ప్రపంచంలో కాఫీ అభిమానుల సంఖ్యే ఎక్కువే. వారందరకీ ఓ కొత్త అధ్యయనం శుభవార్తను మోసుకొచ్చింది. రోజూ కాఫీ తాగే వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. అలాగని అన్ని రకాల క్యాన్సర్లు అనుకోకండి. గర్భాశయ పొరపై వచ్చే క్యాన్సర్, దీన్నే ‘ఎండోమెట్రియల్ క్యాన్సర్’ అంటారు. మహిళల్లో ఇది వస్తుంది. కాఫీని క్రమం తప్పకుండా తీసుకునే ఆడవారిలో ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా తక్కువని తేలింది. దానితో పాటు, కెఫీన్ లేని కాఫీ కంటే కెఫీన్ ఉన్న కాఫీనే ఈ విషయంలో ఉత్తమ రక్షణను అందిస్తుందని కూడా చెబుతున్నారు పరిశోధకులు. ఈ అధ్యయనం తాలుకు వివరాలు ‘జర్నల్ ఆప్ అబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ రీసెర్చ్’లో ప్రచురించారు. ఈ అధ్యయనం కోసం భారీ ఎత్తునే పరిశోధన జరిగింది.
మొత్తం 6,99,234 మందిపై ఈ పరిశోధన నిర్వహించారు. వీరిలో రోజూ కాఫీ తాగే వారిలో ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే అవకాశం 29 శాతం తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. వీరిలో కాఫీ తాగే అలవాటు లేనివారిలో 9000 మందికి పైగా ఈ క్యాన్సర్ బారిన పడినట్టు కనుగొన్నారు. అయితే కాఫీ క్యాన్సర్ రాకుండా ఎలా అడ్డుకుంటుందో తెలుసుకోవడానికి మాత్రం ఇంకా లోతెైన పరిశోధనలు అవసరమని తేల్చారు. వాటి మధ్య అనుబంధం ఉందన్నది వాస్తవం, కానీ ఆ అనుబంధం ఎలా ఏర్పడిందన్నది తెలుసుకోవాలంటే మాత్రం కాస్త సమయం పడుతుందని అని చెబుతున్నారు.
కాఫీలో ఉండే కెఫీన్ శరీరంలో చేరిన వెంటనే తక్షణ శక్తిని ఇస్తుంది. చురుకుదనాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. అందుకే కాఫీని ఎక్కువ మంది ప్రజలు ఇష్టపడతారు. అయితే కాఫీ రోజుకు రెండు కప్పులకు మించి తాగకూడదని చాలా పరిశోధనలు చెబుతున్నాయి. శరీరంలో మోతాదుకు మించి కెఫీన్ చేరినా కూడా ప్రమాదమే.
కాఫీ మితంగా తాగడం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా గతంలోనే బయటపడ్డాయి. పంచదార వేయని కాఫీ తాగితే డయాబెటిస్ రోగులుకు చాలా మంచిది. ఇది స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. పార్కిన్సన్స్ వ్యాధి వచ్చే ముప్పును కూడా 25శాతం తగ్గిస్తుంది. అందుకే రోజూ కాఫీ తాగమని సిఫారసు చేస్తున్నాయి కొన్ని అధ్యయనాలు అయితే రోజుకు రెండు కప్పులకు మించి మాత్రం తాగవద్దని చెబుతున్నాయి.
Also read: గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే... ఈ చిట్కాలు పాటించాల్సిందే