుచి, వాసనా గుర్తించలేకపోతున్నారా? తేలికగా తీసుకోకండి, కారణాలు ఇవి కావచ్చు
Also read: ఒకే కాన్పులో తొమ్మిది మంది పిల్లలు... రోజుకు వంద డైపర్లు, ఆరు లీటర్ల పాలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి