Good Sleep And Mental Happiness With Physical Activity: కంటినిండా నిద్రపోయే వారి ఏ రోగాలు ఉండవని పెద్దలు చెప్తారు. అయితే, కంటి నిండా నిద్రపోవాలంటే, అందుకు తగినంత శారీరక శ్రమ అవసరమని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. శారీరక శ్రమ, నిద్ర నాణ్యత, మానసిక ఉల్లాసం మధ్య బలమైన లింక్ ఉన్నట్లు తేలింది. అయితే, విషయం మనకు తెలిసిందే. కానీ, అమెరికా శాస్త్రవేత్తలు ఆధారాలతో సహా కొత్తగా కనుగొన్నారు. ఆ వివరాలు మీ కోసం..


శారీరక శ్రమతో చక్కటి నిద్ర


అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ పరిశోధనా బృందం తాజాగా నిద్రకు సంబంధించి ఓ స్టడీ నిర్వహించింది. ఇందులో సాధారణ వ్యాయామం నిద్రకు సంబంధించి రాపిడ్ ఐ మూవ్మెంట్(REM) దశలోకి ప్రవేశించే సమయాన్ని పొడిగించినట్లు కనుగొన్నారు. అంతేకాదు, ఈ సమయంలో ఆహ్లాదకర కలలను ఆస్వాదించే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. గత పరిశోధనలో ఓ వ్యక్తి ఒక రాత్రిలో నిద్రపోయే ఆధారంగా ఈ బృందం పరిశోధన నిర్వహించగా, ఈసారి నిద్ర టెస్ట్ చేసే వారి రోజువారీ కార్యకలాపాలతో పాటు చాలా నెలల పాటు వారు నిద్ర పోయే విధానాన్ని ట్రాక్ చేసింది. యాక్టివిటీ ట్రాకర్లు, స్మార్ట్‌ ఫోన్ యాప్‌ల ద్వారా 82 మంది యువకులపై ఈ స్టడీ నిర్వహించింది.     


ల్యాబ్‌తో పోల్చితే బయటి వాతావరణం కచ్చితమైన ఫలితాలు


ఈ 82 మందికి ఏర్పాటు చేసిన ట్రాకర్స్ ద్వారా వారి హృదయ స్పందన రేటు, నిద్రలోని దశలును పరిశోధకులు రికార్డు చేశారు. శారీరక శ్రమ అనేది నిద్ర, మానసిక స్థితిని ఎలా ప్రభావితం చేస్తుందనే అంశంపై కీలక డేటాను సేకరించారు. సాంప్రదాయ ల్యాబ్ టెస్ట్ అనేది ఒత్తిడితో కూడుకున్నదని, నిద్రకు సంబంధించిన సమగ్ర వివరాలను ట్రాక్ చేసే వెసులుబాటు కలగదని ఈ స్టడీలో పాల్గొన్నసైకాలజీ ప్రొఫెసర్ బెంజమిన్ బైర్డ్ తెలిపారు. బయటి వాతావరణంలో నిర్వహించిన స్టడీ ద్వారా వాస్తవ ఫలితాలు వస్తాయని తెలిపారు. అలా చేసిన పరిశోధనలో శారీరక శ్రమ చక్కటి నిద్రకు కారణం అయ్యిందని వెల్లడించారు. అంతేకాదు, మానసిక వత్తిడి స్థాయిలు కూడా తగ్గినట్లు గుర్తించామన్నారు.  


శారీరక శ్రమ చేసిన వారిలో నాణ్యమైన నిద్ర


స్లీప్ ఆర్కిటెక్చర్‌లోని పలు వ్యత్యాసాలను తాజా స్టడీ ద్వారా గుర్తించినట్లు బైర్డ్ వివరించారు. శారీరక శ్రమ ద్వారా నిద్ర నాణ్యత, మానసిక స్థితి ఎలా ప్రభావింతం చేయబడుతుందో గుర్తించినట్లు వెల్లడించారు. స్లీప్ ఆర్కిటెక్చర్ అనేది ప్రతి 90 నుంచి 120 నిమిషాలకు ఓసారి మారుతుందని చెప్పారు. మొదట సాధారణ, ఆ తర్వాత లోతైన, మూడో దశలో మరింత లోతైన దశలు ఉంటాయని చెప్పారు. శారీరక శ్రమ చేసిన వారిలో ఎక్కువగా మూడో దశ నిద్రకు కారణం అవుతుందని తెలిపారు. వాస్తవానికి ఫిట్ బిట్ లాంటి హెల్త్ ట్రాకర్స్ తో ల్యాబ్ లో చేసిన స్లీప్ టెస్ట్ తో పోల్చితే బయటి వాతావరణంలో నిర్వహించిన అధ్యయనం చక్కటి ఫలితాలను అందించిందని ఈ స్టడీలో పాల్గొన్న మరో పరిశోధకుడు డేవిడ్ M. ష్నియర్ తెలిపారు.


Read Also: భూమిని చీల్చుకుని పుడుతోన్న మరో మహా సముద్రం - ఆ దేశంలో భారీ పగుళ్లు, మరో ఖండం ఏర్పడనుందా?