ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బుల కారణంగా మరిణిస్తున్న వారి రేటు పెరిగిపోతోంది. అందులోను యువతరంలో కూడా గుండె సంబంధ వ్యాధులు, సమస్యలు కనిపించడం కలవరపాటుకు గురిచేస్తోంది. గ్లోబల్ నివేదరిక ప్రకారం పొగాకు వాడడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మద్యపానం వంటి గుండె సంబంధ వ్యాధులకు కారణాలుగా కనిపిస్తున్నాయి. వీటిని పరిష్కరిస్తే గుండె సంబంధిత వ్యాధులను నివారించవచ్చని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గుండె సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చని అంటున్నారు. ఆ జాగ్రత్తల జాబితా ఇదిగో...
ఈ నూనెలు మంచివి
ఆహారం మితంగా తినడం చాలా అవసరం. అతి ఎప్పుడూ అనర్థమే. ఆహారాలలో నూనె శాతం కూడా తక్కువ ఉండేలా చూసుకోవాలి. పెద్దవారు నెలకు అరలీటరు ఆలివ్ నూనె, కనోలా నూనె, అవిసె గింజల నూనె వంటి సంతృప్త కొవ్వులతో కూడిన ఆయిల్‌ను వినయోగించమని వైద్యులు సిఫారసు చేస్తున్నారు. ఆకుకూరలు, గింజలు, ప్రోటీన్, ఫైబర్ కలిగిన ఆహారం తినాలని చెబుతున్నారు. మాంసాన్ని తగ్గిస్తే మంచిది.
రోజుకు నలభై నిమిషాలు
రోజుకు నలభై నిమిషాల పాటూ వ్యాయామం చేయాల్సిన అవసరం ఉంది. వారంలో అయిదు రోజుల పాటూ రోజుకు నలభై నిమిషాలు ఎక్సర్ సైజులు చేస్తే హృదయ సంబంధ వ్యాధులు 30 శాతం తగ్గించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గించడంలో కూడా ముందుంటుంది. రక్తపోటు, బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది, లైంగిక జీవితాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
ధూమపానం, మద్యపానం
ప్రపంచఆరోగ్య సంస్థ ఇచ్చిన సమాచారం ప్రకారం ధూమపానం, మద్యపానం వల్ల గుండె జబ్బులు ఎక్కువగా వస్తాయి. ఇవి గుండె సమస్యలు వచ్చే అవకాశాన్ని 50 శాతం పెంచుతాయి. హైపర్ టెన్షన్, స్ట్రోక్స్, హార్ట్ ఫెయిల్యూర్ వంటి ఇతరత్రా రోగాల ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. వీటిని మానేయాల్సిన అవసరం ఉంది.
తగినంత నిద్ర
రోజూ తగినంత నిద్ర చాలా ముఖ్యం. నిద్ర మానసిక ఆరోగ్యంతో పాటూ, గుండె ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. రోజుకు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల పాటూ గాఢనిద్ర పోవాలి.
నవ్వు
గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గించే మరొక ప్రభావవంతమైన మార్గం నవ్వు. నవ్వడం వల్ల ఒత్తిడిని అణచివేసే ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇది మీ రక్తపోటును తగ్గించడంతో పాటూ, రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. కాబట్టి వీలైనంత వరకు నవ్వుతూ ఉండేందుకు ప్రయత్నించండి.
అప్పుడప్పుడు చెకప్‌లు
ఎప్పుడో సమస్యగా అనిపించినప్పుడు టెస్టులకు వెళ్లడం కాదు, ప్రతి ఆరునెలలకోసారి అన్ని శారీరక పరీక్షలు నిర్వహించుకోవాలి. రక్తపోటు, బరువు, కొలెస్ట్రాల్, మూత్రపిండాలు, కాలేయం, థైరాయిడ్ పనితీరు, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు, ఈసీజీ చేయించుకోవాలి. దీనివల్ల సమస్యలు ఏవైనా ఉండే ముదిరిపోకుండానే బయటపడతాయి. తగిన జాగ్రత్తలు తీసుకోగలుగుతారు.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also Read: కరోనాలాంటి వైరస్‌లను అంతం చేయలేం... పర్యావరణంలో భాగంగా కలిసిపోవడమే వాటి ముగింపు, WHO కీలక వ్యాఖ్యలు