పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే... ఇంట్లో వివాహ పత్రికలు వచ్చి పడుతూనే ఉంటాయి. అందులో కొన్ని చాలా ఆర్భాటంగా ఉంటాయి. ఒక్కో పెళ్లి పత్రిక ధర 20 రూపాయల నుంచి వేల రూపాయల దాకా ఉన్నవి ఉన్నాయి. ఎవరి స్థోమతకు తగ్గట్టు వారు వివాహ పత్రికలు అచ్చేసుకుంటారు. పూర్వ కాలంలో ఇంతా హంగూ ఆర్భాటం పెళ్లి పత్రికలకు లేదు. చాలా సింపుల్ గా ఉండేవి, చాలా తక్కువ ఖర్చుతో అయిపోయేవి. అందమైన చేతి రాతతో రాసినవి కూడా ఉండేవి. అందమైన చేతి రాత కలిగి ఉండడం కూడా అప్పట్లో సంపాదనను తెచ్చిపెట్టేది. కాగా 1933 నాటి ఒక పెళ్లి పత్రిక ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. సోనాల్ బాట్లా అనే మహిళ తన ట్విట్టర్ ఖాతాలో ఈ పెళ్లి పత్రికను పోస్టు చేసింది. అది తన తాతయ్య వివాహ ఆహ్వాన పత్రిక అని రాసుకొచ్చింది. ఆ పత్రిక ఉర్దూలో అందమైన చేతిరాతతో ఉంది. 89 ఏళ్ల క్రితం అయి పెళ్లి తాలూకు సాక్ష్యం ఆ వెడ్డింగ్ కార్డు. 


ఉర్దూ కాలిగ్రఫీతో పాత కాగితంలా ఉంది ఆ పెళ్లి పత్రిక. ఆ పత్రిక ప్రకారం తండ్రి తన కొడుకు పెళ్లికి ఆహ్వానిస్తున్నట్టుగా రాసింది ఉంది. అందులో “నేను ముహమ్మద్ ప్రవక్తను నమ్ముతున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గౌరవనీయులైన సర్, మీకు శాంతి కలుగుగాక, ఈ ఆశీర్వాద సమయం కోసం నేను సర్వశక్తిమంతుడైన అల్లాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా కొడుకు హఫీజ్ ముహమ్మద్ యూసఫ్ వివాహం 23 ఏప్రిల్ 1933/27 ఆదివారం నాడు జరుగుతుంది. స్ట్రీట్ ఖాసిం జాన్‌లో ఉన్న మా ఇంటికి రండి, ఆపై కిషన్ గంజ్ ప్రాంతంలో ఉన్న వధువు ఇంటికి మాతో పాటు నిఖా లో భాగమై భోజనం చేయమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. 24 ఏప్రిల్ 1933 నాడు ఉదయం 10 గంటలకు మా ఇంటికి వచ్చి, వలీమాలో భాగమవ్వాలని కోరుకుంటున్నాను” అని కార్డులో రాసి ఉంది. 














ఈ కార్డు ట్విట్టర్లో పోస్టు చేయగానే ఏడు వేల మంది లైక్స్ కొట్టారు. 520.2k కంటే ఎక్కువ మంది వీక్షించారు. ఇక కామెంట్లు వెల్లువలా వచ్చాయి. ఇలా చరిత్రను భద్రపరచడం ఆశ్చర్యంగా ఉంది అని ఒకరు కామెంట్ చేస్తే, మరొకరు కార్డును చూసి చాలా ఆనందించినట్టు రాసుకొచ్చారు. ఇంకా ఎంతో మంది కార్డును తాము కూడా భద్రపరుస్తున్నామని అన్నారు. మరొక వ్యక్తి కూడా తమ తాతల నాటి పెళ్లి కార్డును పోస్టు చేశారు. ఏదేమైనా ఈ పెళ్లి కార్డు చరిత్రకు సాక్ష్యమనే చెప్పుకోవాలి. 


Also read: చలి కాలంలో మిమ్మల్ని వెచ్చగా ఉంచే ఆహారాలు ఇవే, చలికాలపు వ్యాధులు కూడా రావు