వయసుతో సంబంధం లేకుండా ఇప్పుడు గుండె జబ్బుల బారిన పడుతున్నారు అధిక శాతం మంది. గుండె జబ్బులు, గుండెపోటు వచ్చే అవకాశాన్ని ముందే తెలుసుకుంటే ఎలాంటి సమస్య ఉండదని, ప్రాణాలను కాపాడుకోవచ్చని భావించారు అధ్యయనకర్తలు. అందుకోసం ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. జుట్టు ద్వారా భవిష్యత్తులో గుండెజబ్బులు వచ్చే ప్రమాదాన్ని అంచనా వేయవచ్చని తమ పరిశోధనలో కనుగొన్నారు. జుట్టు ద్వారా గుండె జబ్బులను అంచనా వేయడం అనేది సైన్సులో పురోగతిని సూచిస్తుందని వారు భావించారు.
ఎలా తెలుస్తుంది?
గుండె జబ్బులకు ముఖ్య కారణం ఒత్తిడి. ఒత్తిడి అధికంగా ఉంటే గుండెపోటు, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జుట్టులో ఒత్తిడి హార్మోను స్థాయిని కొలవడం ద్వారా భవిష్యత్తులో హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని అంచనా వేయచ్చని చెబుతున్నారు అధ్యయనకర్తలు. జుట్టులో గ్లూకోకార్తికైడ్ స్థాయిలు తెలుసుకుంటే గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని అంచనా వేయొచ్చు. ఒత్తిడికి ప్రతిస్పందనగా శరీరంలో స్రవించే స్టెరాయిడ్ హార్మోన్లను కూడా కొలవడం ద్వారా గుండె సంబంధం వ్యాధులు వచ్చే అవకాశాన్ని తెలుసుకోవచ్చు. దీర్ఘకాలిక ఒత్తిడి మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ అధ్యయనాల్లో ఎక్కువ కాలం పాటు జుట్టులో గ్లూకో కార్తికైడ్ స్థాయిలు ఎక్కువగా ఉంటే ఆ వ్యక్తులు గుండె రక్త ప్రసరణ వ్యాధులను అభివృద్ధి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఈ అధ్యయనం చెబుతోంది.
ఈ అధ్యయనంలో భాగంగా 18 ఏళ్లు నిండిన 6000 మందికి పైగా పురుషులు, మహిళలను పరీక్షించారు. వారి జుట్టు నమూనాలలో కార్టిసోల్, కార్టిసోన్ స్థాయిలను విశ్లేషించారు. ఈ రెండూ కూడా ఒత్తిడి హార్మోన్లు. ఈ రెండు కూడా గుండె సంబంధ వ్యాధులతో దీర్ఘకాలిక అనుబంధాన్ని కలిగి ఉంటాయి. దీర్ఘకాలికంగా జుట్టులో కార్టిసోన్ స్థాయిలు ఎక్కువగా ఉన్న వ్యక్తుల్లో గుండెపోటు వచ్చే అవకాశం రెండు రెట్లు ఎక్కువ అని చెబుతున్నారు పరిశోధకులు. అదే 57 సంవత్సరాలు అంతకంటే తక్కువ వయసు ఉన్న వారిలో మూడు రెట్లు ఎక్కువగా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందో లేదో తెలుసుకోవడానికి భవిష్యత్తులో హెయిర్ అనాలసిస్ ఉత్తమ పరీక్షగా ఉపయోగపడుతుందని అధ్యయనకర్తలు భావిస్తున్నారు
ఒత్తిడిని తగ్గించుకోకపోతే త్వరగా గుండె సంబంధ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ఒత్తిడి వల్ల శరీరం మొత్తం పాడవుతుంది. అవయవాల పనితీరు క్షీణిస్తుంది. అందుకే ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. ప్రెషర్ అనిపిస్తున్నప్పుడు మీకు నచ్చిన పనులు చేయాలి. బ్రేక్ తీసుకుని అలా చల్లగాలికి తిరిగి రావాలి. నడక వల్ల ఒత్తిడి చాలా వరకు తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
Also read: పచ్చళ్లు, ఆవకాయల తయారీలో ఆవనూనెనే ఎందుకు వాడతారు?
Also read: రసాయనాలతో పండించిన మామిడి పండ్లను తింటే జరిగే ఆరోగ్య అనార్ధాలు ఇవిగో
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.