Chicken Recipe: చికెన్ అంటే ఇష్టమా? ఎప్పుడూ చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, చికెన్ 65, చికెన్ గ్రేవీ ఇవేనా... ఓసారి గోల్కొండ చికెన్ రెసిపీ ప్రయత్నించండి. దీని కొత్త రుచి మీకు నచ్చేస్తుంది.చేయడం కూడా పెద్ద కష్టమేం కాదు.
కావాల్సిన పదార్థాలు
చికెన్ ముక్కలు - పావుకిలో
గుడ్డు - ఒకటి
కార్న్ ఫ్లోర్ - ఒక టీస్పూను
నిమ్మరసం - రెండు టీస్పూనులు
ఉప్పు - రుచికి సరిపడా
పచ్చిమిర్చి - పది
అల్లం - చిన్న ముక్క
వెల్లుల్లి - ఆరు రెబ్బలు
కొత్తిమీరు తరుగు - రెండు స్పూన్లు
కరివేపాకులు - రెండు రెమ్మలు
పెరుగు - పావు కప్పు
కారం - అర టీస్పూను
ధనియాల పొడి - అర టీస్పూను
ఉల్లిపాయ - ఒకటి
మిరియాల పొడి - ఒక టీస్పూను
నూనె - సరిపడినంత
తయారీ ఇలా
1. చికెన్ ముక్కల్ని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి.
2. అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కార్న్ ఫ్లోర్ పొడి, ఉప్పు, మిరియల పొడి వేసి కలపాలి.
3. గుడ్డు కూడా వేసి బాగా కలిపి అరగంట పాటూ ఫ్రిజ్‌లో పెట్టి మారినేట్ చేయాలి.
4. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడెక్కనివ్వాలి. చికెన్ ముక్కలు డీప్ ఫ్రై చేయడానికి సరిపడేంత నూనె వేయాలి .
5. నూనె వేడెక్కాక మారినేట్ చేసిన చికెన్ ముక్కల్ని వేయించుకోవాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
6. ఇప్పుడు మరో కళాయిలో రెండు స్పూన్ల నూనె వేసి అందులో తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, నిలువగా తరిగిన ఉల్లి పాయలు, పచ్చిమిర్చి, కరివేపాకులు వేసి వేయించాలి.
7. అవన్నీ వేగాక పెరుగు, కొంచెం నీళ్లు వేసి ఉడకనివ్వాలి. అందులో వేయించి పెట్టుకున్న చికెన్, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.
8. చిన్న మంట మీదే నీరంతా ఇంకి పోయే వరకు వేయించాలి.
9. నీరంతా ఇంకిపోయి, పెరుగును చికెన్ ముక్కలు పీల్చుకుంటాయి. అప్పుడు పైన కొత్తిమీరను చల్లి స్టవ్ కట్టేయాలి.
10. టేస్టీ గోల్కొండ చికెన్ రెడీ అయినట్టే.
కోడి మాంసం మనకు ఎన్నో రకాలుగా మంచి చేస్తుంది. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇ విటమిన్, సోడియం, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, జింక్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మనకు అత్యవసరమైనవి. జలుబు చేసినప్పుడు చికెన్ చేసిన వంటకాలు తింటే త్వరగా ఉపశమనం లభిస్తుంది. కండరాలు ఆరోగ్యంగా ఎదిగేందుకు చికెన్లోని ప్రొటీన్ చాలా అవసరం. ఇక చికెన్లో కొవ్వు తక్కువగా ఉంటుంది కాబట్టి తరచూ తిన్నా ఫర్వాలేదు. పిల్లలకు చికెన్ పెట్టడం వల్ల వారి మెదడు పనితీరు మెరుగుపడుతుంది. అయితే స్కిన్ లెస్ చికెన్ తినడం ఉత్తమం. ఎందుకంటే కోడిచర్మంలోనే ఎక్కువ కొవ్వు పేరుకుని ఉంటుంది.
Also read: సద్దుల బతుకమ్మకు సత్తు పిండి, కొబ్బరన్నం - చేయడం చాలా సులువు
Also read: తొమ్మిది రోజులు బతుకమ్మ ఇష్టపడే నైవేద్యాలు ఇవే, నిమిషాల్లో రెడీ చేసేయచ్చు