Andhra Politics 2023 :  ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గానే ఉంటాయి. అయితే 2023లో మాత్రం ఎవరూ ఊహించని మలుపులు తిరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ రెండు ప్రధాన పార్టీలు అధికారం కోసం విజయమా.. వీర స్వర్గమా అన్నట్లుగా తలపడబోతున్నాయి. అదే సమయంలో మూడో శక్తిగా ఉన్న జనసేన పార్టీని విస్మరించలేం.  అయితే 2023 ఏడాది ఏపీ రాజకీయాల్లో ఎన్నికల ఏడాది కాదు. కానీ ఎన్నికలు రావని చెప్పలేం. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహం ఎలా ఉందో చెప్పలేం కానీ.. ఎన్నికల మూడ్ మాత్రం ఏడాది మొత్తం కొనసాగడం ఖాయమని అనుకోవచ్చు. ఎందుకంటే వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే ఎన్నికలు జరుగుతాయి కాబట్టి.. కసరత్తు అంతా ఈ ఏడాదే రాజకీయ పార్టీలు పూర్తి చేస్తాయి. 


ప్రచారం జరుగుతున్నట్లుగా ఏపీ ప్రభుత్వం ముందస్తుకు వెళ్తుందా ?


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తుకు వెళ్తుందా .. లేదా అన్న చర్చ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అవుతోంది. ఢిల్లీ పర్యటనలో సీఎం ముందస్తు ఎన్నికలకు వెళ్తామని సహకరించాలని ప్రధాని మోదీని, హోంమంత్రి అమిత్ షాను అడిగినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై వారి స్పందనేమిటో స్పష్టత లేదు కానీ.. వైఎస్ఆర్‌సీపీ మదిలో ముందస్తు ఎన్నికల ఆలోచన ఉందన్న ఓ అభిప్రాయం మాత్రం రాజకీయవర్గాల్లో బలపడిపోయింది. ఒక వేళ ఆ ప్లాన్ ఉంటే...ఎప్పుడు వెళ్తారన్నది కూడా చర్చనీయాంశమే.  బడ్జెట్ పెట్టిన తర్వాత అసెంబ్లీని రద్దు చేస్తే ఆరు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. జూన్ లో జరగొచ్చు. లేదంటే..  నవంబర్‌లో జరిగే తెలంగాణ ఎన్నికలతో పాటు వెళ్లవచ్చు. పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగాలని సీఎం జగన్ కోరుకోరన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే.. తెలంగాణతో పాటు అసెంబ్లీ ఎన్నికలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. 


ఏపీలో ఈ ఏడాది మరింత ఎక్కువగా హింసాత్మక  రాజకీయాలు ఖాయమే !


ఏపీలో రాజకీయాలు మారిపోయాయి. ప్రజాస్వామ్యానికీ అర్థం మారిపోయింది. తమకు పట్టున్న ప్రాంతంలో ఇతర పార్టీలు ప్రచారం చేస్తున్నాయంటే సహించలేని పరిస్థితి వచ్చేంది. చాలా చోట్ల ప్రతిపక్షాలపై దాడులు జరుగుతున్నాయి. పోలీసులు దాడులన్నీ జరిగిన తర్వాత తీరిగ్గా.. ప్రతిపక్ష పార్టీలనే నిందిస్తున్నారు. అది సున్నితమైన ప్రాంతం కదా అక్కడకు వెళ్లాల్సిన అవసరం ఏమిటని  సాక్షాత్తూ డీజీపీనే అంటున్నారు. ప్రజాస్వామ్యంలో పోలీసులపై ప్రతిపక్ష పార్టీలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది. కానీ ఏపీ పోలీసుల మాటల్లో అలాంటిది కనిపించకపోవడం వల్ల ఉద్రిక్తలు మరింత పెరిగే సూచనలే కనిపిస్తున్నాయి. అలాగే దాడులు చేస్తే తాము తగ్గుతామా అని విపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటామని ముందుకెళ్తున్నాయి. ఈ క్రమ్ంలో ఎదురుదాడులు చేస్తున్నారు. ఫలితం ఘర్షణలు పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది ఇలాంటివి మరింత ఎక్కువ చోటు చేసుకునే చాన్స్ ఉంది. 


అధికార పార్టీలో అలజడి రేగుతుందా ?


కారణం ఏమైననప్పటికీ అధికార పార్టీలో ఓ రకమైన అలజడి కనిపిస్తోంది. పార్టీ అధినేత సీఎం జగన్.. తమ పార్టీ నేతలకు టాస్కుల మీద టాస్కులు ఇస్తున్నారు. పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యేల్లో తాము...వాలంటీర్ల కన్నా అన్యాయమైపోయామన్న ఆవేదన ఉంది. ఐదేళ్ల కాలంలో ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నామన్న ఆవేదన వారు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. వైసీపీ హైకమాండ్ కూడా... ఎమ్మెల్యేల కన్నా ఎక్కువగా  సచివాలయ కన్వీనర్లు... గృహసారధులపైనే నమ్కకం పెట్టుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఈ పరిణామాలు అధికార పార్టీలో ఎలాంటి మార్పులు తెస్తాయన్నది ఈ ఏడాది కీలకం కానుంది. 



ఏపీలో ఈ ఏడాది ఖచ్చితంగా ఎన్నికలు వస్తాయని చెప్పలేం. కానీ రావని కూడా చెప్పలేం. అధికార పార్టీ వ్యూహం ప్రకారం... ఈ ఏడాది ఏపీలో రాజకీయాలు మారిపోతాయి. ఎలా మారినా.. రాజకీయం మాత్రం ఏపీలో చాలా ఉద్రిక్తంగా ఉండటం ఖాయం అనుకోవచ్చు.