ఏపీలో పాలిటిక్స్ జోరు మీదున్నాయి. 2023లో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల నామ సంవత్సరంగా భావించి ప్రజల్లోకి వెళుతున్నాయి. అయితే టార్గెట్ 175 అంటూ దూకుడు మీద ఉన్న అధికార పార్టీ వైసీపీ ఏం చేయాలి. ఇదే ఇప్పుడు ఆ పార్టి నేతలల్లో చర్చ మొదలైంది.


2023లో ఏపీ పాలిటిక్స్... 
2023 ఆరంభం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పాదయాత్రకు శ్రీకారం చుట్టింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు రెడీ అవుతున్నారు. 400 రోజుల పాటు, 4వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాలని, అవసరం అయిన రూట్ మ్యాప్ ను కూడా టీడీపీ శ్రేణులు రెడీ చేశారు. యువ గళం పేరుతో నారా లోకేష్ పాదయాత్ర నిర్వహించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషయాలను టీడీపీ జాతీయ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు. లోకేష్ పాదయాత్రకు సంబంధించిన ప్రచార సామాగ్రిని కూడ ఆవిష్కరించారు. దీంతో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టి 2023 జనవరి నుంచి పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్ళేందుకు ప్లాన్ ఫిక్స్ అయ్యింది...


2023లో జనసేన....
జనసేన పార్టw అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఎన్నికల కోసం యాత్రకు సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు పవన్ ప్రత్యేక రూట్ మ్యాప్ ను రెడీ చేసుకున్నారు. ఇందుకోసం పవన్ వారాహి వాహనాన్ని రెడీ చేసుకున్నారు. జనవరి రెండో తేదీన కొండగట్టు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రచార వాహనం వారాహికి పూజలు నిర్వహించనున్నారు. సంక్రాంతి పండుగ తరువాత పవన్ వారాహి వాహనంపై రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. ఈ విషయాలను పార్టీ నాయకులు ఇప్పటికే ప్రకటించారు. పవన్ బస్సు యాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనకు శ్రీకారం చుడితే, ప్రధానంగా ఉన్న రెండు ప్రతిపక్ష పార్టిలు సైతం నిత్యం ప్రజల్లో ఉండే విధంగా రాజకీయాలు మారుతున్నాయి. అయితే పవన్ రాష్ట్ర వ్యాప్త పర్యటనపై ఇంకా క్లారిటీ రాలేదు. పవన్ పర్యటనపై  జనసేన నేతలు వివరాలు సిద్ధం చేశారు. సంక్రాంతి పండుగ సమయంలో జనసేన నేతలు పవన్ రాష్ట్ర వ్యాప్త పర్యటనపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.


2023లో వైసీపీ వ్యూహం ఏంటి... 
2023 నూతన సంవత్సరంలో అధికార పార్టీగా ఉన్న వైసీపీ వ్యూహం ఏంటి అన్నదానిపై పార్టీ నేతల్లో చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే పార్టి నేతలకు 175సీట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ కైవసం చేసుకోవాలని పక్కాగా టార్గెట్ పెట్టారు. ఇందులో భాగంగానే జగన్ ప్రతి నియోజకవర్గానికి చెందిన శాసన సభ్యుడు, ఇంచార్జ్ తో పాటుగా క్రియాశీలకంగా ఉన్న 50మంది కార్యకర్తలను ఎంపిక చేసి వారితో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం తరఫున ఉన్న వాలంటీర్ల తరహాలోనే పార్టి తరఫున ఇద్దరు చొప్పున ప్రత్యేకంగా ఎంపిక చేసి వారితో పని చేయించేందుకు ఎమ్మెల్యేలకు బాధ్యతలను అప్పగించారు. అయితే ప్రధాన పార్టీలు రెండు వచ్చే ఎన్నికల నాటి వరకు ప్రజల్లోనే తిరిగుతూ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్న క్రమంలో అధికార పార్టికి చెందిన వ్యూహం ఎలా ఉండాలన్న దానిపై పార్టీ సీనియర్ నేతలతో జగన్ సమాలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తోెంది. ఇప్పటికే పార్టీకి చెందిన అత్యంత కీలక నేతలు జగన్ కు అతి దగ్గరగా ఉండే నేతలను పార్టీ కార్యకలాపాలపై ఫోకస్ పెట్టాలని ఆదేశించినట్లుగా చెబుతున్నారు. అందులో భాగంగా టీటీడీ ఛైర్మన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డిని సైతం ఆ బాధ్యతల నుంచి తప్పించి పూర్తిగా ఉత్తరాంధ్ర వ్యవహరాల పైనే ఫోకస్ పెట్టేలా చొరవ చూపాలని జగన్ సూచించారని పార్టి వర్గాల్లో చర్చ జరుగుతుంది.


జగనే కావాలి... రావాలి... 
స్వయంగా జగన్ రంగంలోకి దిగితేనే పార్టి కార్యకర్తలు, నాయకుల్లో సైతం జోష్ వస్తుందని, అలాంటి ప్లాన్ ఎదైనా చేయాల్సిందేనని పార్టి నేతలు ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. సీఎం హోదాలో జగన్ ను జిల్లాల వారీగా తిప్పటంలో అత్యంత అవసరం అని పార్టీ నేతలు భావిస్తున్నారట. ఇప్పటికే జిల్లాల పునర్విభజన జరిగింది కనుక మరింతగా ప్రజల్లోకి వెళ్లేందుకు అవకాశం ఉంటుందని పార్టీ నేతలు ఆలోచనలు చేస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది అధికార పార్టీ వైసీపీ ప్లాన్ ఎలా ఉంటుందన్న దాని పై ఆసక్తి నెలకొంది.