Happy Holi 2024 : పండుగల సమయంలో స్వీట్లు కచ్చితంగా చేస్తూంటాము. ముఖ్యంగా హోలీ సమయంలో వివిధ రకాల స్వీట్లు తయారు చేస్తూ ఉంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినగలిగే రెండు స్వీట్లను ఈజీగా మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇంతకీ ఆ రెండు స్వీట్లు ఏంటో.. వాటిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మొదటిది డ్రై ఫ్రూట్ మలై రెసిపీ..
మధురానుభూతిని అందించే డ్రై ఫ్రూట్ మలై రెసిపీని చాలా సులభంగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. కేవలం హోలీ సమయంలోనే కాకుండా మీ స్పెషల్ రోజులలో కూడా దీనిని తయారు చేసుకోవచ్చు. ఈ టేస్టీ స్వీట్‌ని ఎలా తయారుచేస్తారో చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు
మలై - 2 కప్పులు
పంచదార - అర కప్పు
పాలు - 2 టేబుల్ స్పూన్లు
యాపిల్ - 1
అరటిపండు -1
దాల్చిన చెక్క పొడి - 1 టీస్పూన్
బాదం తురుము - 1 టీస్పూన్
జీడిపప్పు తురుము - 1 టీస్పూన్
పిస్తా తురుము - 1 టీస్పూన్
తయారీ విధానం
ముందుగా పంచదారను మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. యాపిల్, అరటిపండును సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో మలై వేయండి. దానిని కొంతసేపు బాగా బీట్ చేయండి. ఇప్పుడు దానిలో పొడి చేసుకున్న పంచదార వేసి.. ఈ పొడి మలైలో బాగా కలిసేలా కలపండి. అనంతరం దానిలో పాలు వేసి బాగా మిక్స్ చేయాలి. యాపిల్, అరటిపండు, యాలకుల పొడి, బాదం, జీడిపప్పు, పిస్తా తురుములు వేసి బాగా మిక్స్ చేయండి. అంతే టేస్టీ, హెల్తీ డ్రై ఫ్రూట్ మలై రెసిపీ రెడీ. దీనిని మీరు నేరుగా తినొచ్చు. లేదంటే హోలీ ఆడిన తర్వాత రిలాక్స్ అయ్యేందుకు కూడా తినొచ్చు. ఫ్రిజ్‌లో పెట్టుకుంటే చల్లగా మారి దీని రుచి మరింత హైలైట్ అవుతుంది.
కేసరి పిస్తా ఫిర్ని
హోలీ స్పెషల్ డబుల్ ధమాకాలో మరో స్వీట్ కేసరి పిస్తా ఫిర్ని. ఇండియాలో బాగా ఫేమస్ అయిన రెసిపీలలో కేసరి పిస్తా ఫిర్ని కూడా ఒకటి. పైగా ఇది సమ్మర్‌కు మంచి డిజెర్ట్ అవుతుంది. మరి ఈ స్వీట్‌ని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏంటి?
కావాల్సిన పదార్థాలు
కుంకుమ పువ్వు - కొంచెం
పిస్తాలు - 12
స్కిమ్డ్ మిల్క్ - 1 లీటరు
బియ్యం పొడి - 3 టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి - చిటికెడు
స్వీటనర్ - 3 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం
ముందుగా స్టౌవ్ వెలిగించి దానిపై నాన్‌స్టిక్ పాన్ పెట్టి స్కిమ్డ్ మిల్క్‌ను వేయాలి. మంటను చిన్నగా దానిని కలుపుతూ ఉండాలి. పాలు సగం అయ్యేవరకు దానిని కలుపుతూనే ఉండాలి. పాలు సగమైన తర్వాత మరో గిన్నె తీసుకుని దానిలో బియ్యం పిండి వేయాలి. దానిని ఓ లీటర్ నీటిలో వేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు దీనిని మరుగుతున్న పాలల్లో వేయాలి. ఇలా చేయడం వల్ల పిండి ఉండలు కట్టకుండా ఉంటుంది.
పాలు, బియ్యం పిండి రెండూ కలిసి.. చక్కటి పేస్ట్ మాదిరిగా తయారవుతాయి. ఆ సమయంలో పిండిని బాగా కలుపుతూ ఉండాలి. యాలకుల పొడి, కుంకుమపువ్వులు వేసి దానిని బాగా కలపాలి. పిండి కస్టర్డ్ మాదిరిగా అయ్యేవరకు దానిని కలుపుతూనే ఉండాలి. కస్టర్డ్ లాగా మారిన తర్వాత స్టౌవ్ ఆపేయాలి. దానిలో స్వీటనర్ మిక్స్ చేయాలి. అంతే వేడి వేడి కేసరి పిస్తా ఫిర్ని రెడీ. దీనిని మట్టిపాత్రల్లో తీసుకుని.. పిస్తా తురుముతో గార్నిష్ చేసుకోవాలి. రూమ్ టెంపరేచర్‌కి వచ్చిన తర్వాత.. వాటిని ఫ్రిజ్‌లో పెట్టాలి. దీనిని చల్లగా తింటేనే రుచి బాగా తెలుస్తుంది.
Also Read : హ్యాపీ హోలీ.. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి హోలీ శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి..